Monday, April 15, 2024

పోడు లెక్క పెరుగుతోంది…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: పోడు భూమి లెక్క తప్పుతోంది. పట్టాలిస్తామని ప్రభుత్వం ప్రకటించిందే తడువుగా దరఖాస్తులు కుప్పలు, తెప్పలుగా వచ్చిపడు తున్నాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలపై అవగాహన లేమి కారణంగా లబ్ధిదారుల నుంచి ఇష్టా రాజ్యంగా అర్జీలు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణ లో ఏర్పాటైన స్క్రూట్నీ కమిటీలు వాటిని పరిశీలిస్తున్న ప్పటికీ, కొన్ని దరఖాస్తులు పరిష్కరించలేని స్థాయిలో ఉంటున్నాయి. వాటిని పరిష్కరించే క్రమంలో అధికార యంత్రాంగానికి అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. అటవీశాఖ అధికారులు చెబుతున్న దానికీ, క్షేత్రస్థాయిలో వచ్చిన దరఖాస్తుల్లో పేర్కొన్న విస్తీర్ణానికి పొంతన కుదరడం లేదు. ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసుకుంటు-న్న గిరిజనులు పోడు భూములకు హక్కుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం గతంలోనూ సూచించింది. తాజాగా అసెంబ్లిd వేదికగా సీఎం కేసీఆర్‌ ప్రకటన తర్వాత మళ్ళీ దరఖాస్తుల పర్వం మొదలైంది. అటవీ, రెవెన్యూ శాఖల క్షేత్రస్థాయి అధికారులు, స్థానిక పంచాయతీ కార్యదర్శులకు ఈ ప్రక్రియ బాధ్యతలను అప్పగించింది. అక్కడి నుంచి దరఖాస్తులను జిల్లాస్థాయి పరిశీలన కమిటీలకు పంపిస్తున్నారు. కలెక్టర్లు హక్కు పత్రాల జారీకి చర్యలు ప్రారంభించినప్పటికీ రకరకాల చిక్కులు అడ్డంకుల కారణంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. గత నెలలో దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిశీలన మొదలుపెట్టిన క్రమంలో అర్హులుకాని గిరిజనేతరుల దరఖాస్తులు అనేకం వచ్చినట్లు- గుర్తించారు. గిరిజనుల పేరుతో వచ్చిన వాటిలో కూడా బినామీల దరఖాస్తులున్నట్లు- తెలుస్తోంది. అటవీశాఖ వద్ద ఉన్న ఆక్రమణల జాబితాలు, దాఖలైన దరఖాస్తుల మధ్య భారీ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. అదనపు విస్తీర్ణం కోసం దాఖలైన దరఖాస్తుల్లో అత్యధికం బినామీలవేనని అధికారులు చెబుతున్నారు.

ఖమ్మం జిల్లాలో అటవీ ఆక్రమణ 17,449 ఎకరాల్లో ఉన్నట్లు- గణాంకాలు చెబుతుండగా వచ్చిన దరఖాస్తుల్లో పేర్కొన్న విస్తీర్ణం 59 వేల ఎకరాలకు పైగా ఉంది. భద్రాద్రి జిల్లాలో పోడు వ్యవసాయంలో 2.29 లక్షల ఎకరాలున్నట్లు- అధికారుల వద్ద లెక్కలు ఉండగా, పాతవి, కొత్తవి కలిపి అందిన దరఖాస్తుల్లో 3.80 లక్షల ఎకరాలకు హక్కులు కల్పించాలని వినతులు అందాయి. అలాగే సూర్యాపేట జిల్లాలో 25 వేల ఎకరాల అటవీ భూమికి 28 వేల ఎకరాలకు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అటవీశాఖ లెక్కల ప్రకారం 1.15లక్షల ఎకరాల ఆక్రమణలు ఉండగా, 1.18 లక్షల ఎకరాలకు దరఖాస్తులు గతంలోనే అందాయి. తాజాగా అందిన మరో 26వేల దరఖాస్తులు అధికారుల పరిశీలనలో ఉన్నాయి. లబ్ధిదారుల సంఖ్య పెద్దగా లేని సంగారెడ్డి జిల్లాలో కూడా అటవీ ఆక్రమణలకు మించి దరఖాస్తులు దాఖలయ్యాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 29,949 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 20,446 దరఖాస్తులు రాగా, సూర్యాపేట జిల్లాలో 7,373, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2130 దరఖాస్తులు వచ్చాయి. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా మిర్యాలగూడ డివిజన్లో 12,337 దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 38మండలాల్లో 248 పంచాయతీల్లోని 711 గ్రామాల్లో గిరిజనులు, ఇతర రైతుల నుంచి 66 వేల దరఖాస్తులు అందాయి. నాలుగు జిల్లాల్లో 2,27,129 ఎకరాల అటవీ భూములను సాగు చేస్తున్నట్టు- దరఖాస్తుదారులు సూచించారు. మరోవైపు దరఖాస్తులు స్వీకరించి చాలారోజులు దాటినా వాటిపై ఎటు-వంటి మార్గదర్శకాలూ విడుదల చేకపోవడంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పోడు రైతులు నిరాశలో ఉన్నారు. పోడు భూములు ఉన్న గిరిజన, గిరిజనేతర రైతులు పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో నమోదు చేసుకున్నారు. జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు 2,510 దరఖాస్తులకు చెందిన 1032 ఎకరాల్లోనే సర్వే పూర్తి చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని 66 గ్రామాల్లో పోడు ఉన్నట్టు- అధికారులు గుర్తించారు.

