Friday, April 19, 2024

ఉజ్జ‌యినిలో ప‌ర్య‌టించ‌నున్న ప్ర‌ధాని-శ్రీమ‌హాక‌ల్ లోక్ ను ప్రారంభించ‌నున్న మోడీ

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేడు సాయంత్రం ఐదు గంట‌ల‌కు ఉజ్జ‌యిని చేరుకోనున్నారు. అనంత‌రం సాయంత్రం 5:25 గంటలకు మోడీ మహాకాల్ ఆలయానికి చేరుకోనున్నారు. సాయంత్రం 5:50 గంటలకు మహాకాల్‌లో దర్శనం, పూజ ప్ర‌త్యేక‌లు నిర్వ‌హించ‌నున్నారు. సాయంత్రం 6:25 గంటలకు శ్రీ మహాకల్ లోక్‌ను ప్రారంభిస్తారు. అనంత‌రం రాత్రి 7:30 కార్తీక మేళా మైదానంలో ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌ధాని ప్రసంగించనున్నారు. . అక్క‌డ ప్రధానమంత్రి శ్రీ మహాకల్ లోక్ కారిడ‌ర్ ను (మొద‌టి ద‌శ‌) ప్రారంభించి.. దానిని జాతికి అంకితం చేస్తారు. ప్రారంభోత్సవం తర్వాత ఆయ‌న‌ కమల్‌కుండ్, సప్తఋషి మండపం, నవగ్రహాలను సందర్శించ‌నున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఆలయంలో పలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో ఆల‌య పాంత్రంలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కూడా ఈ ప్రాజెక్టు ప్రారంభోత్స‌వాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. మోడీ రాక సంద‌ర్బంగా ప్ర‌త్యేక ఏర్పాటు చేసింది. ఆలయ ప్రాంగ‌ణంలో దాదాపు 600 మంది కళాకారులతో ప్ర‌ద‌ర్శ‌లు, సాధువులతో మంత్రోచ్ఛారణలు చేప‌ట్ట‌నున్నారు. కారిడార్ ప్రధాన ద్వారం వద్ద సుమారు 20 అడుగుల శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ఇక్క‌డే ప్రారంభోత్స‌వ వేడుక‌ను ఏర్పాటు చేశారు. ఇక్క‌డ ప్ర‌ధాని మోడీ ప్ర‌త్యేక పూజ చేసి..కారిడార్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ప్రధానమంత్రి ప్రారంభించనున్న శ్రీ మహాకాల్ లోక్ ప్రాజెక్ట్ చాలా ప్రత్యేకమైనది. ఉజ్జ‌యిని యాత్రికులకు ప్రపంచ స్థాయి ఆధునిక సౌకర్యాలను అందించడం ద్వారా వారి అనుభవాన్ని జీవితంతం గుర్తుండిపోయేలా చేయడానికి సహాయపడుతుంది. ఆల‌య వైభ‌వాన్ని, ప్ర‌తిష్టాను మ‌రింత పెంచ‌నున్న‌ది. అలాగే.. ప్రాజెక్ట్ ద్వారా ఆ ప్రాంతంలో రద్దీని తగ్గించడం, వారసత్వ నిర్మాణాల పరిరక్షణ, పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి పెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్టు కింద ఆలయ సముదాయాన్ని దాదాపు ఏడు రెట్లు విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.850 కోట్లను వేచ్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం ఆలయానికి వచ్చే యాత్రికుల సంఖ్య ఏడాదికి దాదాపు 1.5 కోట్లకు రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప‌ర్య‌ట‌క రంగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేప‌ట్టారు. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి రెండు దశల్లో చేయాల‌ని ప్రణాళిక రూపొందించారు. రూ.856 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మహాకాల్ లోక్ ఆలయ కారిడార్‌ ప్రాజెక్టు తొలి దశను ఆయ‌న ప్రారంభిస్తారు. ఈ మెగా ప్రాజెక్టు పూర్తయిన తరవాత ఆలయ కాంప్లెక్స్‌ విస్తీర్ణం 2.87 హెక్టార్ల నుంచి 47 హెక్టార్లకు విస్తరిస్తుంది. ఈ ఆల‌య కారిడార్ మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మహాకాల్ లోక్ ప్రాజెక్ట్ లో భాగంగా మార్గంలో 108 స్తంభాలు ఏర్పాటు చేశారు. ఇవి శివుని ఆనంద తాండవ స్వరూపాన్ని (నృత్యరూపం) సూచిస్తాయి. మహా కాల్ మార్గంలో శివుడిని వర్ణించే అనేక విగ్రహాలను ఏర్పాటు చేశారు. కారిడ‌ల్ పొడ‌వునా మ్యూరల్ వాల్ పెయింటింగ్స్, శివ పురాణంలోని కథల ఆధారంగా నిర్మించారు. సృష్టి, గణేశుడి జననం, సతి, దక్ష కథల ఆధారంగా ఆక‌ర్ష‌ణీయ‌మైన నిర్మాణాల‌ను చేప‌ట్టారు. ఒక ఫౌంటెన్‌తో పాటు ప్రత్యేకంగా శివుడి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కాంప్లెక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నిఘా కెమెరాల ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌నున్నారు. అలాగే.. అనేక మతపరమైన విగ్రహాలు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement