Wednesday, March 27, 2024

Omicron : 38 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్.. మరణాలపై WHO కీలక ప్రకటన

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చేప కింద నీరులా విజృంభిస్తోంది. తక్కువ వ్యవధిలోనే వేగంగా విస్తరిస్తున్న ఈ ఒమిక్రాన్.. ఇప్పటి వరకు 38 దేశాలకు వ్యాపించింది. నవంబర్ 24న తొలిసారి కొత్తరకం వేరియంట్ B.1.1.529ను గుర్తించినట్టు దక్షిణాఫ్రికా ప్రకటించింది. ఈ తరువాత బోట్సవానా, హాంకాంగ్ నమీబియా దేశాలలో ఈ రకం కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం భారత్ సహా 38 దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించింది.

డెల్టా వేరియంట్ కంటే ఐదురెట్లు ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నది. భారత్ తోపాటు దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, హాంకాంగ్, కెనడా, అమెరికా, సౌదీ అరేబియా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, పాకిస్థాన్, చెక్ రిపబ్లిక్, నార్వే, ఫిన్లాండ్, యూకే, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, ఆస్ట్రియా, ఇజ్రాయేల్, నైజీరియా, ఘనా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, స్వీడన్, స్విట్జర్లాండ్, గ్రీస్, బ్రెజిల్ తదితర దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

అయితే, ఇప్పటి వరకూ ఒమిక్రాన్ బారినపడి ఎవరూ మృతిచెందలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ఇప్పటి వరకూ 38 దేశాలకు వైరస్ విస్తరించినట్టు తెలిపింది. అయితే, రాబోయే నెలల్లో ఐరోపాలో నమోదయ్యే సగానికంటే ఎక్కువ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉంటాయని హెచ్చరించింది.

మరోవైపు ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఇతర దేశల నుంచి వచ్చే ప్రయాణికులపై భారత్ లోని అన్ని ఎయిర్ పోర్టుల్లో గట్టి నిఘా పెట్టారు. పాజిటివ్ అని నిర్ధారణ అవుతున్న ప్రయాణికుల్ని క్వారంటైన్ కు తరలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement