Saturday, April 20, 2024

విభ‌జ‌న స‌మ‌స్య‌ల చిక్కుముడి – ఎనిమిదేళ్లైనా దొర‌క‌ని ప‌రిష్కారం ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎనిమిదేళ్లయినా ఇంకా విభజన సమస్యల పరిష్కారానికి నోచుకోకపోవడంపై కేంద్రం సీరియస్‌గా దృష్టి సారించింది. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై హోంమంత్రిత్వ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరు రాష్ట్రాల వాదనలు, భిన్నాభిప్రాయాలపై న్యాయ సలహా తీసుకొని ముందుకు సాగేందుకు రెడీ అవుతున్నది. తొలుత ఏకాభిప్రాయం వ్యక్తమైన అంశాలను తీర్చాలని, కోర్టులో ఉన్న పెండింగ్‌ అంశాలు మినహా మిగతా వాటిని పరిష్కరించాలని శ్రమిస్తోంది. 10ఏళ్ల ఉమ్మడి రాజధాని, పునర్‌వ్యవస్థీకరణ చట్టం చెప్పినట్లుగా గడువులోగా సమస్యల నివారణతో ముందడుగేయాలని ప్రయత్నాలు చేస్తోంది. న్యాయ శాఖ నుంచి త్వరలో రాతపూర్వక అభిప్రాయం వచ్చిన వెంటనే రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నది.

ఢిల్లిలోని ఏపీ భవన్‌ విభజన మొదలుకొని, 9, 10వ షెడ్యూల్‌లోని సంస్థల పంపిణీ వంటివాటిపై కసరత్తు ముమ్మరం చేశారు. ఏపీ భవన్‌ విభజనపై తెలంగాణ నుంచి వివరణ కోరనున్నట్లు తెలిసింది. తొమ్మిది, పదో షెడ్యూల్‌లో ఉన్న మెజారిటీ సంస్థలు, కార్పొరేషన్లపై రెండు రాష్ట్రాలకు ఏకాభిప్రాయాలే ఉన్నాయి. 9వ షెడ్యూల్‌లోని 91 సంస్థలలో 68 సంస్థలపై పెద్దగా ఇబ్బందులు లేవు. హెడ్‌ క్వార్టర్స్‌పైనే రెండు రాష్ట్రాలు పేచీ పెడుతున్నాయి. అయితే వివాదాలున్న వాటిపై తర్వాత చర్చిద్దామని, ముందుగా వివాదాలులేని వాటి పరిష్కారం చేసేందుకు హోంశాఖ సిద్ధమవుతోంది.


కేంద్రం ఎన్ని సమావేశాలు పెట్టినా ఏపీ ఇబ్బందులు సృష్టించడంతో న్యాయపరమైన ఆంటకాలు ఎదురవుతున్నాయి. ఇక ఎన్నికల ఏడాదిలో ఈ అంశం రాజకీయ పరమైన సమస్యగా ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌గా దేశ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రధానాంశంగా ప్రస్తావించనున్నది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పదేళ్లలోపు సమస్యలు పూర్తిగా పరిష్కారం కావాల్సి ఉంది. అయితే ఎనిమిదేళ్లుగా జఠిల సమస్యలతో కాలయాపన జరుగుతోంది. ఎన్నికల ఏడాది ఈ సమస్యలు జాప్యంతో పరిష్కరించన పక్షంలో మళ్లి చట్టసవరణ చేయాల్సిన అవసరం నెలకొననుంది. దీంతో మరిన్ని కొత్త చిక్కులకు ఆస్కారం ఇచ్చినట్లేనని నిపుణులు అంటున్నారు.

అందిన నివేదిక…
కొన్ని అంశాల్లో ఇప్పటికే రాజీపడిన తెలుగు ప్రభుత్వాలు గతంలో అనే దఫాలుగా విభజన సమస్యలపై నివేదికలు సిద్ధం చేయాలని ఈ మేరకు ఇద్దరు సీఎంలు ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చారు. త్రిసభ్య కమిటీలూ కృషి చేశాయి. తెలంగాణ భూభాగంపై ఉన్న పలు ప్రభుత్వరంగ సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పంపకాలకు సంబంధించి చట్టంలోని 9వ, 10వ షెడ్యూళ్ళలో పొందుపరిచిన అంశాలు అత్యంత కీలకమైనందున అందుకు చీఫ్‌ అడ్వయిజర్‌ రాజీవ్‌శర్మ నేతృత్వంలోని ఉన్నతాధికారుల కమిటీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ప్రభుత్వానికి అందజేసింది.

సీఎం కేసీఆర్‌ సూచనలతో పురోగతి…
ఈ అంశంపై కొద్ది రోజుల క్రితం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆస్తులు, అప్పులు, ఇతర చిక్కుముడి అంశాలపై ఏ విధంగా ముందడుగువేస్తే రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగకుండా ఉంటుందన్న కోణంలో కూలంకషంగా చర్చించారు. ప్రధానంగా పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని 9వ, 10వ షెడ్యూల్‌లలో పేర్కొన్న పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి సంస్థల్లో చిక్కుముడిగా మిగిలిన అంశాలపై ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించి తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దాదాపు ఎనిమిదేళ్ల కాలంగా పరస్పర విభేదాలతో పరిష్కారానికి నోచుకోకుండా మిగిలిన సమస్యలన్నింటిని సావధానంగా పరిష్కరించుకునేందుకు సమయం మించిపోతున్నది. చట్టం సూచించిన మేరకు ఉమ్మడి ఆస్తులుగా మిగిలిన కార్పొరేషన్లను 58:42 నిష్పత్తి ప్రాతిపదికన పంపకాలు చేస్తే సమస్య సగం పరిష్కారం కానున్నది. అయితే ఆస్తులు, అప్పులపై ఈ క్రమంలో తలెత్తిన సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కారమయ్యే పరిస్థితి ఇప్పుడు లేదు. ట్రాన్స్‌కో, జెన్‌కో, ఆర్టీసీ లాంటి ఎక్కువ ఆదాయ వనరులు, ఆస్తులు కలిగి ఉన్న ప్రభుత్వరంగ సంస్థల పంపిణీ ఇన్నాళ్ళూ వివాదాస్పదంగా మారి ప్రభుత్వాల మధ్య ఆంతర్యం పెంచేలా చేసింది.
విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌లో మొత్తం 91 సంస్థల్లో షీలాబీడే కమిటీ 68 సంస్థలకు చెందిన ఆస్తులను పంపిణీ చేసింది. రాష్ట్రం ఒప్పుకోని 22 సంస్థల విభజనపై షీలాబీడే కమిటీ సిఫార్సులను తెలంగాణ ఒప్పుకోవడం లేదు. ఈ సంస్థలకు చెందిన ఆస్తులే 90శాతంగా ఉన్నాయి. ఇక దిల్‌ భూములు, కరెంటు బకాయిలు, డిపాజిట్లపై రాద్ధాంతం నడుస్తోంది. ఏ షెడ్యూల్‌లో లేని 32 సంస్థల అంశం కూడా వివాదాస్పదంగా మారింది.

రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే దోరణి…
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచీ పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలంబిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ విషయంలో మరింత వెసులుబాటు కల్పిస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత బలపరుచుకుని ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు చర్యలు ప్రారంభించింది. అయితే అంతకు ముందే పరిష్కరించుకోవాల్సిన విభజన సమస్యలు, జల వివాదాలపై కసరత్తు జరుగుతోంది. ఏపీలో ప్రభుత్వం మారాక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో సఖ్యతను పెంచుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ అనేక అంశాల్లో సర్దుబాటు ధోరణిని ప్రదర్శిస్తున్నారు.

గత భేటీలో తేలని అంశాలను కూడా…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య విభజన సమస్యలు, వివాదాల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 27న న్యూఢిల్లిd నార్త్‌ బ్లాక్‌లో జరిగిన భేటీలో రెండు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. అప్పటి భేటీలో ఎటువంటి పురోగతి లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014కు లోబడి తీసుకునే అన్ని నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని తెలంగాణా ప్రభుత్వం ఈ సమావేశానికి వివరించింది. విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతూ ఏపీ ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆక్షేపించింది. అనేక అంశాలపై కోర్టుకు వెళ్తూ ఏపీ కాలం వృధా చేస్తోందని కేంద్ర హూంశాఖకు తెలంగాణ ఫిర్యాదు చేసింది.

గత సమావేశంలో విద్యుత్‌ బకాయిల విషయం తేలలేదు. షెడ్యూల్‌ 9 సంస్థల విషయంలో డాక్టర్‌ షీలాబిడే కమిటీ సిఫార్సులను పూర్తిస్థాయిలో ఆమోదించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పీటముడి వేసింది. 2017 మే నెలలో ఇచ్చిన హడ్‌ క్వార్టర్‌ నిర్వచనం మేరకే వాటిని విభజించాలని తెలంగాణ మరోసారి నివేదికలో వెల్లడిస్తోంది. జిల్లాల్లో ఉన్న షెడ్యూల్‌ 10 ఆస్తుల పంపకానికి నిబంధనలు ఒప్పుకోవన్న తెలంగాణా వాదనకు కేంద్రం మద్దతు తెలిపింది. సెక్షన్‌ 53 ప్రకారం నిబంధనలకు అనుగుణంగా 68 సంస్థల విభజనకు గతంలోనే ఓకే చెప్పడంతో తెలంగాణకు మేలు జరిగే అవకాశం ఉంది. షీలా బిడే కమిటీ చేసిన మిగిలిన 23 సంస్థల విభజన నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ ఈ సమావేశానికి తెలపనున్నది. ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కేసులో, షెడ్యూల్‌ 10 సంస్థల ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అధికార పరిధి లేదని తెలంగాణ పేర్కొనాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014లో లేని 32 సంస్థల విభజన కుదరదని తెలంగాణ తేల్చి చెప్పి వాటిని విభజించాలంటే చట్ట సవరణ అవసరమన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ వాదనకే కట్టుబడి ఉంది. వాటిలో 10సంస్థలు మూతపడ్డాయని తాజాగా వెల్లడించనుంది. పునర్విభజన చట్టంలో పొందుపరచని అంశాలను రాష్ట్ర విభజన జరిగిన 3 ఏళ్లలోపే కేంద్రం దృష్టికి తీసుకురావాలని సెక్షన్‌ 66లో స్పష్టంగా ఉంది. పునర్విభజన చట్ట ప్రకారం షెడ్యూల్‌ 10 సంస్థల విభజన జరిపితే అభ్యంతరం లేదన్న తెలంగాణ ఇదే వాదనను వినిపించేందుకు సిద్దమవుతున్నది. షెడ్యూల్‌ 9, 10 సంస్థల విభజన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ అనవసరంగా కోర్టు గడప తొక్కింది. అందువల్లే విభజనలో జాప్యం అవుతోందని విభజన భేటీలో ప్రస్తావించేలా నివేదికలు రూపొందించుకున్నది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement