Saturday, April 20, 2024

‘నిర్లక్ష్యం కాదు.. అది కుట్రే’.. లఖింపూర్ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక

లఖింపూర్ ఖేరీ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం పలు సంచలనాత్మక వివరాలను అందించింది. కోర్టుకు సమర్పించిన ఈ నివేదిక ప్రకారం.. అది నిర్లక్ష్యం నడపడం వల్ల జరిగిన ప్రమాదం కాదని, పక్కా ప్రణాళికా ప్రకారం రైతులను, విలేకరిని చంపేందుకు వేసిన పన్నాగమేనని దర్యాప్తు బృందం వెల్లడించింది. కాగా, ఈ కేసులో రెండో చార్జిషీట్ ని దాఖలు చేశారు పోలీసులు.

లఖింపూర్ ఖేరీ కేసులో రెండో చార్జిషీట్ దాఖలు చేశారు పోలీసులు. కేంద్ర మంత్రి కుమారుడు నడిపిన SUV రైతులపై దూసుకెళ్లినట్టు కేసులో ఆరోపణలున్నాయి. కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని గతేడాది రైతులు ఆందోళన చేస్తుండగా.. నిరసనకారుల మీది నుంచి ఈ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు, ఓ జర్నలిస్టు చనిపోయారు. కాగా, కావాలనే కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఈ దారుణానికి ఒడిగట్టారని తొలి చార్జిషీట్‌ దాఖలు చేశారు. అదే కేసులో రెండో చార్జిషీట్‌ ఇవ్వాల దాఖలు చేయగా.. దానిలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఎస్‌యూవీ డ్రైవర్‌ను కొట్టి చంపిన హింసాత్మక ఘటనలు ఉన్నాయి.

ఈ కేసులో తమ దర్యాప్తులో ఏడుగురు రైతులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే వారందరిపై హత్యా నేరం మోపబడిందో లేదో స్పష్టంగా తెలియదు. హింసను ప్రేరేపించారని ఆరోపిస్తూ పేరు తెలియని రైతులపై స్థానిక బీజేపీ కార్యకర్త సుమిత్ జైస్వాల్ ఫిర్యాదు చేసిన తర్వాత రెండో పోలీసు కేసు నమోదు చేశారు. విస్తృతంగా ప్రసారం చేయబడిన సెల్‌ఫోన్ వీడియోలలో సుమిత్ జైస్వాల్ రైతులను కొట్టిన SUVలలో ఒకదాని నుండి పరుగెత్తటం కనిపించింది. ఆ తర్వాత హోంమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అదే కేసులో సహ నిందితుడిగా అరెస్టయ్యాడు.

ఆశిష్ మిశ్రా, మరో 12 మందిని అరెస్టు చేశారు పోలీసులు. వారు హత్య, కుట్ర ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ నెల ప్రారంభంలో లఖింపూర్ ఖేరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం 14 మందిపై 5,000 పేజీల చార్జిషీట్‌ను స్థానిక కోర్టుకు సమర్పించింది. సంఘటన సమయంలో ఆశిష్ మిశ్రా ఘటనా స్థలంలో ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు. మంత్రి, అతని కుమారుడు పేర్కొన్న దానికి విరుద్ధంగా నిరసన తెలిపిన రైతులు, జర్నలిస్టుపై దాడికి పాల్పడిన SUVలలో ఒకదానిలో ఆశిష్ మిశ్రా ఉన్నారని చార్జిషీట్ నమోదు చేశారు. రైతులను, జర్నలిస్టును హత్య చేయాలనే ఉద్దేశ్యంతో జరిగిన ‘ప్రణాళిక పన్నాగం’ అని, నిర్లక్ష్యంతో జరిగిన ఘటన కాదని ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టుకు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement