Saturday, April 20, 2024

వంకలు పెట్టే మనిషిని కాదు.. నలతగా ఉన్నందునే విశ్రాంతి తీసుకుంటున్నా: ర‌ఘురామ‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తాను వంకలు పెట్టి తప్పించుకునే రకం మనిషిని కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎంపీ (నర్సాపురం) కె. రఘురామకృష్ణ రాజు అన్నారు. మంగళవారం విచారణకు హాజరుకావాల్సిందిగా సీఐడీ అందించిన నోటీసులపై స్పందిస్తూ.. తనకు నలతగా ఉందని, ఆదివారం కొన్ని వైద్య పరీక్షలు కూడా చేయించుకున్నానని, మంగళ, బుధవారాల్లోనూ మరికొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని వివరణ ఇచ్చారు. కోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశానని, అన్ని విషయాలూ సీఐడీకి కూడా తెలియజేశానని అన్నారు. తాను వంకలు పెట్టి తప్పించుకు తిరిగే రకం కాదని, చట్టాన్ని గౌరవించే వ్యక్తినని తెలిపారు.

రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలే తన పదవీకాలంలో చిట్టచివరి సమావేశాలని ఈ సందర్భంగా రఘురామకృష్ణ రాజు అన్నారు. అందుకోసమే తాను మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని, ప్రధానికి రాసిన లేఖలో అన్ని విషయాలు వివరించానని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిందిగా ప్రధానిని కోరానన్నారు. ప్రధాన మంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు కోరినట్టు రఘురామ తెలిపారు.

తాను విశ్రాంతి తీసుకుంటుంటే విజయసాయి రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని రఘురామ దుయ్యబట్టారు. విజయసాయి రెడ్డి గతంలో ప్రాణభయం ఉందంటూ డీజీపీ ఆఫీసుకు పరుగులు తీశారని, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో విజయసాయి రెడ్డిని ఎవరు చంపుతానన్నారో.. వారి నుంచే తనకూ ప్రాణహాని ఉందని రఘురామ తెలిపారు. కోడి కత్తి కేసు గురించి విజయసాయి రెడ్డి వివరించి చెప్పాలన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కోడి కత్తి కేసును ఎందుకు పక్కనపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే బాబాయి (వైఎస్ వివేకానంద రెడ్డి)ని ఎవరు హత్య చేశారో చెప్పాలని, దీనిపై విజయసాయి రెడ్డి బదులివ్వాలని నిలదీశారు. గొడ్డలిపోటు నుంచి ఎవరిని కాపాడ్డం కోసం విజయసాయి రెడ్డి ఈ ఘటనను గుండెపోటుగా అభివర్ణించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి కార్యాలయానికి తరచుగా వెళ్లే శివశంకర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. హత్యలు చేసే చరిత్ర ఎవరికుందో విజయసాయి రెడ్డికి బాగా తెలుసన్నారు. విజయసాయి రెడ్డి ఎలా భయపడ్డారో, తాను కూడా అలాగే భయపడుతున్నానని రఘురామ తెలిపారు. తన ప్రాణాలు కాపాడుకోవడం కోసమే ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నానని, విజయసాయి రెడ్డి సైతం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. విజయసాయికి రెండోసారి రాజ్యసభ అవకాశం ఇవ్వడం లేదని తెలిసిందని రఘురామ అన్నారు. భవిష్యత్తులో విజయసాయి రెడ్డికి కూడా తనకు ఎదురయ్యే పరిస్థితే ఎదురవుతుందని జోస్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement