Friday, March 29, 2024

తాజ్ మ‌హ‌ల్ కి ఆస్తిప‌న్ను చెల్లించాల‌ని నోటీసులు.. అవాక్క‌యిన ఏఎస్ ఐ అధికారులు

చారిత్రాత్మ‌క క‌ట్ట‌డం తాజ్ మ‌హ‌ల్ కి ఆస్తిప‌న్ను చెల్లించాల‌ని అధికారులు నోటీసులు పంపారు. అంతేకాదు పెండింగ్ లో ఉన్న వాటర్ బిల్లును కూడా వెంటనే చెల్లించాలని సూచించారు. నిర్ణీత టైం లోగా బిల్లులు చెల్లించకుంటే తాజ్ ను సీజ్ చేస్తామని హెచ్చరిస్తూ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)కు నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్న ఏఎస్ఐ అధికారులు అవాక్కయ్యారు. ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేసిన నిర్వాకమిది. ఇలాంటి నోటీసులు అందుకోవడం ఇదే తొలిసారి అని, ఇదేదో పొరపాటుగా జరిగి ఉంటుందని చెప్పారు. ఎందుకంటే.. పురాతన, చారిత్రక కట్టడాలకు పన్నులు వర్తించవని వివరించారు.

వాటర్ బిల్లు కూడా తాజ్ కు వర్తించదన్నారు. తాజ్ మహల్ ఆవరణలో పచ్చదనాన్ని కాపాడేందుకు నీటిని ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన నోటీసుల ప్రకారం.. తాజ్ మహల్ కు సంబంధించి రూ.1.9 కోట్ల ఆస్తి పన్ను, రూ.1.5 లక్షల వాటర్ బిల్ పెండింగ్ లో ఉన్నాయి. దీనిపై కమిషనర్ నిఖిల్ స్పందిస్తూ.. ఆగ్రా మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ డ్రైవ్ ను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) సర్వే చేసి, పన్నులు లెక్కించామని తెలిపారు. వాటి ఆధారంగా ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కట్టడాలకు నోటీసులు పంపామన్నారు. ఏఎస్ఐ నుంచి వచ్చే జవాబు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని నిఖిల్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement