Friday, April 19, 2024

పోలీసులు కొట్టారని కరెంట్ తీసేశారు!

నల్గొండలో పోలీసులు కఠినంగా లాక్‌ డౌన్ అమలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోడ్డెక్కినవారిపై లాఠీ విరిగింది. సమాధానం చెప్పేలోపే భాదితులపై పోలీసులు లాఠీలు ఝళిపిస్తున్నారు. మీడియా విద్యుత్ అధికారులు, డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లను కూడా ఖాకీలు వదలేదు. పోలీసుల వైఖరికి నిరసనగా నల్గొండ పట్టణంలో విద్యుత్ సిబ్బంది పవర్ కట్ చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా రోగుల అవస్థలు పడ్డారు.

విద్యుత్ ఉద్యోగులను పోలీసులు లాక్ డౌన్ పేరిట ఇబ్బందులు పెడుతున్నరన్న అంశంపై డిజిపి మహేందర్ కి మంత్రి జగదీష్ రెడ్డి ఫోన్ చేశారు. విద్యుత్ ఉద్యోగులకు అత్యవసర సర్వీసుల మినహాయింపు ఉన్నందున వారిని ఇబ్బంది పెట్టకుండ ఉండేలా చూడాలని డీజీపీని మంత్రి కోరారు.

లాక్‌డౌన్ అమ‌ల‌వుతున్న నేప‌థ్యంలో హాస్పిట‌ల్స్, వినియోగ‌దారుల‌కు నిరంత‌రం విద్యుత్ స‌ర‌ఫ‌రా చేసేందుకు విద్యుత్ శాఖ ఉద్యోగులు, సిబ్బంది 24 గంట‌లు ప‌ని చేస్తున్నారని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్ర‌భాక‌ర్ రావు పేర్కొన్నారు. న‌ల్ల‌గొండ‌, హైద‌రాబాద్‌లో విద్యుత్ శాఖ సిబ్బంది, అధికారుల‌పై పోలీసులు దాడి చేస్తున్న‌ట్లు త‌న దృష్టికి వ‌చ్చింద‌ని ఆయ‌న తెలిపారు. విద్యుత్ శాఖ సిబ్బంది, అధికారుల వాహ‌నాల‌ను ఆపొద్దు, సీజ్ చేయొద్ద‌ని పోలీసు ఉన్న‌తాధికారుల‌కు ప్ర‌భాక‌ర్ రావు విజ్ఞ‌ప్తి చేశారు. త‌మ డిపార్ట్‌మెంట్ ఐడీ కార్డు, సంబంధిత పాస్ చూపిస్తే వ‌దిలేయాల‌ని కోరారు. త‌మ శాఖ అధికారుల‌కు, సిబ్బందికి లాక్‌డౌన్ నుంచి మిన‌హాయింపు ఉంద‌ని ప్ర‌భాక‌ర్ రావు స్ప‌ష్టం చేశారు.

కాగా, రాష్ట్రంలో గత పది రోజులుగా లాక్ డౌన్ అమలవుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు కొనుగోలు చేయ‌డానికి అనుమ‌తులు ఇచ్చారు.  ఉద‌యం 10 గంట‌ల త‌రువాత ఎవ‌రూ బ‌య‌ట‌కు రాకూడ‌దు. లాక్‌ డౌన్ మిన‌హాయింపులు ఉన్న అత్య‌వ‌స‌ర స‌ర్వీసులు, లాక్ డౌన్ పాసులు ఉన్న వారికి మాత్ర‌మే అనుమ‌తులు ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయిని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement