Wednesday, April 17, 2024

రైలులో చింతన్‌ శిబిరానికి రాహుల్‌.. మారిన వ్యవహార శైలి

నేపాల్‌ నైట్‌ క్లబ్‌ వివాదంతో మసకబారిన ప్రతిష్ట పెంచుకోవడానికి కాంగ్రెస్‌ యువరాజు రాహుల్‌ గాంధీ దిద్దుబాటు కార్యక్రమం చేపట్టారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో శుక్రవారం ప్రారంభమైన కాంగ్రెస్‌ నవ సంకల్ప్‌ శివిర్‌కు ఆయన ఇతర సీనియర్‌ నాయకులతో కలిసి రైలు వెళ్లారు. ఒక సాధారణ నేతగా ఆయన వ్యవహరించారు. చేతిలో బ్యాగ్‌తో ఆయన చేతక్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి ఉదయ్‌పూర్‌ వెళ్లారు. పార్టీ బుక్‌ చేసిన స్పెషల్‌ కంపార్ట్‌మెంట్‌లో ఆయన ప్రయాణం చేశారు. రైలు ప్రయాణం ద్వారా రాహుల్‌ సామాన్యుల గుండెల్లో స్థానం సంపాదించుకుంటారని సీనియర్లు అంటున్నారు. నిజానికి వారిచ్చిన సలహా మేరకే ఆయన రైలులో బయలుదేరారని తెలిసింది. నేపాల్‌ నైట్‌ క్లబ్‌లో తన మిత్రులతో కలిసి గడిపిన వీడియోనున బీజేపీ నాయకులు సామాజిక మాద్యమంలో పెట్టి… నానా రచ్చ చేయడంతో దానివల్ల ఏర్పడిన నష్టాన్ని రైలు ప్రయాణం ద్వారా పూడ్చుకోవాలన్నది కాంగ్రెస్‌ వ్యూహం. గురువారం రాత్రి 11 గంటలకు బయలుదేరిన రైలు 12 గంటల ప్రయాణం తరువాత ఉదయ్‌పూర్‌ చేరుకున్నది. రైలు ప్రయాణం సాగినంత దూరం ప్రతి రైల్వే స్టేషన్‌లో రాహుల్‌ పార్టీ కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు. హర్యానా, రాజస్థాన్‌కు చెందిన కార్యకర్తలు చేతుల్లో రాహుల్‌ పోస్టర్లను పట్టుకొని కనిపించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌లోని వివిధ గ్రూపులు బల ప్రదర్శనకు దిగాయనే చెప్పుకోవచ్చు. నాయకులు పోటీ పడి మరీ… కార్యకర్తలను రైల్వే స్టేషన్లకు రప్పించారు. దాదాపు ప్రతి స్టేషన్‌లో రాహుల్‌ తమ కార్యకర్తల సందడిని ఎంజాయ్‌ చేశారు. రైలు కొద్ది నిమిషాలే ఆగినా… కార్యకర్తలు ఎక్కడా రాజీ పడలేదు. రాహుల్‌కు పూల దండలు, గులాబీ పూలు ఇచ్చి మురిసిపోయారు. రాహుల్‌ కూడా ఎక్కడా విసుక్కోకుండా వారిని ఆనందపరిచారు. చిత్తోర్‌గఢ్‌ రైల్వే స్టేషన్‌లో ఆయన తోటి నాయకులతో కలిసి టీ కూడా తాగారు. అక్కడ ఆయన సాధారణ ప్రయాణికులను కలుసుకున్నారు. వారిలో ఎక్కువ మంది యువకులే ఉన్నారు. వారి సమస్యలను ఆయన ఓపిగ్గా విన్నారు. అక్కడున్న పోర్టర్‌లతో ఆయన ముచ్చటించారు. కేవలం ఉద్యోగుల సమస్యలే కాదు… రైతుల సమస్యలను కూడా వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారని ఓ సీనియర్‌ నాయకుడు తెలియజేశారు. రాహుల్‌తో పాటు రైలులో ప్రయాణించిన కాంగ్రెస్‌ నాయకులు కూడా రాహుల్‌ వ్యవహార శైలి పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ప్రజలకు చేరువగా వెళ్లని తీరును అభినందించారు. రాహుల్‌ ప్రజా నాయకుడని వారు ప్రశంసలతో ముంచెత్తారు.

చింతన్‌ శిబిర్‌లో కఠిన ఆంక్షలు
శుక్రవారం ఉదయం ఇక్కడ ప్రారంభమైన కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌లో దాదాపు 400 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. సోనియా, రాహుల్‌, ప్రియాంక హాజరవుతున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘుర పరాజయం తర్వాత నిర్వహిస్తున్న్‌ ఈ మేధోమథనం సదస్సులో కీలక మార్పులు జరుగుతాయని ఇప్పటికే ఆ పార్టీ సీనియర్‌ అజయ్‌ మాకెన్‌ వ్యాఖ్యానించారు. కుటుంబంలో ఒకరికే ఎన్నికల్లో పోటీచేసే అవకావం కల్పించే అంశం పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం తర్వాత ప్రతినిధులంతా ఆరు గ్రూపులుగా ఏర్పడి చర్చలు మొదలు పెట్టారు. దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు, ఉపాధి, రైతులకు సంబంధించిన అంశాలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ ప్రక్షాళన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ చర్చల క్రమంలో పార్టీ కీలక జాగ్రత్తలు తీసుకుంది. ఏ ఒక్క నేత కూడా మొబైల్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలను లోపలికి తీసుకెళ్లరాదని ఆదేశించింది. చర్చల సమయంలో వాటిని తమ వద్ద పెట్టుకోవద్దని కఠిన హెచ్చరికలు చేసింది. చర్చలు జరిగే అంశాల్లో ఏ ఒక్క విషయం బయటకు రాకుండా గోప్యత పాటించాలని ఏఐసీసీ అధిష్ఠానం ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement