Sunday, May 9, 2021

అమల్లోకి కర్ఫ్యూ.. తెలంగాణ, ఏపీ సరిహద్దు వద్ద నో ఎంట్రీ!

ఏపీలో కరోనా కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రెండు వారాల పాటు ప్రతీరోజు 18 గంటల చొప్పున కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఈనెల 18 వరకు ప్రతీరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ విధిస్తున్నారు. ఆ సమయంలో ఎక్కడా ఐదుగురికి మించి గుమిగూడి ఉండటానికి వీల్లేదు. వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు వాటిని మూసివేయాలి. ఆస్పత్రులు, వ్యాధి నిర్ధారణ చేసే ల్యాబ్‌లు, ఔషద దుకాణాలతో పాటు కొన్ని అత్యవసర సేవలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది.

ఇప్పటికే ముహూర్తాలు నిర్ణయించుకుని వాటిని వాయిదా వేసుకోలేని పరిస్థితుల్లో నిర్వహించే వివాహాది వేడుకలకు 20కి మించి హాజరుకాకూడదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ప్రకటించింది. అది కూడా స్థానిక అధికారుల నుంచి ముందస్తు అనుమతితో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నిర్వహించుకోవాలి. ప్రభుత్వం మినహాయించిన అత్యవసర విభాగాలు, సేవల రంగాల్లో పనిచేస్తున్న వారు తప్ప మిగతా వ్యక్తులు ఎవరూ కర్ఫ్యూ సమయంలో బయట తిరగడానికి వీలు లేదని స్పష్టం చేసింది. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణతో సహా, వ్యవసాయ రంగానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ వ్యవసాయ శాఖ జారీ చేసే కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. తయారీ రంగానికి చెందిన పరిశ్రమలకు మినహాయింపు నిచ్చారు. విమాన, రైల్వే ప్రయాణికులు టికెట్లు చూపిస్తే ఇరు రాష్ట్రాలలోకి అనుమతి ఇవ్వనున్నారు. కర్ఫ్యూ నుంచి పరిశ్రమలు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు మినహాయింపు ఉంది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు, వైద్యులు, సిబ్బందికి మినహాయింపు ఇచ్చారు. రాకపోకల వేళల్లో విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.

అమల్లోకి కర్ఫ్యూ.. తెలంగాణ, ఏపీ సరిహద్దు వద్ద నో ఎంట్రీ!

మరోవైపు తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఏపీ సర్కార్ అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం 6 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులైన రామాపురం(కోదాడ), పొందుగుల(వాడపల్లి), నాగార్జున సాగర్(మాచర్ల వైపు)మూడు చెక్ పోస్టులను మూసివేశారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్ట్‌ల మూసివేతతో రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బోర్డర్ చెక్‌ పోస్ట్‌ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News