Thursday, April 18, 2024

అలర్ట్: తెలంగాణ, ఏపీలో రెండు రోజులు భారీ వర్షాలు..

రాగల రెండు రోజుల పాటు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ రేప భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. కుమురం భీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు చెప్పారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా ప్రాంతాల మీదుగా కొనసాగుతుందని పేర్కొంది.

ఇక ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం లో ఈరోజు ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడే అవకాశం, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర ,రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.

దీనికి అనుబంధంగా.. మధ్య ట్రోపోస్ఫియర్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించినట్లు చెప్పింది. రానున్న రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిశా, జార్ఖండ్,ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఉత్తర పశ్చిమ ద్రోణి, అల్పపీడన ప్రాంతం నుంచి దక్షిణ ఛత్తీ‌స్‌గఢ్, విదర్భ, ఉత్తర, మధ్య మహారాష్ట్ర మీదుగా అరేబియా సముద్రం వరకు 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడినట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement