Friday, March 24, 2023

Delhi | బీఆర్ఎస్ ఆందోళనతో హోరెత్తిన పార్లమెంట్.. సభ్యుల నిరసన గళంతో ఉభయ సభలు వాయిదా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదానీ – హిండెన్ బర్గ్ అంశంతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, పెరిగిపోతున్న ధరలు, పడిపోతున్న రూపాయి విలువ, నిరుద్యోగం, తదితర అంశాలపై పార్టీ ఎంపీలు చర్చకు పట్టుబడుతూ విపక్షాలతో కలిసి సోమవారం పార్లమెంట్లో ఆందోళనలకు దిగారు. దీంతో ఉభయ సభలను ఈ అంశం కుదిపేసింది. ఈ సందర్భంగా ఎంపీలు చేసిన నినాదాలతో ఉభయ సభలు మార్మోగాయి. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల దాడులపైనా తక్షణమే ఉభయ సభల్లో చర్చించాలని, ఆదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు.

- Advertisement -
   

బీఆర్ఎస్, విపక్ష ఎంపీల నినాదాలతో పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికాయి. రెండో విడత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థల దాడులు, అదానీ వ్యవహారంపై వెంటనే ఉభయ ఉభయ సభల్లో చర్చించాలని బీఆర్ఎస్ ఎంపీలు పట్టుబట్టారు. ఈ విషయమై లోక్ సభలో పార్టీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభలో పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశవరావు వాయిదా తీర్మానాలు ఇచ్చారు.

అయినా కేంద్రం పట్టించుకోకపోవడంతో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ సభను స్తంభింపజేయడంతో ఉభయ సభలను తొలుత మధ్యాహ్నాం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సభలు సమావేశం కాగానే మళ్లీ అదేతీరుగా ఎంపీలు ఆందోళనకు దిగడంతో ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.

కేంద్రం చెప్పు చేతల్లో దర్యాప్తు సంస్థలు : నామా నాగేశ్వరరావు
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీలు, విపక్షాల ఎంపీలతో కలసి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందుకు చేరుకుని, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు చేతబట్టుకుని పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్రం కావాలనే పార్లమెంట్లో చర్చకు అనుమతించకుండా తప్పించుకుంటుందని అన్నారు. వాయిదా తీర్మానాలను తోసిపుచ్చుతుందన్నారు. అయినా సరే మళ్లీ వాయిదా తీర్మానాలను ఇస్తామని నామా స్పష్టం చేశారు.

ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చిందని నామా ప్రశ్నించారు. ప్రధానంగా కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరుపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు, చర్చ జరుగుతోందని, దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్నారు. కేంద్రం చెప్పు చేతల్లో నడుస్తున్నాయని మండిపడ్డారు. లేని కేసుల్లో ఇరికించి, దర్యాప్తు పేరుతో ఇబ్బంది పెడుతున్నారని, ఈ విషయంపై ఎంపీల వాదనను పార్లమెంట్లో వినిపించేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారని అన్నారు. ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు. మోదీ సమాధానం చెప్పేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని నామా స్పష్టం చేశారు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని నామా మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement