Friday, April 19, 2024

ఏపీలో వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి కొత్త నిబంధనలు

ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర. ఈ పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం ఏటా రూ.10వేలు ఇస్తుంది. వాహన బీమా, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌, మరమ్మతుల కోసం ఈ ఆర్థికసాయం ఇస్తోంది. కాగా, ఈ ఏడాది ఆర్థికసాయానికి సంబంధించి కొత్త నిబంధనలతో ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

గతేడాది జూన్‌ నుంచి ఈ ఏడాది మే 31లోపు వాహనాలు కొన్నవారు జూన్ 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. కాగా, గత రెండేళ్లూ వాహనం, డ్రైవింగ్‌ లైసెన్సు కలిగి, తెల్ల రేషన్‌ కార్డుదారులైన వారందరికీ ఈ పథకం కింద ఆర్థికసాయం అందించారు. ఈసారి మాత్రం గత లబ్ధిదారులతోపాటు, కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి పలు నిబంధనలు అమల్లోకి తెచ్చింది.

విద్యుత్‌ బిల్లు ఎక్కువుంటే అనర్హులే
★ గతేడాది లబ్ధి పొందిన వారిలో అర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. ఇందులో పేరు ఉన్నవాళ్లు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
★ గత 6 నెలల (ఏప్రిల్‌ వరకు) సగటు ఇంటి విద్యుత్‌ వినియోగం నెలకు 300 యూనిట్లు దాటితే వారు అనర్హులు.
★ కుటుంబసభ్యుల్లో ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఉండకూడదు, ప్రభుత్వ ఉద్యోగం, పింఛను పొందేవారు ఉన్నా అర్హులు కారు. పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇచ్చారు.
★ దరఖాస్తుదారు వేరే పథకంలో లబ్ధిదారుగా ఉంటే దీనికి అర్హులు కారు.
★ మూడు ఎకరాలకుపైగా మాగాణి, పదెకరాలకు మించి మెట్ట భూమి ఉంటే అనర్హులు. పురపాలక ప్రాంతాల పరిధిలో దరఖాస్తుదారుల కుటుంబానికి వెయ్యి చదరపు అడుగులకు మించి నివాస, వాణిజ్య నిర్మాణ ప్రాంతం ఉండకూడదు.
★ ప్రయాణికుల ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ కాబ్‌ నడిపే యజమానులకే ఈ పథకం వర్తిస్తుంది. సరకు రవాణా వాహనదారులు అర్హులు కారు.

ఈనెల 15న ఆర్థికసాయం జమ
కొత్త వాళ్లు గ్రామ, వార్డు వాలంటీర్ ద్వారా ఈ నెల 7లోపు దరఖాస్తు చేయాలి. వివిధ దశల్లో పరిశీలన అనంతరం ఈ నెల 15న సీఎం చేతుల మీదగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, 56 బీసీ కార్పొరేషన్లు, కాపు, మైనార్టీ, బ్రాహ్మణ, ఈబీసీ, క్రిస్టియన్‌ మైనార్టీ కార్పొరేషన్ల నుంచి ఈ నిధులను వెచ్చిస్తారు. ఈ నిబంధనలు వర్తించని లబ్ధిదారులు, సంబంధిత పత్రాలతో మళ్లీ దరఖాస్తు చేసుకునే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఏడాదిలోపు వాహనాన్ని అమ్మితే అనర్హులు అవుతారని, అయితే వారు కొత్త వాహనం కొంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement