Thursday, March 28, 2024

నేడు సీఎంలతో మోదీ భేటీ.. కోవిడ్ పై కీలక నిర్ణయాలు!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. నిత్యం వేలల్లో కేసులు పెరుగుతున్నాయి. ప్ర‌తి రోజు ల‌క్ష‌కు దాటి కొత్త కేసులు న‌మోద‌వుతుండ‌డం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో 1,26,265 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 684 మంది మృతి చెందారు. దీంతో అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు వర్చువల్ ప‌ద్ధ‌తిలో ఈ సమావేశం జ‌ర‌గ‌నుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులు, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ చర్చించనున్నారు.

క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతోన్న నేప‌థ్యంలో కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయ‌న‌ దిశా నిర్దేశం చేయనున్నారు. రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. దేశంలో క‌రోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల విష‌యంలో తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై ఆయ‌న ప‌లు సూచ‌న‌లు చేయ‌నున్నారు.  కరోనా కట్టడికి కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేయడం, కర్ఫ్యూ తదితర అంశాలపై సలహాలు ఇవ్వనున్నారు. ఢిల్లీ స‌హా ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా క‌ట్ట‌డికి క‌ర్ఫ్యూ, ఆంక్ష‌లు విధించ‌డం వంటి కీల‌క అంశాల‌పై ఆయ‌న చ‌ర్చించ‌నున్నారు. దేశంలో ఇప్పటికే కోవిడ్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ డోసుల సరఫరా.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగవంతమయ్యేలా పలు కీలక ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

గతవారం ఉన్నతాధికారులతో అత్యున్నత సమావేశం ఏర్పాటుచేసిన ప్రధాని.. కరోనా నియంత్రణకు పంచముఖ వ్యూహాన్ని అమలు చేయాలని సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్ విధానాలను సమగ్రంగా అమలు చేయడం ఎలా అనే దానిపై చర్చించారు.  మార్చి 17న ముఖ్యమంత్రులతో సమావేశమైన ప్రధాని.. దేశంలో కరోనా రెండో దశ వేగంగా విస్తరిస్తోందని, కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న 11 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష్‌వర్దన్ బుధవారం (ఏప్రిల్ 7)వర్చువల్ సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వచ్చే నాలుగు వారాలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement