Friday, April 19, 2024

జోష్ సరే…. కాంగ్రెస్ లో ఐక్యత ఎక్కడ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ విజయం తో తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో జోష్‌ పెరిగింది. రాష్ట్రం లోనూ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే ఎన్నికల్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరిచాయ ని రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణాలో కూడా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం ఆ పార్టీ నాయకల్లో వ్యక్తం అవు తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్ట డం ఖాయమన్న ధీమాను నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇంత వరకు భాగానే ఉంది. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందు కు భిన్నంగా కనిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయి లో నేతల మధ్య ఐక్యత కొరవడందని, దాన్ని అధిగమిస్తేనే అను కున్న లక్ష్యానికి చేరుకుంటారనే మరో వాదన కూడా బలంగా విని పిస్తోంది. రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు మెజార్టీ నియోజక వర్గాల్లో పార్టీ నేతల మధ్య విభేదాల తీవ్రంగానే ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో సమస్యలను పరిష్కరించి పార్టీని ప్రక్షాళన చేస్తే తప్ప వచ్చే ఎన్ని కల్లో విజయం సాధ్యం కాదని, మండల, నియోజక వర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నాయకుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని పార్టీ వర్గాలే అభి ప్రాయ పడుతున్నాయి. అయితే తెలం గాణ కాంగ్రెస్‌ నాయకుల్లో ఐక్యమత్యమే అసలు సమస్యగా ఉంటుందన్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండ టంతో అందరు ఒకే తాటిపైకి వచ్చి ఐక్యంగా నడుస్తున్నట్లు ప్రజల్లోకి బలమైన సంకేతాలు పంపాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్త మవుతోంది. అయితే నాయకుల మధ్య ఉన్న బేధాభిప్రాయాలు కాంగ్రెస్‌ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నాయి. వారి వెంట ఉన్న కార్యకర్తలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి నెలకొన్నది. ఒక నాయకుడు వెంట వెళ్లితే.. మరొక నేతకి కోపం ఉంటోందనే భయం కార్యకర్తల్లో నెలకొన్నది.

దీంతో పార్టీ క్యాడర్‌, సానుభూతిపరులు మౌనం పాటిస్తున్నారు. క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న ఈ పరిస్థితులను చక్కబెట్టేందుకు పార్టీ అధిష్టానం తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలోని నాయకుల మధ్య నెలకొన్న బేధాభిప్రాయాలను పూర్తి స్థాయిలో తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలింగ్‌ బూత్‌, బ్లాక్‌, మండల, అసెంబ్లిd స్థాయి వరకు అన్ని స్థాయిల్లోనూ ఈ విభేదాలు సమసిపోవాల్సిన అవసరం ఉందని, ఇది జరిగితేనే పార్టీ శ్రేణులు నాయకుల వెంట స్వేచ్ఛగా తిరుగుతారని చెబుతున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో పార్టీ కూడా మరింత బలోపేతం అవుతుంది. ఇప్పటికైనా దృష్టి సారించకపోతే కార్యకర్తల్లో అభద్రతభావం తొలిగిపోదని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.

కాంగ్రెస్‌తో టచ్‌లోకి వచ్చిన బీజేపీ, బీఆర్‌ఎస్‌ అసంతృప్తులు..?
కర్ణాటక ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్‌కు కొంత మేర సానుకూల వాతావరం ఏర్పడటంతో.. ఇతర పార్టీల నుంచి వలస వచ్చే నేతల సంఖ్య భారీగా ఉంటుందని పీసీసీ అంచనా వేస్తోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌, బీజేపీలో అసంతృప్తిగా ఉన్న కొందరు నాయకులు టీ పీసీసీ నాయకత్వంతో టచ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఆచితూచి అడుగులు ముందుకు వేయాల్సి ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీ జెండా మోస్తున్న వారిని పక్కన పెట్టి.. ప్యారాచూట్‌తో ఇప్పటికిప్పుడు బయటి నుంచి వచ్చే వారికి ప్రాధాన్యత ఇస్తే.. తీవ్ర గందరగోళం ఏర్పడుతుందని అంటున్నారు. పార్టీలోకి వచ్చే వారి విషయంలో లాభా నష్టాలను అంచనా వేసుకుని.. వారికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం అవసరమనే సూచనలు కూడా వస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్లతో కాంగ్రెస్‌ పార్టీ చర్చలు జరిపినప్పటికి.. వారి చేరికపైన స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. వీరు కాకుండా మరి కొంత మంది నాయకులు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఇటీవలనే కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌, బీజేపీలోకి వెళ్లిన వారిలో కొందరు నాయకులు ఆయా పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. వారిలో పలువురు నాయకులు ఇప్పటికే రాష్ట్ర నాయకత్వంతో టచ్‌లో ఉంటూ.. సమయం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

కర్ణాటకలో విభేదాలను పక్కన పెట్టడంతోనే విజయం..
కర్ణాటక అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీ విజయం సాధించడానికి కారణం.. ఆ రాష్ట్ర నాయకుల మధ్య నెలకొన్న విభేదాలను పక్కన పెట్టడమే ప్రధాన కారణమని చెబుతున్నారు. ‘ పార్టీ ముందు.. ఆ తర్వాత మనం ‘ అనే నినాదంతో మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌ కలిసి పని చేయడం వల్లే విజయం సాధ్యమైందని, అందుకు ఏఐసీసీసీ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే మంత్రం కూడా బాగానే పని చేసింది. వీటన్నింటికి ముందు అధిష్టానం చేసిన సూచనలను పార్టీ నాయకులు పాటించి కలిసికట్టుగా పని చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ మాత్రం టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని పలువురు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డితో పాటు పలువరు సీనియర్లు రేవంత్‌రెడ్డితో ఒక రోజు కలిసినట్లే ఉంటారు.. మరొక రోజు విమర్శలకు పదును పెట్టడమే కాకుండా తామే సీఎం అంటూ ప్రకటించుకుంటారు. దీంతో పార్టీ కేడర్‌లో గందరగోళానికి దారి తీయడమే కాకుండా.. ప్రజల్లోనూ ఆయోమయానికి గురి చేయడం వల్లే ఇబ్బందులు వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టాలంటే నాయకుల మధ్య ఉన్న ఈగోలను పక్కటన పెట్టాల్సిన అవసరం ఉందని, లేదంటే పాత ఫలితాలే పునరావృతం అవుతాయని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement