Friday, April 19, 2024

సూది మందుకి స్వ‌స్తి.. కొవిడ్ నివార‌ణ‌కు మందు బిళ్ల‌లు..

ప్ర‌పంచాన్నే గ‌డ గ‌డ‌లాడించింది క‌రోనా వైర‌స్. అస‌లు ఈ వైర‌స్ ఎక్క‌డ పుట్టింది..ఎలా వ్యాపించింది అనే విష‌యాలు ప‌క్క‌న పెడితే..ఈ వైర‌స్ ని అంత‌చేయ‌డానికి ఎన్నో తిప్ప‌లు ప‌డ్డారు వైద్య ప‌రిశోధ‌కులు. కాగా ఎట్ట‌కేల‌కు వ్యాక్సిన్ రూపంలో క‌రోనాని క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చ‌నే ప‌రిస్థితులు నెలకొన్నాయి. దాంతో ఈ వ్యాక్సిన్ ని ప్ర‌తి ఒక్క‌రూ రెండు డోసులు త‌ప్ప‌కుండా వేయించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఇంకా క‌రోనా పూర్తిగా అంతం కాలేదు.. ఇప్ప‌టికే ఫ‌స్ట్, సెకండ్ వేవ్ లు విజృంభించాయి. ఇక థ‌ర్డ్ వేవ్ ముప్పు ముంచుకువ‌స్తోంద‌ని వైద్య బృందాలు హెచ్చ‌రిస్తున్నాయి. ఈ నేప‌ధ్యంలో వ్యాక్సిన్ వేయించుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మ‌రి సూదిమందు అంటే చాలా మందికి భ‌య‌మ‌నే సంగ‌తి తెలిసిందే. అలాంటి వారి కోసం ఓ శుభ‌వార్త‌..

కొవిడ్ నివారణకు మందు బిళ్లలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ ఫైజర్ తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా ఆసుపత్రులపాలై, మరణాన్ని ఎదుర్కోవాల్సిన ముప్పును సుమారు 90% మేర తగ్గించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. వీటిని తాము అభివృద్ధి చేసి, ప్రయోగ పరీక్షలు పూర్తిచేసినట్టు ఫైజర్‌ సంస్థ వెల్లడించింది. ఇక, అన్ని అనుమతులు పూర్తి చేసుకుని త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. కొవిడ్‌ బాధితులకు ఇప్పటివరకూ ఇతర వ్యాధుల నియంత్రణకు ఉద్దేశించిన ఔషధాలను మాత్రమే ఇస్తున్నారు. దీంతో కొవిడ్ నుంచి కొంతమేరకు మాత్రమే ఉపశమనం కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ను కట్టడిచేసే ప్రధాన లక్ష్యంతో మాత్రలను తయారు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక ఔషధ సంస్థలు పోటీ పడుతున్నాయి.

ఈ క్రమంలో అందరికంటే ముందుగా ‘మెరెక్‌’ సంస్థ మందు బిళ్లలను అభివృద్ధి చేసింది. బ్రిటన్‌ ఆరోగ్య శాఖ వీటి ఫలితాలను సమీక్షించి, ఇప్పటికే ఆమోదం తెలిపింది. అటు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే పరీక్షలు పూర్తి చేసుకుని ఆమోదముద్ర పడే అవకాశముందని ఫైజర్ సంస్థ చెబుతోంది. అయితే, కొవిడ్‌ను అత్యంత సమర్థంగా అడ్డుకోగల మాత్రలను తాము అభివృద్ధి చేసినట్టు ఫైజర్‌ ప్రధాన శాస్త్రవేత్త డా.మైకేల్‌ డోల్‌స్టెన్‌ వెల్లడించారు.ఈ మాత్రలు అందుబాటులోకి వస్తే కొవిడ్‌ చికిత్స సులభతరం కానుంది. మొత్తం 775 మంది బాధిత వయోజనులకు ఇతర యాంటీవైరల్‌ ఔషధాలతో కలిపి వీటిని చికిత్సగా అందించార‌ట‌. వీరంతా సుర‌క్షితంగా ప్రాణాల‌తో ఉన్నారు. అందుకే ఈ మాత్ర‌ల‌ను మార్కెట్ లోకి తీసుకురానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement