Thursday, April 25, 2024

ఒమిక్రాన్‌ సెంచరీ.. దేశ వ్యాప్తంగా కొత్త టెన్షన్‌.. 101కు చేరిన కేసులు

న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు దేశంలో క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అతికొద్ది రోజుల వ్యవధిలో 91కు పైగా దేశాలకు విస్తరించిన ఈ వేరియంట్‌ మన దేశాన్ని కూడా టెన్షన్‌ పెడుతోంది. దేశంలో ఇప్పటి వరకు 11 రాష్ట్రాలకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాపించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ శుక్రవారం ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 101 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్టు ఆయన తెలిపారు. మహారాష్ట్రలో అత్యధికంగా 32 కేసులు వెలుగుచూశాయి. ఢిల్లిలో 22 కేసులు, రాజస్థాన్‌లో 17 కేసులు నమోదయ్యాయి. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 8 కేసుల చొప్పున రికార్డయ్యాయి. గుజరాత్‌, కేరళలో 5 కేసుల చొప్పున రికార్డయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌, చండీగడ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో 2 కేసుల చొప్పున వెలుగుచూశాయని లవ్‌ అగర్వాల్‌ ప్రకటించారు.

డెల్టా వేరియంట్‌ కంటే వేగం
ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని లవ్‌ అగర్వాల్‌ సూచించారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో అందరూ మాస్కులు ధరించాలని కోరారు. అనవసరపు ప్రయాణాలు పెట్టుకోవద్దని అన్నారు. డెల్టా వేరియంట్‌ కంటే ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎంతో వేగంగా ఉందని హెచ్చరించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. స్వల్ప లక్షణాలతో ఒమిక్రాన్‌ బాధితులు ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు. అందరి ఆరోగ్యపరిస్థితి కూడా నిలకడగానే ఉందని వివరించారు. ఒకే చోట గుమిగూడకుండా.. సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు.

వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ వేగవంతం
డెల్టా సర్క్యూలేషన్‌ తక్కువగా ఉన్న దక్షిణాఫ్రికాలో డెల్టా వేరియంట్‌ కంటే ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తిస్తోందని ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ తెలిపిందని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ జరిగే డెల్టా వేరియంట్‌ను ఒమిక్రాన్‌ అధిగమించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ సూచించినట్టు ఆయన గుర్తు చేశారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో.. దేశంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను వేగంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక రేటుతో 4.8 రెట్లు ఎక్కువగా కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్స్‌ నిర్వహిస్తున్నట్టు వివరించారు. అమెరికాతో పోలిస్తే.. 2.8 రెట్లు, యూకేతో పోలిస్తే.. 12.5 రెట్లు అధిక వ్యాక్సినేషన్‌ రేటు భారత్‌లో ఉందని వెల్లడించారు. అయితే దేశంలో ఉన్న కరోనా యాక్టివ్‌ కేసుల్లో కేరళలోనే 40.31 శాతానికి పైగా ఉన్నట్టు లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. గత 20 రోజులుగా కొత్త కేసుల సంఖ్య 10వేల కంటే దిగువనే ఉందన్నారు. 4 వారాలుగా పాజిటివిటీ రేటు 1 శాతం కంటే తక్కువే ఉందని తెలిపారు. 19 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5-10 శాతం ఉండగా.. 5 జిల్లాల్లో 10 శాతానికిపైగా ఉందన్నారు.

నూతన సంవత్సర వేడుకలు వద్దు
ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో 2.4 శాతం ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులే అని వివరించారు. నూతన సంవత్సర వేడుకలకు కూడా ప్రజలందరూ దూరంగా ఉండాలని, ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా జరుపుకోవాలని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 136 కోట్ల కరోనా టీకా డోసులను పంపిణీ చేసినట్టు వెల్లడించారు. 87.6 శాతం మందికి తొలి డోసు పూర్తయినట్టు వివరించారు. దేశ వ్యాప్తంగా 3లక్షలకు పైగా వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఉండగా.. ఇందులో 74 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్రభుతం సిద్ధంగా ఉందన్నారు. సరిపడా వ్యాక్సిన్‌ డోసులతో పాటు ఆక్సిజన్‌ నిలలు కూడా ఉన్నాయని వివరించారు. అయితే ప్రతీ ఒక్కరు కచ్చితంగా కరోనా మార్గదర్శకాలు మాత్రం పాటించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement