Monday, November 29, 2021

పాలపిట్టలు కనిపించట్లే.. ఏమైతున్నయ్‌!

దసరా అంటే.. అందరికీ గుర్తుకు వచ్చేది పాలపిట్ట దర్శనం. పండగలో ప్రత్యేక స్థానం కలిగిన పాలపిట్ట నేడు అంతరించి పోయే పక్షి జాతుల జాబితాలో చిక్కుకుంది. దసరా రోజున పాలపిట్టను దర్శించుకుంటే అన్నీ శుభకార్యాలే జరుగుతాయన్న నమ్మకం ప్రజల్లో తరతరాల నుంచి కొనసాగుతూ వస్తుంది. కానీ ఆ పాలపిట్టకు మాత్రం శుభం జరగటంలేదు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నేటి ఆధునిక యుగంలో పర్యావరణ విధ్వంసం, రేడియేషన్‌, హానికర రసాయనాల వాడకంతో పక్షి జాతులు ప్రమాదపు అంచున ఉన్నాయి. అందులో పాలపిట్ట వేగంగా కనుమరుగవుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే దాదాపుగా కనుమరుగవుతున్న పాలపిట్టలు రాబోయే తరాల వారు పుస్తకాల్లో, ఫొటోల్లో, ఇంటర్నెట్‌లో చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.

తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలకు రాష్ట్ర పక్షి హోదాలో పాలపిట్ట ఉంది. దీన్నిబట్టి దక్షిణ భారతదేశం సమాజంలో పాలపిట్టకు ఉన్న ప్రత్యేకమైన స్థానాన్ని అర్థం చేసుకోవచ్చు. గతంలో తెలంగాణ ప్రాంతంలో ప్రతి 50మీటర్లకు ఒక పాలపిట్ట ఉండేది. కానీ నేడు దసరా నాడు పల్లెల్లో పాలపిట్ట దర్శనమే మహా కష్టంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. పట్టణాలు, నగరాల్లో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఈ మధ్య కాలంలో కొందరు దసరా రోజున పాలపిట్టలను పంజరంలో బంధించి ఆలయాల దగ్గర దర్శనం కలిగిస్తున్నారు. ఒకప్పుడు స్వేచ్ఛగా పల్లె పొలాల్లో తిరిగియాడే పాలపిట్టలను నేడు పంజరంలో చూస్తున్న పల్లెవాసుల గుండెలు తరుక్కుపోతున్నాయి.

దసరా నాటికి వరి పంట చేతికందుతుంది. అప్పటివరకూ పంటను కాపాడుతూ గింజలను తింటూ బ్రతికే పాలపిట్టను దసరా రోజున దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంస్కృతి. తాతల కాలం నుంచి ఇది ఆచారంగా కొనసాగుతోంది. పండగ పూట పొలం గట్ల వెంట వెళ్లి పాలపిట్టను దర్శించుకొని, జమ్మిని తెచ్చుకుంటారు. స్నేహితులు, బంధువులకు జమ్మి ఆకులు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. కానీ ప్రస్తుతం మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. దసరా రోజున చాలా మంది పాలపిట్ట దర్శనానికి వెళ్లి నిరాశతో వెనుదిరుగుతున్నారు.

ప్రాణాన్ని తీస్తున్న పెస్టిసైడ్స్‌..
పాలపిట్టలు వ్యవసాయానికి మంచి మిత్రులు. పంటకు పట్టిన పురుగును తిని పంటను కాపాడటంలో అనేక పక్షులతో పాటు పాలపిట్టలు ప్రధాన బాధ్యతను వహిస్తాయి. పంట కాలంలో పొలాల వెంట తిరుగుతూ కనిపించని కీటకాలు, పురుగుల నుంచి పంటను కాపాడే బాధ్యతను నిర్వర్తిస్తుంటాయి. కానీ ఆధునిక యుగంలో రైతులు రసాయనిక ఎరువులకు అలవాటు పడి అధికంగా వినియోగిస్తున్నారు. దాంతో హానికర రసాయన ఎరువులకు తట్టుకోలేక పాలపిట్టలు అంతరించే దుస్థితికి చేరుకున్నాయి. మితిమీరిన రసాయనాల వాడకంతో ఒకప్పుడు పాలపిట్టలు కాపాడిన పంట పోలాలే వాటి ప్రాణాలకు శాపంగా మారాయి.

అడవుల పునరుద్ధరణ మార్గం
ఇటీవల ప్రభుత్వం చేపడుతున్న హరితహారంలో భాగంగా అడవుల పున:సృష్టి జరిగితే పాలపిట్టలను మళ్లిd ప్రతి ఇంటి చెట్లపై చూసి, ప్రతి దసరాకి దర్శించుకునే వీలు కలుగుతుంది. రసాయన ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించి, సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రభాత్వం ప్రోత్సహించాలి. దీనికోసం సేంద్రియ ఎరువులను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తూ వాటి తయారీ, వినియోగంపై రైతులకు శిక్షణ ఇవ్వాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఆధునిక యుగంలో సెల్‌ఫోన్ల వాడకం పెరిగి పోవటంతో, వాటికి సరిపోయే విధంగా టెలికం కంపెనీలు విడుదల చేస్తున్న అధిక రేడియేషన్‌పై ప్రభుత్వాలు నియంత్రణ ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రేడియేషన్‌ ఖచ్చితమైన పరిమితులను నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News