ఆక్రమణలో ఉన్న భూములకు, అందిన దరఖాస్తులకు పొంతనలేని లెక్కల కారణంగా పోడు భూముల్ని సాగు చేసుకుంటున్న గిరిజనేతరులను పక్కన పెట్టినట్టు- తెలిసింది.. ఆన్‌లైన్‌లో వారికి సంబంధించిన ఆప్షన్‌ లేకపోవడంతో సబ్‌ డివిజన్‌ స్థాయిలోనే గిరిజనేతరుల దరఖాస్తుల్ని తిరస్కరించినట్టు- సంగారెడ్డి, సిద్దిపేట గిరిజనాభివృద్ధి శాఖ అధికారి ఫిరంగి తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 1,130 మంది గిరిజనులు 1,770 ఎకరాల్ని సాగు చేసుకుంటు-న్నట్టు- గ్రామ స్థాయి కమిటీ-లో గుర్తించారు. 312 మంది గిరిజనేతరులు 509.20 ఎకరాల్ని సాగు చేసుకుంటు-న్నట్టు- గుర్తించారు. మెదక్‌ జిల్లాలో 1061 మంది గిరిజనులు, 2954 గిరిజనేతరులు పోడు భూములు సాగు చేసుకుంటు-న్నట్టు- ప్రతిపాదించారు. మెదక్‌ జిల్లాలో గ్రామ సభల నుంచి 510 గిరిజనులు అర్హులుగా ప్రతిపాదిస్తూ సబ్‌ డివిజన్‌ స్థాయి కమిటీ-కి పంపారు. అయితే, మెదక్‌లో సబ్‌డివిజన్‌ కమిటీ- 171మంది పేర్లను మాత్రమే జిల్లా కమిటీ-కి పంపింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రయ ఇటు అధికారులకు, అటు లబ్ధిదారులకు అయోమయంగా తయారైంది.

ముందుగా కొత్తగూడెం, భద్రాచలం డివిజన్లు పరిధిలోని గిరిజన ఆవాస ప్రాంతాల నుంచి 11532 దరఖాస్తులకు 30,684.29 ఎకరాలకు పోడు పట్టాలు జారీ చేయాలని నిర్ణయించినట్టు- అధికారులు తెలుస్తోంది. తొలి విడత విచారణ పూర్తయిన క్లెయిమ్స్‌ ఆధారంగా అర్హుల ఎంపిక జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో 10 మండలాలకు చెందిన 94 గ్రామ పంచాయతీల్లో 132 ఆవాసాల నుంచి దరఖాస్తులు అందాయి. షెడ్యూల్‌ తెగలకు సంబంధించి 9,507 దరఖాస్తులు 25,515 ఎకరాల్లో హక్కు పత్రాల కోసం రాగా, గిరిజనేతరుల నుంచి 8,980 దరఖాస్తులు 17,678 ఎకరాలు, మొత్తంగా 18,487 దరఖాస్తులు 43,193 ఎకరాల్లో హక్కు పత్రాల కోసం వచ్చాయి. అయితే, పోడు భూముల దరఖాస్తుదారుల్లో కొందరికే హక్కు పత్రాలందుతాయని గణాంకాలను బట్టి అంచనా వేస్తున్నారు.

- Advertisement -

ఇవీ.. చట్టపరమైన నిబంధనలు
అటవీ హక్కుల చట్టం-2006 ప్రకారం పోడు వ్యవసాయదారులకు హక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2005కు ముందు సాగులో ఉన్న అటవీ ప్రాంతానికి పోడు హక్కులకు దరఖాస్తు చేసుకునేందుకు గిరిజనులకు అవకాశం కల్పించింది. గిరిజనేతరులైతే మూడు తరాలుగా అటవీ ప్రాంతంలో నివసిస్తున్నట్లు- ఆధారాలు సమర్పించాలనే నిబంధన విధించింది. రెవెన్యూ, అటవీశాఖల సరిహద్దు సమస్య ఉన్న జిల్లాల్లో పోడు హక్కుల దరఖాస్తులు వస్తే సరిహద్దు సర్వే చేసి స్పష్టత ఇవ్వాలని ఆయా శాఖలు నిర్ణయించాయి. వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు ఏర్పాటు- చేసిన కమిటీ-లు పరిశీలించిన తర్వాత తుది జాబితాను రూపొందిస్తాయి.

పట్టాల పంపిణీపై అనుమానాలు
ఆయా జిల్లాల్లో అధికారులు లబ్ధిదారుల వివరాలను కంప్యూటర్‌లో నిక్షిప్తం చేసినా.. ఎంతమంది పట్టాలు అందుకుంటారన్నది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా చోట్ల దరఖాస్తులను తిరస్కరించినట్టు- సమాచారం. తక్కువ స్థాయిలోనే దరఖాస్తులకు ఆమోదం తెలిపినట్టు- తెలుస్తోంది. గిరిజనేతరులను గుర్తించడం లేదని మంత్రులు తేల్చి చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో వారికి సంబంధించిన సమాచారాన్ని చేర్చక పోవడంతో ఆ దరఖాస్తులను పక్కన పెట్టినట్టు- అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement