Saturday, April 20, 2024

నో మాస్క్.. తెలంగాణలో 6,478 కేసులు

కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ మాస్క్ లేకుండా తిరుగుతున్న వారిపై పోలీసులు కొరడా ఝళ్లిపిస్తున్నారు. మాస్కు ధారణను ఉల్లంఘిస్తున్న వారు హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. కొన్నాళ్లుగా మాస్కు ధరించని వారిని నేరుగా, సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. గత వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 6,478 కేసులు నమోదు చేశారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లోనే 2030 కేసులు నమోదయ్యాయి. రాచకొండ పరిధిలో 670, సైబరాబాద్‌ పరిధిలో 514 నోమాస్క్‌ కేసులు నమోదయ్యాయి. సెమీ అర్బన్‌ కమిషనరేట్‌ రామగుండం పరిధిలో 938, వరంగల్‌లో 218, ఖమ్మంలో 131, నిజామాబాద్‌లో 70, సిద్దిపేట-9, కరీంనగర్‌-8 కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో 1890 మందిని గుర్తించి కేసు నమోదు చేశారు.

తెలంగాణలో కరోనా కేసులు మరోసారి ఉధృతంగా పెరుగుతుండటంతో మాస్కు ధరించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మాస్కు లేని వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించంది. మాస్కు ధరించకుండా బయటకొస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు.  కొవిడ్‌-19 నిబంధనలను ఉల్లంఘించి మాస్క్‌ లేకుండా బయటకు వస్తే రూ.1000 కట్టాల్సిందే. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాలు, ప్రయాణాల్లో మాస్కు ధారణ తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు  కేసు కూడా నమోదు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement