Thursday, April 25, 2024

రైల్వేశాఖ కొత్త నిబంధనలు.. అర్ధరాత్రి గానా బజానాకు చెక్‌.. గీత దాటితే జైల్లో..

కాలానుగుణ సంస్కరణలను కొనసాగిస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా రాత్రివేళ ప్రయాణాలపై దృష్టిసారిస్తూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ప్రయాణికుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యమిచ్చేలా ఈ రూల్స్ ఉన్నాయి. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా వ్యవహరించాల్సిన అవసరాన్ని తాజా నిబంధనలు సూచిస్తున్నాయి. రైల్వే మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపట్ల కఠిన చర్యలకూ వెనుకాడబోమని కూడా ఇందులో స్పష్టంచేసింది. రాత్రివేళ ఫిర్యాదులపై తక్షణ చర్యలకు వీలుగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను మరింత క్రియాశీలకం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని రైల్వేశాఖ వెల్లడించింది.

తక్షణమే అమల్లోకి..

ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రూల్స్‌ తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఈ మేరకు అన్ని జోన్లకు ఆదేశాలు వెళ్లాయి. కొత్త రూల్స్‌ ప్రకారం, మీ చుట్టుపక్కల ఉండే ప్రయాణికులు మొబైల్‌ ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడలేరు. లేదా బిగ్గరగా పాటలు లేదా సంగీతం వినడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా అలా ప్రవర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. క్షణాల్లో
రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. కొత్త నిబంధనల ప్రకారం, రైలులో ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదును పరిష్కరించకపోతే ఇందుకు రైల్వే సిబ్బంది జవాబుదారీతనం వహించాల్సి ఉంటుంది.

అలాంటి ఫ‌ర్యాదులే అధికం..

తోటి ప్రయాణికుల నుంచి తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామనే ఫిర్యాదులే ఎక్కువగా ఉంటున్నాయి. కొందరు బిగ్గరగా మొబైల్‌లో మాట్లాడటం, పాటలు వినడం, గుంపులుగా చేరి అల్లరి చేస్తుంటారు. కొన్ని సార్లు రైల్వే స్క్వాడ్ మంద లించినా వీరు లక్ష్యపెట్టరు. తద్వారా ఇతరులకు నిద్రాభంగం అవుతుంటుంది. పైగా రాత్రిపూట లైట్లు వేసివుంచడంపైనా గొడవలు జరుగుతుండేవి. వీటికి పరిష్కార
మార్గంగా కొత్త రూల్స్‌ తీసుకొచ్చారు.

- Advertisement -

కొత్త రూల్స్ ఏమిటంటే..

● రాత్రి 10 గంటల తర్వాత బోగీల్లో అన్ని లైట్లు ఆఫ్‌ చేయాలి.
● ల్యాప్‌ట్యాప్‌, ఫోన్లలో బిగ్గరగా సంగీతం వినకూడదు. మాట్లాడకూడదు.
● గుంపులుగా ఉండేవారు అర్థరాత్రి దాకా చర్చలు ఆపేయాలి.
● సహ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలిగించొద్దు.
● నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వారిపై 139 నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు. వెంటనే ఆర్‌పీఎఫ్‌ రంగంలోకి దిగుతుంది. బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేస్తుంది. ఫిర్యాదు తీవ్రతను బట్టి జైలుకూ పంపుతుంది.
● చెకింగ్‌ స్టాఫ్‌, ఆర్‌పీఎఫ్‌, ఎలక్ట్రీషియన్‌, క్యాటరింగ్ సిబ్బంది, మెయింటెన్స్‌ సిబ్బంది రాత్రిపూట విధులు
నిర్వహిస్తూ, పర్యవేక్షణ కొనసాగిస్తారు.
● 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు రైల్వేసిబ్బంది తక్షణ సహాయం అందిస్తారు.
● ఒకవేళ ఫిర్యాదులపై రైల్వేసిబ్బంది ఉదాసీనంగా వ్యవహరిస్తే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement