Saturday, April 20, 2024

పవన్ సీఎం అభ్యర్థి కాదు: రత్నప్రభ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ. ఇండియా ఎహెడ్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న ఆమె.. పలు అసక్తికర విషయాలు వెల్లడించారు. ఏపీకి కాబోయే సీఎం జనసేన అధినేత పవన్ కల్యాణేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవలే ప్రకటించారు. అయితే, ఈ విషయం తనకు తెలియదన్న రత్నప్రభ.. పవనే సీఎం అభ్యర్థి అంటూ మీడియాలో ఎలా వచ్చిందన్న విషయం కూడా తెలియదని వ్యాఖ్యానించారు.

అయితే, ఉపఎన్నికలో ఇరు పార్టీల కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. బీజేపీకి జనసేన మద్దతు లేదన్న ప్రచారం సరికాదని రత్నప్రభ చెప్పారు. తన అభ్యర్థిత్వంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంతృప్తిగా ఉన్నారన్నారు. తిరుపతిలో ప్రచారం కూడా చేస్తారని చెప్పారు.

ఇక, తిరుపతిలో ఉన్న సమస్యలు తనకు తెలుసని చెప్పారు. ప్రస్తుతం తిరుపతిలో పరిశ్రమలు లేవని, తనను గెలిపిస్తే తిరుపతిలో పరిశ్రమలకు తీసుకొచ్చేందుకు కృషిచేస్తానని తెలిపారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించే విధంగా ప్రయత్నిస్తానని చెప్పారు. ఇక తన ఆస్తులపై ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలను కూడా తిప్పి కొట్టారు. రాజకీయ లబ్ధి కోసమే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తిని ప్రత్యర్థి పార్టీలు విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.  

తమ కుటుంబం ఆర్థికంగా ఎప్పటి నుంచో స్థిరపడిందని తెలిపారు. హైదరాబాద్ లో ఉన్నత విద్యావంతుల కుటుంబంలో జన్మించిన తనకు.. ఉద్యోగంలో చేరే కంటే ముందు నుంచే హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయని తెలిపారు. జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతంలో తమ కుంటుంబానికి 1970లలోనే భూములు ఉండేవని చెప్పారు.  తన తల్లిదండ్రులు కూడా ఐఏఎస్ గా పనిచేశారని వివరించారు. తాను వాజ్ పేయి హయంలోనే కీలక పదవుల్లో పని చేశానని, వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో కొంత కాలం మాత్రమే పని చేసినట్లు చెప్పారు. ఇక, జగన్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం అని రత్నప్రభ స్పష్టం చేశారు. ఈ కేసులో తన పేరును కోర్టు కొట్టి వేసిందని చెప్పారు. కావాలనే తన పేరును తెరపైకి తీసుకొచ్చారని పేర్కొన్నారు.

ఇక, తిరుపతిలో మతమార్పిడి జరుగుతున్నాయని ఆరోపించిన రత్నప్రభ.. హిందువులపై దాడులు కూడా పెరిగాయన్నారు. తిరపతిలో హిందూ ధర్మాన్ని కాపాడతామన్నారు. దుబ్బాక ఫలితమే తిరుపతిలోనూ రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా తిరుపతిలో తాను గెలుస్తానని, ప్రజల మద్దతు తమకే ఉందని రత్నప్రభ విశ్వాసం వ్యక్తం చేశారు. పవన్ పై రత్నప్రభ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజునే పవన్ సీఎం అభ్యర్థి అంటూ ప్రకటించినా.. రత్నప్రభ తెలయదు అన్ని పేర్కొనడం చర్చనీయాంశమైంది.

- Advertisement -

మరోవైపు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఉప ఎన్నికలో ఎలాగైనా పట్టు సాధించాలని ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. సిట్టింగ్ సీటును ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలని వైసీపీ పట్టుదలగా ఉంది.  బీజేపీ కూడా ప్రచార జోరు పెంచింది. విద్యావంతులు, మేధావులతో భేటీలు నిర్వహిస్తున్నారు. రత్నప్రభ గెలిస్తే కేంద్రలో మంత్రి పదవి కూడా దక్కుతుందని ప్రచారం చేస్తున్నారు. తిరుపతి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఓటర్లను తమవైపు తిప్పుకునే వ్యూహంతో ముందుకెళుతున్నారు. రత్నప్రభ తరఫున జనసేన నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. శనివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారంలో పాల్గొననున్నారు. తిరుపతిలో పాదయాత్ర చేయనున్నారు. కాగా, ఏప్రిల్ 17న తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.

https://youtu.be/t7Cu5ksrTek

Advertisement

తాజా వార్తలు

Advertisement