Tuesday, April 16, 2024

Breaking: ముగిసిన రాష్ట్రపతి ఎన్నికలు.. 21న ఫలితాల వెల్లడి, 25న ప్రమాణ స్వీకారం

ఇవ్వాల ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియు ముగిసింది. ఏపీ, తెలంగాణలో నిర్వహించిన ఈ ప్రక్రియ సాయంత్రం అయిదు గంటల దాకా కొనసాగింది. ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో పోలింగ్ ప్రారంభం కాగానే… పార్లమెంట్ హాల్ లో ప్రధాని మోదీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రులు అమిత్ షా, అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, హేమమాలిని ఓటేశారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కుమారుడు… బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక.. తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్​ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలోనే ఆయన విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలిపారు.

ఇందులో భాగంగా యశ్వంత్ సిన్హాను కేసీఆర్ హైదరాబాద్ ఆహ్వానించారు. జులై 2న హైదరాబాద్ జలవిహార్లో భారీ సభ నిర్వహించారు. ఈ సభలో యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ కార్యాలయం మొదటి అంతస్తులో ఓటింగ్ నిర్వహించారు. పోలింగ్ ప్రారంభం కాగానే. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి ఓటు వేశారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్, సహచర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, సురేష్, తానేటి వనిత ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్లమెంట్ హాల్ కు వీల్ ఛైర్ లో వచ్చి ఓటేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన రాజ్యసభ సెక్రెటరీ జనరల్ ఆధ్వర్యంలో 21న పార్లమెంటులో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు రాత్రి ఫలితారు ప్రకటిస్తారు. ఈనెల 25న 15వ రాష్ట్రపతిగా గెలిచిన అభ్యర్థి ప్రమాణస్వీకారం చేస్తారు. NDA తరఫున గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల నుంచి యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement