Wednesday, April 24, 2024

Piyush Goyal: తెలంగాణ ప్రభుత్వం రైతులకు తప్పుడు ప్రచారం చేస్తోంది

తెలంగాణ ప్రభుత్వం రైతుల వద్ద తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ నిస్పృహలో ఉన్నారని చెప్పారు. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు లేని సమస్యను సృష్టించారని విమర్శించారు. గతం కంటే ఎక్కువ మూడు రేట్లు ధాన్యం సేకరణ పెంచామన్నారు. మద్దతు ధర అయిదు సార్లు పెంచినట్లు వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని గోయల్ ఆరోపించారు. 27 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు సప్లయి చేయలేదన్నారు. ప్రత్యేక కేసు కింద తెలంగాణ నుంచి ఉప్పుడు బియ్యం కొంత వెసులుబాటు ఇచ్చినట్లు తెలిపారు. రబీ కింద ఇవ్వాల్సిన14 ఎల్ఎంటి ఉప్పుడు బియ్యం, 13 ఎల్ఎంటి ముడి బియ్యం వెంటనే సప్లయి చేయాలన్నారు. దేశంలో ఉప్పుడు బియ్యం ఇప్పుడు ఎవరు తినడం లేదన్న కేంద్ర మంత్రి గోయల్.. ఏడాది కిందటే ముడి బియ్యం సప్లై చేయాలని తెలంగాణను కోరినట్లు చెప్పారు. సెంట్రల్ పూల్ కింద ఇవ్వాల్సిన బియ్యం ముడి ఇవ్వాలన్నారు.

నాలుగు ఏళ్లకు సరిపడా బియ్యం నిల్వలు FCI వద్ద ఉన్నాయని చెప్పారు. ముడి బియ్యం ఎంత ఇచ్చినా కొనేందుకు సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. తనపై, కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. రైతులకు పూర్తిగా అండగా ఉంటామని గోయల్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement