Friday, April 19, 2024

తొలకరి పలుకరింపు..

తెలంగాణలో తొలకరి వర్షాలు పలుకరించాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో 13 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదయింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయింది. తెల్లవారుజామునుంచి లాక్‌డౌన్‌ మినహాయింపు సమయం ముగిసే దాకా వర్షం కురుస్తూనే ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు మత్తడులు దుంకాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. రెండురోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయని ఐఎండీ తెలిపింది.

సాధారణంగా జూన్‌1న ప్రవేశించాల్సిన రుతుపవనాలు రెండురోజులు ఆలస్యంగా వచ్చాయి. కేరళతోపాటు లక్షద్వీప్‌, దక్షిణ తమిళనాడు, మాల్దీవులు, నైరుతి బంగాళాఖాతంలో కొంతభాగంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. మరో 48 గంటల్లో దక్షిణ అరేబియా, మధ్య అరేబియా, తమిళనాడు, పుదుచ్చేరి, కోస్టల్‌ ఇంటీరియల్‌ కర్ణాటకలో ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కే నాగరత్న తెలిపారు. రుతుపవాల ఆగమనం, ఉపరితల ద్రోణి కారణంగా శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. నైరుతి, మధ్య తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement