Monday, December 9, 2024

Spl Story | హస్మత్‌పేటలో ఆదిమానవుడి ఆనవాళ్లు.. గుప్తనిధుల వేటలో శిథిల‌మ‌వుతున్న‌ సమాధులు

విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌ శివార్లలో మాన‌వ‌ చరిత్రకు ఆనవాళ్లు ఎన్నో దాగి ఉన్నాయి. నాటి ఆదిమానవుడి చరిత్రను తెలిపే విశేషాలు గుప్తనిధుల వేటలో దుండ‌గుల‌ గునపు దెబ్బలకు ఛిద్రమవుతున్నాయి.. అంతేకాకుండా ఎంతో చారిత్రక నేపథ్యం గల ప్రాంతాలు భూకబ్జాదారుల కబంధ హస్తల్లో నలిగిపోతున్నాయి. దీంతో మానవ చరిత్రను తెలిపే అవశేషాలు శిథిలాల్లో కలిసిపోతున్నాయి. ఇక.. చరిత్రను కాపాడాల్సిన పురావస్తుశాఖ పరిశోధనలకు పరిమితం కాగా, పర్యాటకశాఖ అయితే అస్స‌లు పట్టించుకోవడమే లేదు. ఇట్లా.. ఆనాటి చరిత్రను తెలిపే సాక్ష్యాలెన్నో శిథిలాల్లో కలిసి మ‌న చ‌రిత్ర‌ను తెలియ‌జేయ‌కుండానే మాయం అమవుతున్నాయి.

– వంగ భూమేశ్వర్‌, ఆంధ్రప్రభ (తెలంగాణ ప్రభుత్వ మిషన్​ కాకతీయ అవార్డు గ్రహీత)

క్రీస్తు పూర్వం నాటి మానవుడు జలవాసాలను కేంద్రంగా చేసుకుని జనవాసాలు నిర్మించుకున్న ప్రాంతాల్లో హస్మత్‌ పేట చెరువుకు ప్రాధాన్యం ఉంది. చెరువు ఒడ్డున ప్రాచీన జనావాసం, మరికొంత దూరంలో ప్రాచీన సమాధులు (మెగాలిథ్స్‌) ఉన్నట్లు పురావస్తు శాఖ గుర్తించింది. వందల ఎకరాల్లో విస్తరించిన ప్రాచీన జనవాసం ఆనవాళ్లు ప్రస్తుతం హస్మత్‌ పేట బస్తీగా రూపాంతరం చెందింది. భూఆక్రమణలు జోరు అందుకోగా రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చినా ఫలితం లేకపోయింది. చరిత్ర ఆనవాళ్లు తెలిపే ప్రాచీన సమాధులు బహుళ అంతస్తుల భవనాల కింద నలిగిపోతున్నాయి. హస్మత్‌ పేట చెరువును ఆలంబనగా చేసుకుని విస్తరించిన ప్రాచీన మానవుడి ఉనికి తెలిపే చెరువు పారిశ్రామిక కాలుష్యానికి గురికాగా సమాధుల్లో నిధినిక్షేపాలు లభిస్తాయనే దురాశతో మెగాలిథ్స్‌ ధ్వంసం అవుతున్నాయి.

తెలంగాణలో మెగాలిథ్స్‌..

పురావస్తు భాషలో మెగాలిథ్స్‌ గా వ్యవహరించే ప్రాచీన మానవుల సమాధులు హస్మత్‌పేట చెరువు తీరాన వందల్లో ఉండగా ప్రస్తుతం వాటి ఆనవాళ్లు అక్కడక్కడ అగుపిస్తున్నాయి. క్రీస్తుపూర్వం 2000 లనుంచి 500ల సంవత్సరాల మధ్యలో కొనసాగిన కొత్తరాతి యుగంనాటి సమాధులు ఇవి. ఆనాటి సమాజంలో మానవులు గుంపులు గాజీవించే వారు. మరణించిన అనంతరం వారందరికీ ఒకే స్మశాన వాటిక ఉండేది. అలాంటిదే హస్మత్‌ పేటలోని సమాధులు. పునర్‌ జన్మపై నమ్మకం ఉన్న కొత్తరాతి యుగం నాటి మానవులు చనిపోతే ఆ భౌతికకాయాన్ని ఒకపెద్ద గోతితీసి దాని నలువైవుల పలుచనిబండలు అమర్చి అందులో మృతుడు ఉపయోగించిన వస్తువులు, ఆభరణాలు, ఆయుధాలు. ఆహారపదార్థలు భద్రపర్చి బండలతో గోయిపైకప్పువేసి మూసే వారు. సమాధిగుర్తుగా చుట్టూ పెద్దపెద్ద రాళ్లను పెట్టేవారు. లోహాలగురించి అప్పటికే నాటి మానవునికి తెలియడంతో ఆసమాధుల్లో సంపద ఉంటుందనే నమ్మకంతో నిధుల అన్వేషణలో ఈ మెగాలిథ్స్‌ ధ్వంసం అయ్యాయి.

- Advertisement -

ఈ సమాధులు హాస్మత్‌ పేట,ఖాజీపేట, ఆదిలాబాద్‌, కరీంనగర్‌,ఖ్మమం జిల్లాలో పురావస్తు శాఖ కనుగొన్నారు. మొదటిసారిగా 1877లో పురావస్తు ప్రొఫెసర్‌ గురు రాజారావు మెగాసిథ్స్‌ కల్చర్‌ ఇన్‌ సౌత్‌ ఇండియా పరిశోధన గ్రంధంలో తెలంగాణ ప్రాంతాల్లోని మెగాలిథ్స్‌ పై పరిశోధన చేసి వివరాలను వెల్లడించారు. అనంతరం 1918లో బ్రిటిష్‌ శాస్త్రవేత్త వకీ ఫీల్డ్‌ వీటిపై పరిశోధన చేశారు. నిజాం కాలంలో రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్‌ గా పనిచేసిన ఖాజా అహ్మద్‌ మెగలిథ్స్‌ పై విస్తృతపరిశోధనలు చేసి హస్మత్‌ పేట బృహత్‌ శిలాయుగం నాటి సమాధులను గుర్తించారు.

అనంతరం బిర్లా సైన్స్‌ సెంటర్‌ వీటిపై విస్తృత పరిశోధనచేసి సమాధుల్లోని ఒక స్కెలిటన్‌ ను సేకరించి ప్రస్తుతం హైదరాబాద్‌ బిర్లా సైన్స్‌ సెంటర్‌ లో పరిశోధనకు ఏర్పాటు చేశారు. ఈ స్కెలిటన్‌ డిఎన్‌ఏ కోసం అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అనంతరం రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్‌ గా బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్‌ అధికారి రామలక్ష్మణ్‌ ఆధ్వర్యంలో హస్మత్‌ పేటలో తవ్వకాలు జరిపి వందలాది సమాధులను గుర్తించారు. హస్మత్‌ పెేట చెరువునుఆధారంగా చేసుకుని ఇక్కడ వ్యవసాయం చేసి, వేటాడినట్లు రాష్ట్ర పురావస్తు శాఖ నిర్దారించింది.

హస్మత్‌ పేట చెరువు పురాతనమైంది..

కొత్తరాతియుగం నాటి మానవులకు వ్యవసాయం, పశుపోషణ, వేట తెలుసనే అనేక ఆధారాలున్నాయని ప్రముఖ చరిత్రకారుడు డా.ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. తాను పురావస్తు శాఖ అధికారిగా ఉన్నప్పుడు ఐఏఎస్‌ అధికారి రామలక్ష్మణ్‌ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిపినప్పుడు అనేక ఆధారాలు లభించాయని చెప్పారు. క్రీస్తుపూర్వం వేయి సంవత్సరాల ముందు హస్మత్‌ పేటలో పాతరాతి యుగం మానవులు గుంపులు గా జీవించినట్లు ఆధారాలున్నయన్నారు. ప్రస్తుతం హస్మత్‌ పేటచెరువుగా వ్యవహరిస్తున్న చెరువు బహుష చిన్నకుంటగా ఉంటే నాటి మానవులు తమ అవసరాలకోసం విశాలంగా తవ్వి ఉండవచ్చని చెప్పారు. అప్పటికే ఆనాటి మానవులకు ఇనుముతో సహా ఇతర గుహల గురించి తెలుసని తవ్వకాల్లో లభించిన వస్తువులు, ఆభరణాలు, ఆహారపదార్థల తో స్పష్టమైందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement