Thursday, April 25, 2024

లద్దాఖ్‌లోనూ సెంచరీ కొట్టిన పెట్రోల్‌

పెట్రో బాదుడు కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు లీటరు పెట్రోల్‌ ధరను 27 పైసలు, డీజిల్‌ ధరను 28 పైసలు పెంచాయి. దీంతో  కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లోని లేహ్‌లోనూ పెట్రోల్‌ ధర రూ.100 మార్కును దాటింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌ (రూ.99.75) మినహా దాదాపు అన్ని జిల్లాల్లో పెట్రోల్‌ ధర రూ.100పైనే ఉంది. వైజాగ్‌లో డీజిల్‌ ధర రూ.94.08గా ఉంది. తెలంగాణలోని ఆదిలాబాద్‌లో లీటరు పెట్రోల్‌  రూ.100.57.. నిజామాబాద్‌లో రూ.100.17గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.100.98.. డీజిల్‌ ధర రూ.92.99గా ఉంది. కర్ణాటకలోని బళ్లారిలో పెట్రోల్‌ ధర రూ.99.83, బెంగళూరులో రూ.97.98గా ఉంది.   అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లాలో లీటరు పెట్రోల్‌ రూ.105.81, డీజిల్‌ రూ.98.64కు అమ్ముతున్నారు.

నెలలో లీటరు పెట్రోల్‌ ధర రూ.4.36, డీజిల్‌ ధర రూ.4.93 పెరిగింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలో పెట్రోల్‌  రూ.100 పైనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ఇంధనాల ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ రకం బ్యారెల్‌ ముడిచమురు ధర రెండేళ్లలో తొలిసారి 71 డాలర్ల ఎగువకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement