Wednesday, April 24, 2024

జడ్పీటీసీ సీటుపై కన్నేసిన పార్టీలు.. ఆదివాసీలు ఎటు?

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మరోసారి ఎన్నికల సందడి నెలకొంది. ఆదిలాబాద్‌ జడ్పీటీసీ స్ఠానానికి ఎన్నిక త్వరలో జరగనుంది. మరో వారం రోజుల్లో ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఈ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో కూడికలు, తీసివేతల లెక్కలు వేస్తూ కొంతమంది నాయకులు పార్టీలు మారే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా జడ్పీ ఉపాధ్యక్షుడు ఆరె రాజన్న గత సెప్టెంబరులో మరణించడంతో ఆయన ప్రాతినిథ్యం వహించిన ఆదిలాబాద్‌ గ్రామీణ జడ్పీటీసీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీలు చాపకిందనీరులా పావులు కదుపుతున్నాయి. ఆదిలాబాద్‌ లో గిరిజన ఓట్లలో అత్యధికంగా ఆదివాసీ తెగలకు చెందిన ఓట్లే ఉండడంతో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం పడనుంది. ఈ ఎన్నికల్లో ఆదివాసీల ఓట్లు కీలకంగా ఉన్నాయి. దీంతో ఆదివాసీలను తమవైపు తిప్పుకునేందుకు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా మంగ్లీ, వాన్వత్ గ్రామాల్లోని ఆదివాసీల ఓట్లు కీలకం కావడంతో అన్ని పార్టీలు ఆయా గ్రామాలపై దృష్టి పెట్టాయి.

టీఆర్ఎస్, బీజేలల కంటే ముందుగానే కాంగ్రెస్‌ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. స్థానిక మంగ్లీ, వాన్వాత్ గ్రామాల్లో ఆదివాసీల సమస్యలను తెలుసుకున్నారు. ప్రధానంగా రోడ్లు, విద్యుత్, తాగునీరు తదితర సమస్యలను తమ ప్రచారంలో అస్త్రంగా చేసుకుంది. అంతేకాదు ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంద్రత్ సుజాత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆదివాసీలను అదుకోవాలని కలెక్టర్ తోపాటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరోవైపు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న కూడా ముమ్మరంగా  పర్యటిస్తున్నారు. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎన్నికల్లో ప్రభుత్వ పథకాలే తమకు గెలిపిస్తాయిన అంటున్నారు.

ఇదిఇలా ఉంటే.. ఆదిలాబాద్‌ జడ్పీటీసీ ఉపఎన్నిక పార్టీ అభ్యర్థి పాయల శరత్‌ను ప్రకటించారు. రానున్న ఆదిలాబాద్‌ జడ్పీటీసీ ఉప ఎన్నిక కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేసి బీజేపీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు. అంతేకాదు ఎమ్మెల్యే జోగు రామన్న పెద్ద అవినీతి పరుడు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రిగా పని చేసిన సమయంలో ప్రజల సోమ్మును అడ్డగోలుగా దోచుకున్నారని ఆరోపించారు. నిజాలు మాట్లాడితే తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. సోయం బాపూరావును అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని చూస్తే అడ్రస్ లేకుండా పోతారని హెచ్చరించారు.  ‘నేను మావోయిస్టులకే భయపడలేదు.. నీకు భయపడతుతానా?’ అంటూ వ్యాఖ్యానించారు. సోయం బాపురావు దండు కదిలితే ఎమ్మెల్యే జోగు రామన్న అడ్రస్ లేకుండా పోతారంటూ హెచ్చరించారు. ఆదివాసీల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement