Saturday, April 20, 2024

కొవిడ్ పాజిటివ్ రిపోర్ట్‌ లేకున్నా ఆసుపత్రిలో చేర్చుకోవాల్సిందే!

ఆసుపత్రుల్లో కరోనా రోగుల అడ్మిషన్ కు సంబంధించి కేంద్రం కీలక సవరణలు చేసింది. మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు కేంద్రం కాస్త ఉపశమనం కల్పించింది. కొవిడ్‌ రోగులు ఆసుపత్రుల్లో చేరేందుకు పాజిటివ్‌ నిర్ధారణ పత్రం తప్పనిసరి కాదని వెల్లడించింది.  అంతేకాదు ఏ కారణంగానైనా రోగులకు వైద్య సేవలు నిరాకరించరాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కొవిడ్‌ బాధితుల సౌకర్యార్థం నేషనల్ పాలసీ ఫర్‌ అడ్మిషన్‌ ఆఫ్‌ కొవిడ్‌ పేషెంట్స్‌ విధానంలో కేంద్రం పలు సవరణలు చేసింది. ఈ మార్పులను అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ పరిధిలోని ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆసుపత్రులు, ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.

నూతన మార్గదర్శకాలు:


* కొవిడ్‌ ఆరోగ్య కేంద్రం(ఆసుపత్రులు)లో చేర్చుకునేందుకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్దారణ పత్రం తప్పనిసరి కాదు. వైరస్‌ అనుమానిత బాధితులను ఆసుపత్రుల్లో చేర్చుకుని చికిత్స అందించాల్సిందే.
* కారణమేదైనా సరే.. ఏ రోగికి కూడా వైద్య సేవలు నిరాకరించొద్దు. వేరే ప్రాంతానికి చెందిన రోగులకు కూడా ఆక్సిజన్‌ లేదా అత్యవసర ఔషధాలు ఇవ్వాలి.
* వేరే నగరం నుంచి వచ్చిన బాధితులు సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించ లేదని ఆసుపత్రుల్లో చేర్చుకోకుండా ఉండొద్దు. ఎలాంటి గుర్తింపు కార్డు లేకున్నా.. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని చేర్చుకోవాలి.
* అన్ని ఆసుపత్రులు డిశ్చార్జ్‌ పాలసీని కచ్చితంగా పాటించాలి. రోగుల ఆరోగ్య పరిస్థితిని ఆధారంగానే చేసుకునే ఆసుపత్రిలో చేర్చుకోవాలి. అంతగా హాస్పిటల్‌ అవసరం లేని వారిని డిశ్చార్జ్‌ చేయాలి.

ఈ నూతన మార్గదర్శకాలపై ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు మూడు రోజుల్లోగా ఉత్తర్వులు, సర్క్యులర్లు జారీ చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement