Thursday, April 25, 2024

బాధ్యులపై చర్యలు తీసుకోండి: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన రఘురామ..

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు గత రాత్రి 9.20 గంటల సమయంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి అరగంటపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన అరెస్టుకు దారితీసిన అంశాలను వివరించారు. జగన్‌మోహన్‌రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ తాను సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని జీర్ణించుకోలేక కక్షతోనే తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని స్పీకర్‌కు వివరించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు అయిన గాయాలపై గుంటూరు ప్రభుత్వ వైద్యుల బృందం ఇచ్చిన అసత్యాల నివేదికపై హైకోర్టు, సీఐడీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సీఐడీ పోలీసులు బేఖాతరు చేశారన్నారు. వారికి కోర్టు ధిక్కారణ నోటీసులు కూడా జారీ అయినట్టు గుర్తు చేశారు. రఘురామ కృష్ణరాజు చెప్పినవన్నీ విన్న స్పీకర్ ఓం బిర్లా విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

తన కేసులో ముఖ్యమంత్రి జగన్, డీజీపీ, సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్, ఏఎస్‌పీ విజయ్‌పాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. తనపై రాజద్రోహం కేసు పెట్టి చిత్రహింసలకు గురిచేశారని, తనను తీవ్రంగా గాయపరిచారని స్పీకర్‌కు తెలిపారు. తాను సీఐడీ కస్టడీలో ఉన్న సమయంలో ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు తనను తీవ్రంగా కొట్టారన్నారు. పార్లమెంటు సభ్యుడిగా తన హక్కులకు భంగం కలిగించారని, తన అరెస్టుకు ముందు స్పీకర్‌గా మీకు సమాచారం కూడా ఇవ్వలేదని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement