Thursday, April 25, 2024

ఈసారి నో క్రషింగ్.. చేతులెత్తేసిన ‘ఎన్‌సీఎస్‌’యాజమాన్యం..

సీతానగరం, (ప్రభ న్యూస్‌) : ఆంధ్రప్రభ ముందే చెప్పిన విధంగా ఈ ఏడాది క్రషింగ్‌(చెరకు గానుగాట) చేయలేమని ఎన్‌సీఎస్‌ చక్కెరకర్మాగారం యాజమాన్యం చేతులెత్తేసింది. ఆమేరకు ఎన్‌సీఎస్‌ యాజమాన్యం విడుదల చేసిన ప్రకటన గురించి తెలుసుకున్న కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. అలాగే.. గత ఆరేళ్ల నుండి క్రషింగ్‌ వల్ల సుమారు రూ. 100కోట్లు నష్టపోయామని, ఈఏడాది కర్మాగారం పరిధిలో తగిన చెరకు లేదని యాజమాన్యం చెబుతుండడం పట్ల విస్తుపోతున్నారు. క్రషింగ్‌ చేస్తే రూ. 15కోట్ల నష్టం వస్తుందని చెప్పి గానుగవేయలేమన్న అంశాన్ని రాష్ట్ర, జిల్లా అధికారులకు యాజమాన్యం లేఖల ద్వారా తెలపడం దుర్మార్గమని ఆక్షేపిస్తున్నారు. తమిళనాడు తరహాలో రాయితీపై విత్తనాలు అందజేత, టన్ను సరఫరాకు రూ.300 వరకు ట్రాన్స్‌పోర్ట్‌ను ప్రభుత్వం చెల్లింపుచేయాలన్న అంశాలను యాజమాన్యం ఇపుడు ప్రస్తావించడం వంచనపర్వంలో భాగంగా కార్మికులు వాపోతున్నారు.

ఇప్పటికే చెరకు రైతులకు గతరెండు గానుగ సీజన్లలో చెల్లింపు చేయాల్సిన బకాయిలు రూ. 16.34కోట్లు ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ద్వారా చెల్లించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న క్రమం, ఆమేరకు పంచదారను వేలం వేయడం..తద్వారా రూ. 11.5కోట్లు సమకూరడం యాజమాన్యం భారం తగ్గించినట్లే కదా అన్నది కార్మికుల వాదన. రైతు బకాయిలు తీరిపోతే యాజమాన్యానికి వచ్చిన కష్టమేంటని ప్రశ్నిస్తున్నారు కార్మికులు. మరోవైపు మిగిలిన బకాయిలు రూ.5 కోట్లు చెల్లింపు చేయడానికి సీతానగరం, బొబ్బిలి మండలాల్లో 25 ఎకరాల భూమిని వేలం కోసం ఫారం-5జారీ చేసినట్లు గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద రైతు బకాయిలు తీర్చే మార్గం సుగమమైనపుడు కార్మికుల సంగతి ఎందుకు పట్టనట్లని నిలదీస్తున్నారు. తమకు రావాల్సిన వేతనాలు ఇతర బకాయిలు కలిపి సుమారు రూ. 7కోట్లులో యాజమాన్యం ఈ ఏడాది గానుగ ఆట ద్వారా కొంత మేరకైనా చెల్లిస్తారని ఆశిస్తే మొదటికే మోసం వచ్చినట్లయిందని, గానుగాట లేకుండా తమ బకాయిలు ఎప్పుడు తీరుస్తారని ప్రశ్నిస్తున్నారు కార్మికులు.

ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించి తమ బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకుంటే రైతుల తరహాలో తాము కూడా ప్రత్యక్ష ఆందోళనకు దిగనున్నట్లు కార్మికుల మాటల్లో వ్యక్తమవుతుంది. ఒకటి రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటన విడుదల చేస్తామని నాయకులు చెబుతున్నారు . ఆర్‌ఆర్‌ యాక్ట్‌లో తమను కూడా చేర్చి ఆదుకోవాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement