Thursday, April 25, 2024

తెలుగురాష్ట్రాలకు షాక్: ఒడిశాకు వస్తే క్వారంటైన్‌లో ఉండాల్సిందే!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చే వారిపై ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత వాహనాలు, రైళ్లు లేదా ఏ ఇతర మార్గాల ద్వారా ఒడిశాకు వచ్చే తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కచ్చితంగా తమ రాష్ట్రంలో 14 రోజులు క్వారంటైన్‌ లో ఉండాల్సిందే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. సరిహద్దు జిల్లాలైన గంజాం, గజపతి, రాయగడ, కోరాపుట్, మల్కన్ గిరి, నబరంగ్ పూర్ జిల్లాల కలెక్టర్లు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఒడిశా ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొంది. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వాళ్లు లేదా 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చినవాళ్లకు మాత్రం క్వారంటైన్‌ గడువును 7 రోజులకు తగ్గించింది. అయితే కరోనా అత్యవసర విధులు నిర్వహించే వారితో పాటు ప్రైవేటు ఆస్పత్రులు, ఒడిశా ప్రభుత్వంతో పనుల నిమిత్తం వచ్చేవారికి వీటి నుంచి మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. అయితే వారంతా కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement