Friday, April 19, 2024

బంగారం కొంటున్నారా? అయితే, ఇది తెలుసుకోండి!

బంగారం కొంటున్నారా? అయితే, మీరు కొన్ని రూల్స్ తెలుసుకోవాలి. బంగారం క్రయవిక్రయాలకు సంబంధించి గోల్డ్ హాల్‌ మార్కింగ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త రూల్స్ జూన్ 1 నుంచి అమలులోకి రాబోతున్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్  హాల్‌మార్క్ తప్పనిసరి కానుంది. అది లేకుండా నగలు అమ్మడానికి వీలు లేదు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటన చేసింది. ఈ హాల్‌ మార్క్ తో బంగారం నాణ్యమైనదా కాదా అనేది తెలుస్తుంది.

బీఐఎస్ హాల్ మార్క్ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తూ ఇచ్చే మార్క్.అయితే ఇంతకాలం హాల్ మార్క్ నగల విక్రయాన్ని తప్పనిసరి చేస్తూ ప్రత్యేకంగా నిబంధనలు ఏవీ లేవు. దీంతో చాలా మంది వ్యాపారులు మోసం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని బంగారు నగల కొనుగోలులో జరిగే అక్రమాలకు చెక్‌ పెట్టడానికే ప్రభుత్వం బంగారం స్వచ్ఛతను నిర్ధారించే హాల్‌మార్క్‌ను తప్పనిసరి చేసింది.

దీనిని 2019 నవంబర్‌లో కేంద్రం అమల్లోకి తేవాలని కేంద్రం ప్రయత్నించింది. అయితే, తమకు కొంత టైమ్ కావాలని అప్పట్లో నగల వ్యాపారులు కోరారు. దీంతో కేంద్రం 2021 జనవరి 15 వరకూ గడువు ఇచ్చింది. అయితే ఈ గడువును జూన్ 1కి పొడిగించారు. దీనికి కరోనా వైరస్ ప్రధాన కారణం. ఇక గడువును పెంచే ప్రసక్తి లేదని కేంద్రం స్పష్టం చేసింది. జూన్ 1 నుంచి బంగారం వ్యాపారులు హాల్‌ మార్క్ లేని నగలను అమ్మడానికి వీలులేదు.

ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న బంగారంలో 40 శాతం వరకూ హాల్‌మార్క్‌తో అమ్ముడవుతున్నాయి. కొత్త రూల్స్ అమలులోకి వస్తే.. జువెలర్స్ 14 క్యారెట్, 18 క్యారెట్, 22 క్యారెట్ బంగారాన్ని మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అలాగే బీఐఎస్ మార్క్ తప్పనిసరి. ప్రస్తుతం దేశంలో 40 శాతం బంగారం మాత్రమే హాల్‌మార్క్‌కు వెళ్తోంది.  ఇప్పటివరకు 34,647 మంది వ్యాపారులు జువెలర్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్( BIS) దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు. వచ్చే రెండు నెలల్లో ఈ సంఖ్య లక్ష దాటుతుందని అంచనా.

జువెలరీ షాపులు కచ్చితంగా గోల్డ్ హాల్‌‌మార్క్ కలిగిన బంగారాన్ని మాత్రమే విక్రయించాలి. అయితే ప్రజలు వారి వద్ద ఉన్న పాత బంగారాన్ని సులభంగానే విక్రయించొచ్చు. వీటికి గోల్డ్ హాల్ మార్క్ అవసరం లేదు. ఇకపోతే జువెలరీ సంస్థలు కొత్త రూల్స్ ఫాలో కాకపోతే జైలు శిక్షతోపాటు భారీ జరిమానా పడే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement