Sunday, May 9, 2021

వైద్యం చేయమంటే వేధింపులు పెరిగాయంటారా?

కరోనా వేళ చావుబతుకుల మధ్య ఆస్పత్రులకు వస్తున్న రోగుల రక్తం పీలుస్తున్నాయి కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తుంటే.. ఆస్పత్రుల యాజమాన్యాలకు ఎక్కడ లేని కోపం వస్తోంది. ప్రభుత్వం తన విధులు నిర్వర్తిస్తుంటే కార్పొరేట్ ఆస్పత్రులకు మాత్రం అవి వేధింపుల్లాగా కనిపిస్తున్నాయి. డాక్టర్లను విధిస్తున్నందుకు నిరసనగా తమ ఆస్పత్రుల్లో కరోనా రోగులను చేర్చుకోబోమని బోర్డులు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కడప జిల్లాలో కోన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కోవిడ్ రోగులను చేర్చుకోబోమని ఆస్పత్రుల ఎదుట బోర్డులు పెట్టడంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రుల యాజమాన్యాలు అధిక ఫీజుల పేరుతో పేదలను జలగ లాగా రక్తాన్ని పీల్చుకోంటుంటే విజెలెన్సు తనిఖీలు చేయకూడదా? అని ప్రశ్నించారు.  నిజాయితీతో పేదలకు వైద్యం చేయమంటే వేధింపులు పెరిగాయంటారా? అంటూ మండిపడ్డారు. దశాబ్దకాలంగా వేలకోట్లు తీసుకున్నప్రైవేటు యాజమాన్యాలకు నాడు ఆరోగ్యశ్రీ  పేరుతో మాములు రోజులలో కోట్లు తీసుకున్నారు కదా ? అని అన్నారు.  నేడు ఈ ధరలతో కోవిడ్ కు చికిత్స చేయలేమంటున్న ప్రైవేట్ ఆస్పత్రులు  సిగ్గుపడాలని విమర్శించారు. వైద్యాన్ని అమ్ముకోంటున్న కోందరు ప్రైవేట్ ఆసుపత్రులను చూసి నిజాయితీగా పని చేసే మంచి డాక్టర్లు సిగ్గు పడుతున్నారని పేర్కొన్నారు. ఆసుపత్రులు బంద్ అన్న ఆ ఆసుపత్రుల అనుమతి వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ ఆసుపత్రులకి గతంలో ఆరోగ్య శ్రీ  ఇచ్చిన నిధులపై విచారణ చేయాలన్నారు. దేశం మొత్తం అల్లకల్లోలం అవుతుంటే.. కొన్ని ఆసుపత్రులు వైద్యంను’బ్లాక్ మార్కెట్ ‘ చేస్తూ ఒకొక్క బెడ్ కి రూ. 30 వేల నుండి 60 వేల వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆసుపత్రుల యాజమాన్యాల డాక్టర్ డిగ్రీని సైతం రద్దు చేయాల్సిందిగా కేంద్రానికి సిఫార్సు చేయాలని తెలిపారు. ఆయా ఆసుపత్రుల యాజమాన్యంలో ఉన్న  డాక్టర్ల ప్రాక్టీసు సైతం 10 ఏళ్ల పాటు రద్దు చేసి నిషేధం విదించే కొత్త చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

కాగా, గత రెండు మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ సేవలు అందిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులపై వైద్య ఆరోగ్య శాఖ దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే నిబంధనలు పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న పలు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంది. సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల య‌జ‌మానులు బ‌రి తెగించారు. ప్ర‌భుత్వంతో పాటు ప్ర‌జానీకంపై ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్‌కు తెగ‌బ‌డ్డారు. ఇక మీదట కోవిడ్ రోగుల‌ను చేర్చుకోకూడ‌ద‌ని క‌డ‌ప న‌గ‌రంలోని ప్రైవేట్ ఆస్ప‌త్రులు నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ మేర‌కు త‌మ ఆస్ప‌త్రుల ఎదుట బోర్డుల‌ను త‌గిలించ‌డం రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. కోవిడ్ పేషెంట్ల‌కు ట్రీట్‌మెంట్ పేరుతో ప్రైవేట్ ఆస్ప‌త్రులు విచ్చ‌ల‌విడిగా దోచుకుంటున్నాయ‌ని క‌డ‌ప న‌గ‌రంలోని ప‌లు వైద్య‌శాల‌ల‌పై పెద్ద ఎత్తున ప్ర‌భుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేప‌థ్యంలో క‌డ‌ప క‌లెక్ట‌ర్ హ‌రికిర‌ణ్ సీరియ‌స్ అయ్యారు. 

జాయింట్ క‌లెక్ట‌ర్ నేతృత్వంలో ఓ ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, సంబంధిత ఆస్ప‌త్రుల‌తో దాడులు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఫిర్యాదుల్లో వాస్త‌వం ఉన్న‌ట్టు నిర్ధార‌ణ అయ్యింది. దీంతో రూ.5 ల‌క్ష‌లు చొప్పున రెండు ఆస్ప‌త్రుల‌కు రూ.10 ల‌క్ష‌ల జ‌రిమానా విధించారు. అంత‌టితో ఆగ‌కుండా విజిలెన్స్ దాడుల‌ను పెంచారు. దీంతో త‌మ దోపిడీకి ప్ర‌భుత్వం అడ్డుక‌ట్ట వేస్తోంద‌ని ప్రైవేట్ ఆస్ప‌త్రుల య‌జ‌మానులంతా తిరుగుబాటు బాట ప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో ఈ రోజు న‌గ‌రంలోని IMA హాల్లో కోవిడ్ సెంట‌ర్లు నిర్వ‌హిస్తున్న ప్రైవేట్ ఆస్ప‌త్రుల య‌జ‌మానులు స‌మావేశ‌మ‌య్యారు. నిబంధ‌న‌ల పేరుతో ప్ర‌భుత్వం త‌మ‌పై కేసులు పెట్టి, జ‌రిమానాలు విధిస్తూ వేధింపుల‌కు పాల్ప‌డుతోందంటూ ఎదురు దాడికి దిగారు. ప్ర‌భుత్వ వైఖ‌రిని నిర‌సిస్తూ ఇక‌పై కోవిడ్ రోగుల‌ను చేర్చుకోవ‌ద్ద‌ని ప్రైవేట్ ఆస్ప‌త్రుల య‌జ‌మానులంతా తీర్మానించారు. వెంట‌నే కార్యాచ‌ర‌ణ‌కు కూడా దిగారు. 

Advertisement

తాజా వార్తలు

Prabha News