Thursday, April 25, 2024

ఈసారి బతుకమ్మ చీరలు ఉండవా?

దసరా పండుగ అనగానే..గుర్తుకు వచ్చేది బతుకమ్మ. తెలంగాణ ఆడబిడ్డలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే..బతుకమ్మ పండుగ రానే వస్తోంది. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని తెలంగాణలో పేద మహిళలకు బతుకమ్మ చీరలను ఉచితంగా పంపిణీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తెల్లరేషన్‌కార్డు ఉండి, 19 ఏళ్ల వయస్సు పైబడిన ఆడపడుచులందరికీ పండుగ సందర్భంగా పంపిణీ చేస్తారు. అయితే, ఈసారి బతుకమ్మ పంపిణీ ఉంటుందా ? లేదా? అన్న సందిగ్ధత కొనసాగుతోంది. కూలీ రేట్లు పెంచాలంటూ సిరిసిల్లలో బతుకమ్మ చీరల తయారీదారుల నిరవధిక సమ్మె దిగడమే దీనికి కారణం.

సిరిసిల్ల మరమగ్గాలపై మ్యాక్స్‌ సొసైటీలు, ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్న బతుకమ్మ చీరల కూలి పెంచాలని కోరుతూ పవర్‌లూం ఆసాములు, కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. సమ్మెలో భాగంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పవర్‌లూం ఆసాములు,కార్మికులు ధర్నా నిర్వహించారు. సిరిసిల్ల పాత బస్టాండ్‌ వద్ద చేనేత విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆసాముల సమన్వయ కమిటీ అధ్యక్షుడు పోరండ్ల రమేష్‌ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరల ఉత్పత్తిలో డాబీ, జాకార్డ్‌ డిజైన్లను తీసుకురావడం వల్ల పనిభారం పెరగడంతో మిషన్లను ఏర్పాటు చేసుకోవడం ఆర్థిక భారంగా మారిందని అన్నారు. ఆసామలు, కార్మికుల ఇబ్బందులను మంత్రి కేటీఆర్‌ గుర్తించి బతుకమ్మ చీరలకు యజమానులు కూలి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

కాగా, బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులకు చీరలు ఇస్తే… వాటిని తయారుచేసేందుకు మరమగ్గ కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ఇదివరకు మరమగ్గ కార్మికులకు నెలకు రూ.8వేల నుంచి రూ.12వేలు మాత్రమే వచ్చింది. బతుకమ్మ చీరల తయారీ కారణంగా నెలకు రూ.16వేల నుంచి రూ.20వేల దాకా వస్తోంది. ఈ మంచి ఉద్దేశంతో ప్రభుత్వం నాలుగేళ్ల కిందట ఈ కార్యక్రమం ప్రారంభించింది. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన యువతులు, మహిళలకు చీరలు ఇస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement