Saturday, January 22, 2022

న్యూడ్ చాటింగ్‌తో ముగ్గులోకి..

  • యువ‌కుల వీక్‌నెస్‌తో ఆడుకుంటుకున్న మోస‌గాళ్లు

అంద‌రి ద‌గ్గ‌ర స్మార్ట్‌ఫోన్లున్నాయి. కావాల్సినంత డేటా ఉంటోంది. ఖాళీగా ఉంటున్న యువ‌త‌ను టార్గెట్ చేసుకునే కొంత‌మంది న్యూడ్ చాట్‌తో ముగ్గులోకి లాగుతున్నారు. వారి వీడియోలు తీసి బెదిరింపుల‌కు పాల్ప‌తున్నారు.. ఇట్లాంటి నేరాలు ఇప్పుడు హైద‌రాబాద్‌లో ఎక్కువైన‌ట్టు పోలీసులు చెబుతున్నారు.

సైబర్ క్రైం కేసులు ఛేదించే పోలీసులకు కొన్ని కేసుల ఎంక్వైరీలో ఈమ‌ధ్య విస్తుగొలిపే కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఎవరో బాగా టెక్నాలజీ తెలిసిన వాళ్లు ఇతరులను మోసం చేయడం ఒకప్పటి సైబర్ క్రైం టెక్నిక్. కానీ, ఇప్పుడు ట్రెండ్ అది కాదు. చదువుతో, ప్రాంతంతో సంబంధం లేకుండా పల్లెల నుంచే పెద్ద పెద్ద నెట్‌వర్క్ నడిపిస్తున్నారు. వీళ్లు ఒక్కొక్కరుగానే కాదు, కొంత మంది టీమ్‌లుగా ఏర్పడి ఇదే పని చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవల కొన్ని సైబర్ క్రైం నేరాలతో సంబంధం ఉన్న వారిని అరెస్టుచేసే క్రమంలో ఎన్నో ఆసక్తికర విషయాలు కనుగొన్నారు రాచకొండ సైబర్ క్రైం పోలీసులు.

జార్ఖండ్ రాష్ట్రం దేవగఢ్ జిల్లాలో ఇలాంటి నేరస్థుల అడ్డాలు కొన్ని ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే అక్కడకు వెళ్లిన రాచకొండ పోలీసుల బృందం వేర్వేరు కేసులు ఎదుర్కుంటొన్న 10 మంది సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ తీసుకువచ్చింది. 20 నుంచి 40ఏళ్ల మధ్య వయసున్న వీరంతా రకరకాల నేపథ్యాలు, గ్రామాల నుంచి వచ్చినవారే. అందరిదీ ఒకే జిల్లా. జమీల్ అన్సారీ, బర్జహాన్ అన్సారీ, అఖ్లక్ హుస్సేన్, సర్ఫరాజ్ అన్సారీ, సిరాజ్ అన్సారీ, సుశీల్ మండల్, సునీ కుమార్, శేఖర్ కుమార్, వినోద్ దాస్, రాంచరణ్ దాస్ అనే 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరి ప్రత్యేకత ఏంటంటే..
నేరం చేసిన విధానాలు, అందులో కొత్త కొత్త పద్ధతులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. తాము నేర్చుకున్న కొత్త పద్ధతులను ఇతరులకు నేర్పుతారు. టెక్నాలజీ విషయంలో కోఆప‌రేట్ చేసుకుంటారు. అలా సహకరిస్తూ సైబర్ దొంగతనాల సంఖ్య, దోచే మొత్తాన్ని పెంచేస్తున్నారు. నకిలీ ఐడీలతో భారీ ఎత్తున సిమ్ కార్డులు కొనడంతో వీరి పని షుర‌వవుతోంది. జార్ఖండ్ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో సిమ్ కార్డులు ఒకేసారి కొనుగోలు చేసి.. వాటి పని అయ్యాక‌ పక్కన ప‌డేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

కష్టమర్ కేర్ తరహా మోసం..
తాము తీసుకున్న నెంబ‌ర్ల‌ను ఇంటర్నెట్లో కష్టమర్ కేర్ నెంబ‌ర్లుగా అప్‌డేట్ చేస్తారు. జనం తరచూ వాడుతూ డబ్బు చెల్లింపుల్లో ఆలస్యం అవడం, లేదా రెండు మూడు రోజులు డబ్బు ఇరుక్కునే యాప్స్‌ని, షాపింగ్ సైట్స్‌నీ టార్గెట్ చేస్తుంటారు. ఉదాహరణకు గూగుల్ పే, ఫోన్ పే, ఇతర ఈ కామర్స్ వెబ్‌సైట్లలో చాలా మందికి అప్పుడప్పడు డబ్బు స్ట్రక్ అయిపోతుంది. దీంతో వారు వెంటనే కష్టమర్ కేర్‌ని సంప్రదించాలనుకుంటారు. అప్పటికే ఆ కంపెనీల కష్టమర్ కేర్ల నెంబ‌ర్లు ఇవే అంటూ కొన్ని నకిలీ నెంబ‌ర్ల‌ను నెట్లో ప్రచారంలో పెడతారు. దీంతో గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఆ నకిలీ నెంబ‌ర్లే కష్టమర్ కేర్ నెంబ‌ర్లుగా చూసేవారికి కనిపిస్తాయి. దాన్ని గమనించకుండా వాటికి కాల్ చేస్తే, అప్పుడు మొదలౌతుంది అసలు కథ.

మాయ మాటలతో…
తాము కష్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లమని కబుర్లు చెప్పి… వారి డబ్బు వెనక్కు ఇచ్చే క్రమంలో లేదా సమస్యను పరిష్కరించే క్రమంలో కొన్ని నోటిఫికేషన్లు పంపి వాటిని క్లిక్ చేయమంటారు. లేదా వారి ఒరిజినల్ గూగుల్ పే, ఫోన్ పే నంబర్లు, యూపీఐ పిన్ నంబర్లూ తీసుకుంటారు. అప్పుడు వారి యాప్స్ ఓపెన్ చేసి తమ పర్సనల్ వివరాలు ఎంటర్ చేయమని చెప్పి అదే పద్ధతిలో ఎక్కౌంట్లోకి డబ్బులు వేయించుకుంటారు. కొందరి విషయంలో ఒక అడుగు ముందు కేసి టీమ్ వ్యూయర్, ఎనీ డెస్క్, క్విక్ సపోర్ట్ వంటి ప్రోగ్రాంల సాయంతో అవతలి వారి స్క్రీన్‌ని కంట్రోల్ తీసుకుంటారు. అక్కడి నుంచి వారి ద్వారా పిన్ నంబర్ ఎంటర్ చేయించి, లేదా ఓటీపీ చూసి, డబ్బు ట్రాన్సఫర్ చేయిస్తారు. అలా దొంగిలించిన డబ్బును ఒక ఎక్కౌంట్లో ఉంచకుండా తమవి, తమ వాళ్లవీ కలపి ముందే సిద్ధం చేసిన కొన్ని ఈ కామర్స్ సైట్ల వాలెట్లలోనూ, ఇతరత్రా బ్యాంకు ఎక్కౌంట్లలోనూ దాస్తారు. త‌ర్వాత వాటిని చిన్న మొత్తాలుగా పంచుకుంటారు.

న్యూడ్ చాట్
కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారాలపైనా, ఇతర డేటింగ్ వెబ్‌సైట్లలోనూ న్యూడ్ గాళ్స్, న్యూడ్ చాట్ అని యాడ్స్ పెడతారు. ఎవరైనా కాంటాక్ట్ చేస్తే ముందే సిద్ధం చేసిన వ్యక్తి చేత చాటింగ్ లేదా వీడియో చాటింగ్ చేయిస్తారు. చాటింగ్ పూర్తయిన వెంటనే ఈ చాటింగ్ అంతా రికార్డ్ అయింది. మీరు డబ్బు ఇవ్వకపోతే దాన్ని నెట్లో అప్లోడ్ చేస్తాం లేదా మీ సోషల్ మీడియా ఎక్కౌంట్లలో అప్లోడ్ చేస్తామంటూ బెదిరించి డబ్బ వసూలు చేస్తారు.

ఇలాంటి వారి బారిన పడకూడదంటే..
తెలియని ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్, మెసేజీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
బ్యాంకు సిబ్బంది, కష్టమర్ కేర్ సిబ్బంది అని చెప్పినా కానీ, క్రెడిట్ కార్డు, ఏటీఎం కార్డు వివరాలు ఇవ్వకూడదు.
వేరే వాళ్లు ఫోన్ చేసి, మెసేజీ చేసి పంపిన లింక్స్లో మీ కార్డుల వివరాలు, నెట్ బ్యాంకింగ్ వివరాలు ఎంటర్ చేయకూడదు.
టీమ్ వ్యూయర్, ఎనీ డెస్క్ వంటివి ఇన్స్ట్లాల్ చేయకూడదు.
గుర్తు తెలియని లింకులు ఓపెన్ చేయవద్దు.
గూగుల్ సెర్చ్ లో కనిపించే నకిలీ కష్టమర్ కేర్ నంబర్ల పట్ల జాగ్రత్త

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News