Wednesday, April 24, 2024

పవన్ కు ‘పవర్’ ఇస్తారా… పరువు తీస్తారా?

ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి ఉపఎన్నిక గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అటు ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నాయి. భారీ మెజారిటీ కోసం వైసీపీ, గెలుపు కోసం టీడీపీ.. ఉనికి కోసం బీజేపీ పోరాడుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు పొత్తును కొనసాగిస్తున్నాయి. తిరుపతి లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నిక సందర్భంగా రెండు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. ఉపఎన్నికలో గెలిచి ఏపీలో జెండా పాతాలని బీజేపీ భావిస్తుండగా.. తమ ఉనికిని బలంగా చాటాలని జనసేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరిగిన బీజేపీ, జనసేన కార్యకర్తల సమన్వయ సమావేశంలో పాల్గొన్న సోము వీర్రాజు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడటమే తమ లక్ష్యమన్నారు. ఇది తన ఒక్కడి మాటే కాదని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా చెప్పిన మాటలన్నారు. అంతేకాదు పవన్ కల్యాణ్ ను పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సిందిగా మోదీ, అమిత్ షా తనకు చెప్పారన్నారు. కచ్చితంగా పవన్ కల్యాణ్ ను ఈ రాష్ట్రానికి అధినేతగా చూస్తారన్నారు.

సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తిరుపతి అభ్యర్థి విషయంలో రెండు పార్టీల మధ్య కాస్త గ్యాప్ వచ్చింది అనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను సీఎం చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. అయితే, తిరుపతి ఉపఎన్నికలో గట్టెక్కేందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తిరుపతిలో గెలివడమో లేదా..ఓటు శాతాన్ని పెంచుకోవడం బీజేపీ ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తో పాటు జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులను ప్రసన్నం చేసుకునేందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఒక వేళ తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైతే.. వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పవనే కొనసాగిస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకం. పవన్‌ని సీఎం చేసే లక్ష్యంతోనే బీజేపీ ఉందా? ఆ దిశగానే సోమువీర్రాజు సంకేతాలు ఇచ్చారా అని బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.

నిజానికి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే, కొన్నిచోట్ల బీజేపీ కంటే జనసేననే మెరుగైన ఫలితాలు సాధించింది. దీంతో తిరుపతి ఉపఎన్నికలో పవన్ ను పూర్తిగా వాడుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. మొన్నటి స్థానిక ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటకట్టుకోవడంతో బిజెపి నేతలకు పవన్ విలువ తెలిసొచ్చినట్లు ఉంది. తిరుపతిలో కనీసం డిపాజిట్ అయినా దక్కించుకునేందుకు మెప్పు కోసం నానా పాట్లు పడుతున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ తనను తాను నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలు రెఫరెండం కానున్నాయి. బీజేపీ జనసేనకి చేసిన సీఎం ప్రపోజల్ బాగా పని చేసింది. ఏప్రిల్ 3న పవన్ తిరుపతిలో పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. ఎమ్మార్ పల్లి కూడలి నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేయనున్నారు. ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ విజయం కోసం పవన్ పాదయాత్ర చేయనున్నారు. ఒకవేళ పవన్ ప్రచారంతో బీజేపీ అభ్యర్థి గెలిస్తే.. ఇక వచ్చే ఎన్నికల్లోనూ పవన్ నే సీఎంగా అభ్యర్థిగా కొనసాగించే అవకాశం ఉంది.

ఒకవేళ తిరుపతిలో బీజేపీ- జనసేన అభ్యర్థి ఓడిపోతే.. అది పవన్ ఖాతాలోనే వేయాలని బీజేపీ ప్లాన్ గా తెలుస్తోంది. జనసేన నాయకులు, కార్యకర్తలను ఉత్తేజ పరిచి ప్రచారంలో పాల్గొనేలా చేయాలనేది బీజేపీ వ్యూహంగా కనిస్తోంది. మరి బీజేపీ చేసిన ప్రకటన.. తిరుపతి ఎన్నికల్లో లబ్ధి కోసమా? లేక 2024 ఎన్నికల వరకా? అనేది వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement