Thursday, April 18, 2024

Official Review | పది పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు.. ఎగ్జామ్‌ సెంటర్ల వద్ద అన్ని సౌకర్యాలు

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి): ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న పదో త‌ర‌గ‌తి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని, చిన్నపాటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. పదో త‌ర‌గ‌తి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో మంత్రి స‌బితా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్షలను అధికారులు విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు జ‌రిగే ప‌దో తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.90 లక్షల మంది విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్స్‌కి హాజరవుతారని, దాదాపు 2,600కు పైగా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు. 10వ తరగతి పరీక్షలో గతంలో ఉన్న 11 పేపర్లను ప్రస్తుతం 6 పేపర్లుగా కుదించామని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు.

ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తప్పనిసరిగా ఏఎన్ఎం అందుబాటులో ఉండాలని మంత్రి పేర్కొన్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు రవాణా కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఉదయం, మధ్యాహ్నం నడపాలని.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. వేసవి కాలంలో పరీక్షలు నిర్వహిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులకు హాల్ టికెట్లను వెబ్ సైట్ bse.telangana.gov.inలో ఉంచామని, విద్యార్థులు వాటిని డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్ష హాల్ లో తాగునీరు అందించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు.

10వ తరగతి పరీక్షా కేంద్రాలకు ఎవరూ సెల్ ఫోన్ తీసుకుని రావొద్ద‌ని మంత్రి స‌బితా స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు అధికంగా మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని, వారిని ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహకం, మోటివేషన్ అందించాలని తెలిపారు. విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ.. పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప‌క‌డ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. 6 పరీక్షలను ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ మినహాయించి ప్రతి పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.30 జరుగుతాయని, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ పరీక్షలు 9.30 నుంచి 12.50 వరకు ఉంటాయ‌న్నారు. దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ లకు సూచించారు.

- Advertisement -

వీడియో కాన్ఫరెన్స్ లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 3వ తేదీ నుండి ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించే పదవ తరగతి పరీక్షలకు చేపట్టవలసిన ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నామన్నారు. జిల్లాలో 226 పరీక్షా కేంద్రాల ద్వారా 49,574 మంది రెగ్యులర్ విద్యార్థులు, 729 మంది సప్లమెంటరీ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. 34 ప్రశ్నాపత్రాల స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగినదని, ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులకు కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించి అవసరమైన సూచనలు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, తగిన పోలీసు బందోబస్తుకు ఆదేశించామన్నారు.

పరీక్ష కేంద్రాలకు సమీపంలోగల అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తామని క‌లెక్ట‌ర్ తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు హాజరయ్యేలా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని సంబంధిత అధికారులకు సూచించమన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్ ఏర్పాటు చేసి ఒక ఎ.ఎన్.ఎమ్ ను కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేలా వైద్య అధికారులు చర్యలు చేపట్టాలని, విద్యుత్ శాఖ అధికారులు పరీక్షా కేంద్రాలలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించమని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్ రావు, తదితర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement