Tuesday, April 23, 2024

చ‌మురు లాభాలు కార్పొరేట్ల‌కే..

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని కుదిపేస్తున్నా భారత్‌కు మాత్రం లాభసాటిగానే మారింది. రష్యా దురాక్రమణను ఖండించిన ఐరోపా, అమెరికా దేశాలు ఆర్థిక ఆంక్షల్ని విధించాయి. రష్యా నుంచి దిగుమతుల్ని నిషేదించాయి. దీంతో చమురు, గ్యాస్‌ల ఎగుమతుల ద్వారానే భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తున్న ర ష్యా డోలాయమానంలో పడింది. ఈ దశలో 2022 ఏప్రిల్‌ నాటి అంతర్జాతీయ ధరలతో పోలిస్తే 30శాతం రిబేట్‌తో చమురును అమ్మేందుకు రష్యా సిద్ధపడింది. అమెరికా, ఐరోపా దేశాలు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా భారత్‌ మాత్రం ఈ అవకాశాన్ని అంది పుచ్చుకుంది. రష్యా నుంచి చమురు, గ్యాస్‌ల కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుంది. సాధారణంగా చమురు సరఫరాకు ముందుగానే నగదు చెల్లించాలి. అలాగే చమురు సరఫరా కేంద్రం నుంచి దిగుమతి చేసుకుంటున్న దేశాలే రవాణా చార్జీలు భరించాలి. కానీ రష్యా ఎదుర్కొంటున్న ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో చమురు చెల్లింపులకు ఆరుమాసాల పాటు గడువిచ్చింది. దీంతో పాటు రష్యా ఉత్పత్తులను సరఫరా చేస్తున్న నౌకలపై నాటో దేశాలు దాడి చేసే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుంది. నేరుగా భారత్‌కు చమురు, గ్యాస్‌లను చేర్చే విధంగా ఈ ఒప్పందాల్ని అమలు చేసింది.
భారత్‌ చమురు వినియోగంలో 82శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది. అయితే యుద్ధానికి ముందు వరకు రష్యా నుంచి భారత్‌ దిగుమతి చేసుకునే చమురు పరిమాణం చాలా తక్కువ. భారత్‌ దిగుమతి చేసుకునే చమురులో 61శాతం మధ్యప్రాశ్చ్య దేశాల నుంచే నిర్వహిస్తోంది. అమెరికా నుంచి 14శాతం, ఆఫ్రికా దేశాల నుంచి 12శాతం, లాటిన్‌ అమెరికా దేశాల నుంచి ఐదుశాతం దిగుమతులు నిర్వహిస్తోంది. రష్యా నుంచి కేవలం రెండు శాతం మాత్రమే దిగుమతులు జరిపేది. కాగా ఇప్పుడు రష్యా నుంచి దిగుమతుల పరిమాణం 33రెట్లు పెరిగింది. గతేడాది జనవరిలో రష్యా నుంచి భారత్‌ రోజుకు 50పీపాలను దిగుమతి చేసుకుంటే ఈ ఏడాది జనవరిలో ఈ దిగుమతి రోజుకు 17లక్షల బ్యారెళ్ళకు చేరుకుంది. అంతకుముందు భారత్‌ అత్యధికంగా ఇరాక్‌ నుంచి చమురు దిగుమతి చేసుకునేది. కాగా ఇప్పుడు ఆ స్థానాన్ని రష్యా ఆక్రమించింది.

ఇంత భారీగా రష్యా నుంచి చమురు భారత్‌కొస్తోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే 30శాతం తక్కువకే ఇది లభిస్తోంది. పైగా రవాణా చార్జీలు, రవాణా బీమా మొత్తాలు కూడా అదనపు లాభాల్ని చేకూరుస్తున్నాయి. అయితే గతేడాదిలో పెట్రోల్‌, డీజెల్‌, కిరోసిన్‌, ఇతర చమురు ఉత్పత్తుల్ని నెలకు రెండుమూడుసార్లు చొప్పున ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గృహ వినియోగ గ్యాస్‌పై ప్రభుత్వం అదనపు భారాన్ని వడ్డించింది. మరి ఏడాది క్రితం ధరలకంటే 30శాతం తక్కువ ధరపైనే చమురు లభిస్తున్నా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మాత్రం దేశంలో పైపైకి ఎగబాకడం విశ్లేషకుల్ని కూడా తీవ్రంగా ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. ఇలా చమురు దిగుమతుల కారణంగా చేకూరుతున్న లాభాల్ని ఏమవుతున్నాయ్‌? సహజంగానే ఈ ప్రక్రియ కారణంగా దేశంలో పెట్రోల్‌, డీజెల్‌, ఇతర పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గుతాయని ఆశిస్తారు. కానీ అందుకు భిన్నంగా ఈ ధరలు రోజు రోజుకు పెరగడానికి కారణాలేంటన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

రష్యా నుంచి చమురును కొనుగోలు చేయకూడదని అమెరికా, ఐరోపా దేశాలు నిర్ణయించాయి. అయితే భారత్‌కు రష్యా తక్కువ ధరపై సరఫరా చేస్తున్న చమురుతో తిరిగి ఆదేశాలే లాభపడుతున్నాయి. మధ్యలో భారత్‌కు చెందిన కొన్ని ప్రైవేటు వ్యాపార సంస్థలు భారీగా లాభాల్ని ఆర్జిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో వినియోగదారులకు ఏవిధంగానూ కలిసొచ్చిందేంలేదు. ఇందుకు కారణం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురులో అధిక భాగం రిలయన్స్‌, నయారా సంస్థలు నిర్వహిస్తున్నవే. వాస్తవానికి అమెరికాతో రిలయన్స్‌ సంస్థలకు భారీ వ్యాపార సంబంధ బాంధవ్యాలున్నాయి. అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలుకు భారత్‌ ముందుకొచ్చినప్పటికీ ఈ ప్రక్రియలో భాగం కావడానికి రిలయన్స్‌ సాహసించలేదు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే అమెరికాకు ఆగ్రహం కలుగుతుందని భయపడింది. కానీ అనూహ్యంగా భారత ప్రభుత్వరంగ సంస్థలకంటే రిలయన్స్‌ అధిక మొత్తంలో రష్యాకు ఆర్డర్లు జారీ చేసింది. ఇప్పుడు రోజూ భారత్‌ రష్యా నుంచి 17లక్షల బ్యారెళ్ళు కొనుగోలు చేస్తుంటే అందులో 6లక్షల బ్యారెళ్ళు ఒక్క రిలయన్స్‌ కొంటోంది. 3లక్షల బ్యారెళ్ళు నయారా ఎనర్జీ కొనుగోలు చేస్తోంది. మిగిలిన 8లక్షల బ్యారెళ్ళను ప్రభుత్వరంగ సంస్థలైన ఐవోసీ, బీపీసీఎల్‌, ఐపీసీఎల్‌, తదితర సంస్థలు కొంటున్నాయి. రిలయన్స్‌ చమురు శుద్ధి కర్మాగారాల సామర్థ్యంలో సగానికి పైగా ఇప్పుడు రష్యన్‌ చమురునే శుద్ధి చేసి సరఫరా చేస్తున్నాయి. ఇక నయారా ఎనర్జీ పూర్తి సామర్థ్యం మేరకు రష్యా చమురునే వినియోగిస్తోంది. అంతర్జాతీయ ధరతో పోలిస్తే భారత్‌కు సుమారు 30శాతం తక్కువ ధరపై రష్యా చమురును సరఫరా చేస్తున్నందున ఒక్కొక్క ట్యాంకర్‌ చమురుపై కోటి డాలర్ల అదనపు ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. గతేడాది జామ్‌నగర్‌లోని రిలయన్స్‌ రిఫైనరీకి రష్యా నుంచి 215ట్యాంకర్ల చమురు దిగుమతి అయింది. కాగా రష్యా నుంచి సుమారు 173ట్యాంకర్లు రిలయన్స్‌కు చెందిన ఇతర రిఫైనరీలకు చేరుకున్నాయి. రిలయన్స్‌ ఈ ముడి చమురు నుంచి వర్జిన్‌ గ్యాస్‌ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఆయిల్‌ను అమెరికా, ఇంగ్లండ్‌లకు రిలయన్స్‌, నయారా సంస్థలు అమ్ముతున్నాయి. ఈ వర్జిన్‌గ్యాస్‌ ఆయిల్‌ను అమెరికా, బ్రిటన్‌లు తిరిగి పెట్రోల్‌, డీజెల్‌, ఇథనాల్‌ తదితర చమురు ఉప ఉత్పత్తులుగా మార్చి వినియోగించుకుంటున్నాయి. నేరుగా చమురును కొనుగోలు చేస్తే అంతర్జాతీయ ఆంక్షలు అమలయ్యే అవాశం ఉన్నందున రిలయన్స్‌, నయారా సంస్థలతో అమెరికా, బ్రిటన్‌లు ఈ తరహా ఒప్పందాలు కుదర్చుకున్నాయి.

- Advertisement -

రష్యా భారత్‌కిచ్చిన వెసులుబాటు తిరిగి అమెరికా, బ్రిటన్‌లకే ప్రయోజనకారిగా మారింది. ఇందులో భారతీయ సంస్థలు మధ్యవర్తిత్వ పాత్రను పోషిస్తూ భారీగా లాభాల్ని మూటగడుతున్నాయి. అయితే ఈ విషయం తెలిసి కూడా రష్యా ఎటువంటి చర్యలకు దిగడంలేదు. ఇందుకు కారణం ఆమాత్రం విక్రయాలు లేనిపక్షంలో రష్యాలో చమురు ఉత్పాదక సంస్థలు మూతబడే ప్రమాదముంది. దీంతో ఈ పరిణామాల్ని రష్యా కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. కాగా భారత్‌లో మాత్రం రష్యా నుంచి తక్కువ ధరకు చమురు దిగుమతవుతోందన్న ప్రచారం ఉంది. అలాగే చమురు ఉత్పత్తులపై ధరలు తగ్గుతాయన్న ఆశాభావం కూడా నెలకొంది. అయితే అధికార పార్టీ మాత్రం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ధరల వ్యత్యాసంతో ఒనగూరే నిధుల్ని యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇరాన్‌, ఇరాక్‌, సౌదీ తదితర దేశాలకు పడ్డ పాతబకాయిల్ని తీర్చేందుకు వెచ్చిస్తున్నామంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో వాస్తవ పరిస్థితిని మరుగుపరుస్తున్నారు. దీర్ఘకాలిక మిత్ర దేశం రష్యా భారత్‌ ప్రజల కోసం కల్పిస్తున్న చమురు ధర వ్యత్యాస ఫలితాన్ని ఈ దేశ ప్రజలకందిస్తే ప్రస్తుత పెట్రోల్‌, డీజెల్‌, గ్యాస్‌ ధరలు కనీసం 30నుంచి 40శాతం తగ్గే అవకాశాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement