Friday, June 25, 2021

అసోం నూతన సీఎంగా హిమంత బిశ్వ శర్మ

అసోంకు కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై సందిగ్దతకు తెరపడింది. ప్రస్తుత సీఎం శర్వానంద్ సోనోవాల్‌ను బీజేపీ పక్కనబెట్టింది. ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మను సీఎం అభ్యర్థిగా ఖరారు చేసింది. ఆదివారం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో హిమంత బిశ్వ శర్మను ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ నేతగా ఎన్నుకున్నారు. హిమాంత పేరును శర్వానంద్ సోనోవాల్ ప్రతిపాదించగా.. ఇతర ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. త్వరలోనే సీఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల ఎన్నికల జరిగిన రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడగా.. అసోంలో మాత్రం సీఎం పదవికి ఇద్దరు నేతల మధ్య గట్టి పోటీ నెలకొనడంతో జాప్యం జరుగుతోంది. మొత్తం 126 స్థానాలున్న అసోం అసెంబ్లీలో 75 చోట్ల ఎన్‌డీఏ కూటమి విజయం సాధించింది. ఇందులో బీజేపీ 60 సీట్లను గెలిచింది. కాంగ్రెస్ కూటమి 51 స్థానాలను దక్కించుకుంది.

కాగా కాంగ్రెస్‌లో సీఎం పదవి దక్కకపోవడంతో హిమంత శర్మ 2016 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. అదే పరిస్థితి ఇప్పుడు మళ్లీ తలెత్తడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో కనీసం 30 మంది శర్మకు మద్దతిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హిమంత వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గుచూపింది. బీజేపీ ఎక్కువ సీట్లు సాధించిన ఎగువ అసోం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది సోనోవాల్‌కు మద్దతుగా ఉన్నారు.

అయితే బీజేపీలో పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న కాంగ్రెస్‌ పార్టీ.. హిమాంతకు గాలం వేయడానికి కూడా ప్రయత్నించింది. ఆయన బీజేపీ నుంచి బయటకు వస్తే తమ పార్టీ ఎమ్మెల్యేలంతా మద్దతు ఇస్తారని ప్రకటించింది. కాంగ్రెస్ ప్రకటనతో బీజేపీ అప్రమత్తమయ్యింది. సోనోవాల్‌కు సర్ది చెప్పి హిమాంత బిశ్వ శర్మనే చివరకు సీఎంగా ఎంపిక చేసింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News