Saturday, April 13, 2024

పర్యావరణంపై ప్లాస్టిక్ పెను ప్రభావం… కఠిన చర్యలు అమలు చేస్తేనే ఫలితం..

విజయవాడ, ప్రభన్యూస్‌: నగరంలో నిషేధిత ప్లాసిక్‌ వినియోగం విచ్చలవిడిగా మారింది. రెండేళ్ల క్రితం హడావుడిగా దాడులు చేయడంతో పాటు, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తొలుత వివిధ ప్రాంతాల్లో అధికారులు పాస్టిక్‌ వినియోగించే షాపుల వారిపై చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో పాస్టిక్‌ బహిరంగంగా షాపుల వారిని వినియోగించేందుకు భయపడ్డారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ‘మనకృష్ణ’ కార్యక్రమం ప్రారంభించిన కొద్ది రోజులకే కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి కారణంగా పాస్టిక్‌ నిషేదం గురించి అధికారులు మరిచిపోయారు. ప్లాస్టిక్‌ వినియోగం వల్ల ఏర్పాడే దుష్ప్రమాణాలను ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిత్యం చెబుతున్నాయి. కానీ వాటి నిషేధం అమలు మాత్రం ఆచరణలోకి రావడం లేదు. ఒక సంచి భూమిలో కలిసిపోయేందుకు వందల ఏళ్ల సమయం పడుతుందని, అంతవరకు అది విషతుల్యంగా ఉంటూ రసాయన చర్యల ద్వారా ప్రమాదకరమైన వాయువులను విడుదల చేస్తుందని తెలిసినా ప్రజలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

ప్లాస్టిక్‌ ఎక్కడపడితే అక్కడ పడేయడం, రీసైక్లింగుకు అస్కారంలేకపోవడంతో ప్రతి ఏటా రెండు మిలియన్ల పక్షులు, సముద్ర జీవులు చనిపోతున్నట్లు గుర్తించారు. జిల్లాలో రోజుకు సగటను 2.50 లక్షల నుంచి మూడు లక్షల వరకు ఒకసారి వాడిపారేసే గ్లాసులు, 2 లక్షల నుంచి 2.50 లక్షల వరకు టీ, కాఫీ కప్పులు, 3 లక్షల వరకు ప్రమాదకరమైన నిషేధిత క్యారీ బ్యాగులు, 75 వేల నీటి సీసాలు వినియోగిస్తున్నట్లు అంచనా. బిస్కెట్లు, సబ్బులు, నూనెలు, షాంపూలు, తదితరాలు ప్లాస్టిక్‌ వ్యర్థాలు అదనం. హ్లాండ్లింగ్‌ ప్లాస్టిక్‌ కవర్స్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ 2011 నిబంధనల ప్రకారం మునిసిపల్‌ అధికారులు వ్యాపార, కాయకూరల, పండ్ల మార్కెట్‌ తదితర దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లను వినియోగిస్తుంటే వారిపై కఠిన చర్యలు తీసుకొని, అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించాలి. వాటిని స్వాధీనం చేసుకుని కాల్చివేయాలి.

అయితే ఈ నిబంధనలు పటిష్టంగా అమలు కాకపోవడంతో విచ్చలవిడిగా వినియోగం జరుగుతోంది. నగరంలో దాదాపు 11 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. వీరి నుంచి దాదాపు రోజుకు 550 టన్నుల చెత్తను పారిశుధ్య కార్మికులు సేకరిస్తున్నారు. వీటిలో 30శాతం మేర ప్లాస్టిక్‌ వ్యర్ధాలు ఉంటున్నాయని ఒక అంచనా. డ్రైనేజీలలో పెద్దఎత్తున క్యారీబ్యాగ్‌లు పేరుకుపోతున్నాయి. హోటళ్లు, మెడికల్‌ షాపుల నిర్వాహకులు, చిరువ్యాపారులు, చికెన్‌, మటన్‌ వ్యాపారస్తులు ప్లాస్టిక్‌ సంచుల వాడకాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్‌ను కాల్చితే వచ్చే డయాక్సిన్‌, ప్యూరాన్‌ విషవాయువులు క్యాన్సర్‌ను కలగజేస్తాయి. రంగుల సంచుల్లో తయారీలో వాడే సీసం, క్యాడ్మియం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సీసం పిల్లల పెరుగుదల, జ్ఞాపకశక్తిని హరించి వేస్తుంది.

క్యాడ్మియం కిడ్సీలను దెబ్బతీస్తుంది. వేడి ఆహార పదార్ధాలను నిలువచేస్తే ప్రమాదకరమైన ప్లాస్టిక్‌ గ్రాన్యుల్‌ పిగ్మంట్లు- అందులో కలసిపోయి ప్రాణాంతకరమైన క్యాన్సర్‌కు దారి తీస్తాయి. ప్లాస్టిక్‌ వ్యర్ధాలను తయారుచేసే ప్రక్రియలో వెలువడే క్లోరినేటడ్‌ హైడ్రోకార్బన్లు శారీరకంగా ఉన్నవారికి కేంద్రనాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా ప్లాస్టిక్‌ వ్యర్ధాలు ఉన్నచోట మొక్కలు కూడా మొలకెత్తవు. నగరంలో ఇప్పటినుంచే వీటి వాడకంపై కలిగే అనర్ధాలను ప్రజలకు వివరించి వాటి వినియోగాన్ని తగ్గించగలిగితే క్లీన్‌ విజయవాడను త్వరగా సాకారం చేసుకోవచ్చని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement