Wednesday, April 24, 2024

3 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలిః కేంద్రానికి స్థాయీ సంఘం సిఫార్సు

రాష్ట్ర విభజనతో రాజధానులను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లకు పదేళ్ల పాటు ప్రత్యేకహోదా ఇవ్వాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. విజయసాయి శనివారం ఈ నివేదికను వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడికి అందించారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ని అనుసరించి ఇదివరకు ఉన్న జమ్మూకశ్మీర్‌ రాష్ట్రం ప్రత్యేకస్థాయితో పాటు, ప్రత్యేక కేటగిరీ హోదాను అనుభవించిందని నివేదికలో పేర్కొంది. ఇప్పుడు ఆర్టికల్‌ 370, 35ఎలను రద్దు చేయడంతో పాటు… జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టడం వల్ల ఆ రాష్ట్రానికి ఇక ఏ మాత్రం ప్రత్యేక కేటగిరీ హోదా కొనసాగే అవకాశం లేదని తెలిపింది. జమ్మూకశ్మీర్, లడఖ్‌లుగా విభజించిన తర్వాత 2021-22 కేంద్ర బడ్జెట్‌లో జమ్మూకశ్మీర్‌కు రూ. 1.08 లక్షల కోట్లు, లడఖ్‌కు రూ.5,958 కోట్లు కేటాయించారని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ కేటాయింపుల వల్ల ఆ రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందన్న స్థాయీ సంఘం.. ఇలాంటి పరిహారాన్నే రాజధానులు కోల్పోయిన ఏపీ, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌లకు కూడా ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. అలాగే, పదేళ్లపాటు ఈ మూడు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫార్సు చేసింది.

కొత్తగా ఏర్పాటు చేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్ నుంచి వాల్తేరు డివిజన్‌ను విడగొట్టద్దని కూడా కోరింది. కొత్త జోన్ ఏర్పాటుకు సంబంధించి డీపీఆర్ ఇంకా పరిశీలన దశలోనే ఉండడంపై స్థాయీ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వాల్తేరు డివిజన్‌ను ఎందుకు విడగొట్టాల్సి వస్తుందో తమకు అర్థం కావడం లేదన్నారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని పునస్సమీక్షించాలని కోరింది. మిరప ఎగుమతులకు కేంద్రమైన గుంటూరులో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని స్థాయీ సంఘం ఆ నివేదికలో కేంద్రానికి సిఫార్సు చేసింది.

ఇది కూడా చదవండిః JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా… కొత్త షెడ్యూల్ ఇదే!

Advertisement

తాజా వార్తలు

Advertisement