Friday, April 19, 2024

త్వరలోనే ప్రీఫైజర్‌ కొవిడ్‌ ట్యాబ్లెట్స్.. ఉత్పత్తికి హైదరాబాద్​ ఫార్మా సంస్థలు రెడీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రానున్న నాలుగు నెలల తర్వాత కరోనా నాలుగో వేవ్‌ విరుచుకుపడనుందన్న హెచ్చరికల నేపథ్యంలో కొవిడ్‌ పనిపట్టేం దుకు మరో ఔషధం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే అమెరికాలో కొవిడ్‌ చికిత్సలో వైద్యులు విరివిగా వినియోగిస్తున్న ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా కంపెనీ ప్రీఫైజర్‌ ఔషధం ట్యాబ్లెట్ల రూపంలో లభించనుంది. కొవిడ్‌ కట్టడికి ఫ్రీ ఫైజర్‌ కంపెనీ ప్లాక్స్‌లోవిడ్‌ పేరుతో (నిర్మాట్రివిర్‌ కీలక డ్రగ్‌)ను తయారు చేస్తోంది. ఈ డ్రగ్‌ వైరస్‌ సోకిన వ్యక్తి శరీరంలో వైరస్‌ ప్రోటీన్‌ పెరుగుదలను, మ్యుటేషన్లను సమర్థంగా ఆపుతోంది. కంపెనీ తయారు చేస్తున్న రిటోనవిర్‌ ట్యాబ్లెట్‌ నిర్మాట్రివిర్‌ ను వైరస్‌ సోకిన శరీరంలో యాక్టివ్‌గా ఉండేలా చేస్తోంది. దీంతో 80శాతం ఇన్‌ఫెక్షన్‌కు గురైన రోగి కి ప్రాణాపాయం సమర్థంగా తప్పుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న అరబిందో ఫార్మా లిమిటెడ్‌తోపాటు నగరంలోని గ్రాన్యుయల్స్‌ ఇండియా లిమిటెడ్‌, ఎంఎస్‌ఎన్‌ గ్రూప్‌, ఎస్‌ఎంఎస్‌ ఫార్మాసూటికల్స్‌ కూడా ప్రీఫైజర్‌ సౌజన్యంతో అమెరికాలో వినియోగంలో ఉన్న ఆ కంపెనీ ఔషధాలను హైదరాబాద్‌లో ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రక్రియకు హైదరాబాద్‌ ఫార్మా కంపెనీలు ఒక అడుగు దూరంలోనే ఉన్నాయి. అమెరికా కు చెందిన మెడిసిన్స్‌ పేటిఎంట్‌ పూల్‌ (ఎంపీపీ) నిర్మాట్రివిర్‌ కు చెందిన జనరిక్‌ మోడ్‌ను భారతదేశంలో ఉత్పత్తి చేసి అమ్మేందుకు అనుమతిస్తే నిర్మాట్రివిర్‌ కొవిడ్‌ ఔషధం త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో వినియోగంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

నిర్మాట్రివిర్‌ 150ఎంజీ , రిటినోవిర్‌ 150ఎంజీ రెండు కలిపి 300 ఎంజీతో ఈ ట్యాబ్లెట్లు లభించనున్నాయి. రోజూ రెండు సార్లు చొప్పున 5 రోజులపాటు ఈ ఔషధాలను వినియోగించాల్సి ఉంటుంది. ఎంపీపీ అనుమతి లభిస్తే భారతదేశంలోని ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేసిన ప్రీఫైజర్‌ కొవిడ్‌ ట్యాబ్లెట్లను ప్రపంచ వ్యాప్తంగా అమ్మే వీలు ఉంటుంది. పాక్సివిడ్‌ పేరుతో భారతదేశంలో ఈట్యాబ్లెను ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎంఎస్‌ఎన్‌ ఫార్మా ప్రకటించింది. నిర్మాట్రివిర్‌ , రిటినోవిం రెండు ట్యాబ్లెెట్లను కలిపి ఒకే డోసేజీ ప్యాక్‌ రూపంలో ఉత్పత్తి చేయనున్నారు. కరోనా కట్టడికి అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రీఫైజర్‌ ఫార్మా కంపెనీ టీకాను కూడా ఉత్పత్తి చేసింది. ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రీఫైజర్‌ కొవిడ్‌ టీకా ను వినియోగిస్తున్నారు. ప్రపంచాన్ని ఇప్పటికీ కొవిడ్‌ భయాలు వెంటాతుండడంతో ప్రీఫైజర్‌ తాను అభివృద్ధి చేసిన కొవిడ్‌ ట్యాబ్లెట్లను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement