Saturday, July 24, 2021

కౌశిక్‌ రెడ్డికి టీఆర్ఎస్‌ టికెట్ లేన‌ట్టేనా ?

టీఆర్ఎస్ పార్టీలో చేరుతామని భావించిన కాంగ్రెస్ మాజీ నేత పాడి కౌశిక్‌రెడ్డి ఇప్పుడు డైలమాలో పడ్డారా? టీఆర్ఎస్ టికెట్ తనదే అని ప్రకటించిన కౌశిక్ కు భంగపాటు తప్పదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు కౌశిక్ రెడ్డి పేరు తెలంగాణ రాజ‌కీయాల్లో మార్మోగిపోయింది. హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా ఉన్న కౌశిక్.. అనూహ్యంగా ఆపార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయ్యారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తార‌ని అంతా భావించారు. అయితే, రేవంత్‌కు టీపీసీసీ పగ్గాలు ఇవ్వ‌డంతో ఆయ‌న కూడా కొంత సందిగ్ధంలో ప‌డ్డారు. క‌రీంన‌గ‌ర్ మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్‌కు టికెట్ ద‌క్కుతుంద‌నే ప్రచారం సాగింది. ఈ క్రమంలో తనకు టికెట్ లభించదనే అనుమానంతో సైలెంట్ గా టీఆర్ఎస్ అగ్రనేతలతో రహస్యంగా మంతనాలు జరిపారు. ఇక ఈ క్ర‌మంలోనే కౌశిక్‌రెడ్డి ఆడియో లీక్ కావ‌డం అందులో ఆయ‌న బీజేపీ కార్య‌క‌ర్త‌తో టీఆర్ ఎస్ టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయింద‌ని చెప్ప‌డంతో కాంగ్రెస్ దీన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకుంది.

కౌశిక్ పై కాంగ్రెస్ బహిష్కరణ వేటు వేయగా.. అంతకంటే ముందే ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.50 కోట్లతో పీసీసీ పదవిని కొన్నారంటూ ఆరోపించారు. అయితే, ఆడియో లీక్‌పై మాత్రం ఎలాంటి కామెంట్లు చేయ‌లేదు. ఇక మూడు రోజుల్లో భ‌విత‌వ్యం ప్ర‌క‌టిస్తాన‌ని చెప్ప‌డంతో ఆయ‌న టీఆర్ఎస్‌లోకి వెళ్ల‌డం ఖాయం అని అంతా అనుకున్నారు. జులై 16న కౌశిక్ టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని ప్రకటించారు. అయితే, దీనిపై టీఆర్ఎస్ వర్గాల నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటలను కౌశిక్ రెడ్డితో ఎదుర్కోవాలని టీఆర్ఎస్ భావించింది. అయితే, ఆడియో లీక్ వ్యవహారంతో కౌశిక్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. ఈ పరిస్థితుల్లో ఆయనను పార్టీలో చేర్చుకుంటే తమకే నష్టమని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందకే టికెట్ విషయంలోపై ఇంకా హామీ ఇవ్వలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన చేరికపై ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కౌశిక్ రెడ్డి రాజకీయ భవిష్యత్ డైలమాలో పడినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి గులాబీ తీర్ధం పుచ్చుకుంటారా? హుజురాబాద్ టికెట్ తెచ్చుకుంటారా? అన్నది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News