Friday, April 26, 2024

ఆగిన చోటు నుంచే యాత్ర మొదలు: ఈటల

ఆగిన చోటు నుంచే తన పాద యాత్ర మొదలవుతుందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.  ‘ప్రజా దీవెన యాత్ర’లో ఈటల నిన్న అస్వస్థతకు గురయ్యారు.  జ్వరంతో పాటు కాళ్లనొప్పులతో బాధపడ్డారు. దీంతో పాదయాత్రకు విరామం ఇచ్చారు. పన్నెండు రోజులుగా,222 కిలోమీటర్లకు పైగా సాగిన ప్రజా దీవెన యాత్రలో ప్రతి క్షణం తన వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం చేస్తున్నా అని ఈటల అన్నారు. వేయాల్సిన అడుగులు,చేరాల్సిన ఊళ్లు చాలా ఉన్నాయని, కానీ ఊహించని అస్వస్థత వల్ల ప్రజా దీవెన యాత్రని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉందన్నారు. ఆరోగ్యం సహకరించగానే ప్రజా దీవెన యాత్ర మళ్ళీ పునః ప్రారంభం అవుతుందని చెప్పారు. ఆగిన చోటు నుండే అడుగులు మొదలవుతాయని, కొండంత మీ దీవెనలతో త్వరలో ప్రజా దీవెన యాత్రతో వస్తానని ఈటల స్పష్టం చేశారు.

కాగా, త్వరలో జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా జులై 19న ఈటల ‘ప్రజా దీవెన యాత్ర’ మొదలు పెట్టారు. నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం నుంచి ఈటల పాదయాత్ర ప్రారంభమైంది. ఇప్పటి వరకు 222 కిలోమీటర్ల మేర సాగింది. శుక్రవారం(జులై 30) వీణవంక మండలం కొండపాక వరకు ఈటల నడిచారు. మధ్యాహ్న భోజనం అనంతరం అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు పరీక్షలు చేయగా, జ్వరం, కాళ్ల నొప్పులతో ఈటల బాధపడుతున్నట్టు వెల్లడైంది. రక్తపోటు తగ్గిందని, షుగర్ లెవెల్స్ పెరిగాయని గుర్తించారు. దాంతో వైద్యుల సూచన మేరకు ఆయనను హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement