Thursday, March 28, 2024

తెలంగాణలో అవినీతి మంత్రులు లేరు: కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి మంత్రులు లేరని సీఎం కేసీఆర్‌ అన్నారు. అవినీతి రహితంగా, చిత్తశుద్ధితో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. హైచ్ఐసీసీలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో బుధవారం కేసీఆర్ మాట్లాడుతూ.. పాలమూరు- రంగారెడ్డిని పూర్తి చేసుకుంటే రాష్ట్రం మరింత సస్యశ్యామలంగా మారుతుందన్నారు. ఎందరో మహానుభావులు, శ్రేణుల కష్టమే టీఆర్‌ఎస్‌కు ఈ విజయం సాధించి పెట్టిందని తెలిపారు. కర్నాటకలో అవినీతికి పాల్పడిన ఒకరు మంత్రి పదవి కోల్పోయారని, ఆ పరిస్థితి తెలంగాణలో రాదన్నారు. ధరణి ద్వారా రైతులు, భూ యాజమాన్య సమస్య తీరిందని తెలిపారు. గొప్పలు చెప్పుకొని పొంగిపోవడం లేదు.. వాస్తవాలు మాట్లాడుకుంటున్నామన్నారు. పలు పెద్ద రాష్ట్రాలను అధిగమించి మన తలసరి ఆదాయం రూ.2,78,000ని రెట్టింపు కంటే ఎక్కువగా చేసుకున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు 3 మెడికల్‌ కాలేజీలుంటే ఇప్పుడు 33కు పెంచామని తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్, గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ కూడా ఇచ్చామన్నారు. తెలంగాణను జీరో ఫ్లోరైడ్‌ రాష్ట్రంగా నిలిపామని కేసీఆర్ పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజల ఆస్తి అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణకు టీఆర్‌ఎస్‌ ఒక రక్షణ కవచం అన్నారు. రాష్ట్రానికి టీఆర్‌ఎస్‌ పెట్టని కోట అని..దాన్ని ఎవరూ బద్దలు కొట్టలేరని స్పష్టం చేశారు. ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు, ఓటములు…గెలుపుల తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఇప్పుడు దేశానికే రోల్‌ మోడల్‌గా పాలన సాగిస్తున్నామని కేసీఆర్‌ తెలిపారు. 60 లక్షల మంది పార్టీ కార్యకర్తలతో..వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ఉన్న పార్టీ ఒక్క టీఆర్‌ఎస్‌ మాత్రమేనని చెప్పారు. తెలంగాణ ప్రజల కాపలాదారు టీఆర్‌ఎస్‌ పార్టీ అని, దేశంలో 10 ఉత్తమైన గ్రామాల్లో అన్ని తెలంగాణ పల్లెలే ఉన్నాయన్నారు. దేశంలో 20 ఉత్తమ గ్రామాల్లో కూడా 19 తెలంగాణవే ఉన్నాయని తెలిపారు. అవార్డులు, రివార్డులు రాని శాఖలు తెలంగాణలో లేనేలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్‌ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించామని తెలిపారు. ఏ రంగం తీసుకున్నా అద్భుతమైన ఫలితాలను తెలంగాణ రాష్ట్రం సాధించిందని కేసీఆర్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement