Friday, March 29, 2024

‘ఫార్మా సారథి, ఓ మాఫియా లీడ‌ర్‌’.. పైస‌ల‌ కోసమే కేసీఆర్ రాజ్యసభ ఇచ్చాడు: జగ్గారెడ్డి

ఉమ్మడి మెదక్, ప్రభ న్యూస్ బ్యూరో : ఇటీవల టిఆర్ఎస్ నుండి రాజ్యసభకు నామినేట్ అయిన‌ హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం గాంధీ భవన్ వేదికగా హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథిపై విరుచుకుపడ్డారు. హెటిరో డ్రగ్స్ అధినేత ఓ ఫార్మా మాఫియా లీడ‌ర్ అని అభివర్ణించారు. కొవిడ్ టైంలో రేమిడిసెవిర్ ఇంజక్షన్ పేరిట పార్థసారథి రెడ్డి విచ్చలవిడిగా దోచుకున్నాడని, ఆ దోచుకున్న డబ్బుకు అకౌంటబులిటీ లేదని ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే తీవ్ర ప్రమాదం ఉంటుందన్నారు. అక్రమంగా సంపాదించిన లెక్క తేల్చని డబ్బుతో రాజకీయాలను కూడా శాసించే ప్రమాదం ఉందని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయ ప్రవేశం చేయకుండా అడ్డుకుంటామని జగ్గారెడ్డి స్పష్టంచేశారు. పార్థసారథిపై ఎన్నికల కమిషన్ తో పాటు సీబీఐ కి ఫిర్యాదు చేస్తామని జ‌గ్గారెడ్డి స్పష్టం చేశారు. పార్థసారధి రెడ్డి అక్రమంగా సంపాదించిన డబ్బుపై కేసీఆర్ కన్ను పడిందని అందుకే టిఆర్ ఎస్ తరుపున నామినేట్ చేశారని ఆరోపించారు. పార్థసారధి సచ్చీలుడైతే రాజ్యసభకు నామినేషన్ వేయకముందే తాను ఆరోపించిన వాటిపై సమాధానం చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

ఐటి దాడుల్లో కనీసం 10 వేల కోట్లు దొరికుండాలి
హెటిరో డ్రగ్స్ పై ఐటి జరిపిన దాడుల్లో కనీసం 10 వేల కోట్ల రూపాయలైన దొరికుండాలి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. కానీ ఐటి మాత్రం కేవలం 500 కోట్లు చూపించిందని ఇదేం మతలబో అర్థం కాలేదన్నారు. కొవిడ్ టైంలో దేశం మొత్తం రేమిడిసేవిర్ పైనే చర్చించుకున్నారని, రేమిడిసేవిర్ ఇంజక్షన్ వేసుకుంటే ప్రాణాలతో బయటపడుతున్నారనే ఓ టాక్ ను సమాజంలో పుట్టించి హెటిరో రేమిడిసేవిర్ ను ఎమ్మార్పీ రేట్లకు మించి ప్రజలకు ఊహకందని రేట్లకు విక్రయించిదని ఆరోపించారు. సామాన్య ప్రజలు లక్షలు వెచ్చించి ఎలా కొనుగోలు చేశారో అంతు చిక్క‌లేదని, ప్రాణాలు నిలుస్తున్నాయంటే అప్పు చేయక ఏం చేస్తారని పేర్కొన్నారు.

ఆ సమయంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని రేమిడిసేవిర్ ను పేదలకు ఉచితంగా అందిస్తే ఎంతో మేలు జరిగేదని, కానీ, ఫార్మా మాఫియాను తన చెప్పు చేతుల్లో పెట్టుకున్న పార్థసారధి రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మేనేజ్ చేశాడని ఫలితంగా ఐటి రైడ్స్ కో కేవలం 500 కోట్లు మాత్రమే లభించాయన్నారు. దీనిపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రం తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

నామినేషన్ వేసే లోపు సమాధానం చెప్పాలి
హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారధి రెడ్డి రాజకీయాల్లోకి రావడంపై జగ్గారెడ్డి పెదవి విరిశారు. పార్థసారధి రాజకీయాల్లోకి వస్తున్నాడు కాబట్టే తాను ప్రశ్నిస్తున్నానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కోవిడ్ టైం లో పార్థసారధి ప్రజల వద్ద రేమిడిసేవిర్ ఇంజెక్షన్ పేరిట అందిన కాడికి దోచుకున్నాడని, దోచుకున్న డబ్బుకు ఎలాంటి లెక్కలు లేవని స్పష్టం చేశారు. రేమిడిసేవిర్ కు ఎంత డిమాండ్ ఉండేదంటే ఎమ్మెల్యే లు, మంత్రులు కూడా ఇంజెక్షన్ కోసం సిఫారసు చేశారని గుర్తుకు చేశారు. ఇక ఇంజెక్షన్ లభించే ప్రాంతాల్లో బాధిత కుటుంబాలు రాత్రులు నిద్రలేకుండా క్యూ లైన్ లో నిలబడ్డారని తెలిపారు. ఇలా అందిన కాడికి దోచుకున్న, అకౌంటబులిటీ లేని డబ్బుతో కేసీఆర్ వద్ద పార్థసారధి రాజ్యసభ సీట్ సంపాదించడాని ఆరోపించాడు. ఇలాంటి వారు రాజకీయాల్లోకి వస్తే తీవ్ర ప్రమాదం ఉందని, ప్రజాస్వామ్య దేశంలో రాజకీయం ప్రమాదంలోకి నెట్టబడుతుందని ఇది దేశానికి ఏ మాత్రం ప్రయోజనం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ తో పాటు సీబీఐకి పార్థసారధి పై పిర్యాదు చేస్తానని, పార్థసారధి రాజ్యసభ కు తన నామినేషన్ వేసే లోపు తాను ఆరోపించిన అంశాలపై సమాధానం చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement