Sunday, October 6, 2024

నీలం సంజీవ‌రెడ్డికి నివాళి… నీలం వంటి త్యాగధనుడు మళ్ళీ పుట్టాలి

ఆంధ్రపదేశ్ లో, అనంతపురం జిల్లాలోని ఇల్లూరు గ్రామంలో 1913 మే 19వ తేదీన ఒక రైతు కుటుంబంలో శ్రీ నీలం సంజీవరెడ్డి జన్మించారు. సంజీవరెడ్డి తల్లి సుబ్బమ్మ గారు, తరిమెల సుబ్బారెడ్డి కి సోదరి. క్రమశిక్షణా, నీతి నియమాలకు,ధైర్యసాహసాలకు నీలం వారు,తరిమెలవారు సుప్రసిద్ధులు. సంజీవరెడ్డికి తండ్రి నుండి, అసాధారణ నాయకత్వ లక్షణాలూ, మేనమామ నుండి ఆచరణాత్మకమైన వివేకం సంక్రమించాయి.1929 సం||లో గాంధీజీ అనంతపురంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అప్పటికి సంజీవరెడ్డి వయసు 16 సం||.సిల్క్ దుస్తులతో సమావేశానికి వచ్చిన సంజీవరెడ్డి, అందరిలాగానే పార్టీ ఫండ్ కోసం, తన దగ్గర ఉన్న పాకెట్ మనీతో, వేలంలో గాంధీగారి నుండి వెండి కేస్కేట్ (CASKET)ను కొనుక్కొని భద్రంగా దాచుకున్నారు. తక్షణం ఖాదీ దుకాణానికి వెళ్లి ఖాదీ దుస్తుల్నికొని ధరించారు.

ఆ క్షణం నుంచీ,ఖాదీదుస్తులను మాత్రమే ధరించేవారు. మహాత్ముని పట్ల శ్రీ సంజీవరెడ్డి విపరీతంగా ఆకర్షితులయారు. 1932-33లో డాక్టర్ పట్టాభి సీతారామయ్య అనంతపురం రావడం జరిగింది. సమావేశానికి వచ్చిన యువకుడైన – సంజీవరెడ్డి –ముఖ వర్చస్సునూ, వ్యక్తిత్వసరళినీ గమనించి, ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. సంజీవరెడ్డి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుని దేశ సేవలో పాల్గొనవలసిందిగా కోరారు.20 సం|| కూడా రాకముందే తల్లి గారి స్వస్థలం తరిమెల లోని రామాలయంలో శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారి ఆశీర్వాదం లభించింది.“రామ తారక”మంత్రోపదేశం ద్వారా సంజీవరెడ్డి శ్రీరామునికి పరమ భక్తులయారు.
అతి క్లిష్ట పరిస్థితులలో కూడా, జీవితాంతం రామ నామం ఉచ్చరించడం ఆపలేదు. కొన్ని కొన్ని సమయాలలో, ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయేవారు. భౌతిక సుఖాల పట్ల ఆసక్తి లేకుండా, జీవించారు.జనక మహారాజు సంప్రదాయాన్ని పాటించారు. బాహ్యంగా ఎన్ని పదవులు అధిష్టించినా, అంతరంగంలో మటుకు, జ్ఞాన సముపార్జనకూ, ఆత్మానంద శోధనకూ, ఆరాటపడుతూ ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించారు. ఆత్మగౌరవం, ఆత్మ నిగ్రహం ఆత్మజ్ఞానం, అంతర్గత సాధనం, నిబంధనం, సంజీవరెడ్డి సమున్నత లక్షణాలు.ఆనాడు రాయలసీమలోని మారుమూల పల్లెటూళ్ళో జన్మించిన ఒక రైతుబిడ్డ దేశసంక్షేమ దిశగా పయనిస్తూ, రాజనీతిజ్ఞుడై, సకలజనులకూ, ఆరాధ్యుడై, దేశాధ్యక్షుడై, నిష్కళంక చరితుడై, కోట్లాదిమంది హృదయాలలో సుస్థిర స్థానాన్ని అధిష్టించగలిగారు. ప్రజాస్వామ్య పరిపాలనలో, దేశాభివృద్ధికీ, దేశ సౌభాగ్యానికీ,ఎనలేని కృషిచేసిన, నిత్య కృషీవలుడు,నిష్కళంక ప్రజానాయకుడు, నిరుపమాన త్యాగధనుడూడాక్టర్ సంజీవరెడ్డి. స్వశక్తితో, స్వయం ప్రతిభతో, ఆత్మవిశ్వాసంతో, రాజకీయ చతురతో,దేశాధ్యక్ష పదవిని అధిష్టించిన మహానాయకుడాయన.తేరిచూడలేని శిఖరాగ్రాల నదిష్టించినా, ఆయన ఆత్మీయమైన పలకరింపు,వయో తారతమ్యాలనూ, సామాజికపరమైన స్థితిగతులనూ, మరపింపజేస్తుంది, మురిపింప జేస్తుంది.
ఆయన రాజకీయ నేపథ్యం– ఆత్మీయ, ఆధ్యాత్మిక అనుబంధాల సుగంధం.వీరోచిత, విప్లవాత్మక నిష్కళంకచరితం.ఇంటి పెద్దగా, ఆదర్శనీయులైన భర్తగా, మమతానురాగాలను పంచిఇచ్చే తండ్రిగా, తాతగా, ఆధ్యాత్మిక గురువుగా, చైతన్య స్ఫూర్తిగా, మార్గదర్శకునిగా ఆయన ఉనికితో పవిత్రతను సంతరించుకున్న ఆయన కుటుంబ నేపథ్యం,ఆరాధ్యనీయం. ఆత్మీయానుబంధాల నేపధ్యంలో ఆయన నాకు పితృసమానులు. మా నాన్నగారికి ప్రాణ మిత్రులు.మా కుటుంబానికి ఆత్మబంధువు. మా సుదీర్ఘ సహచర్యంలో, జన్మజన్మల బంధం సుస్పష్టమౌతూవుంటుంది. ఆయనో దేశాధినేతగా అనిపించేవారు కాదు. ప్రేమాస్పదులైన ఇంటి పెద్దగానే కన్పించేవారు.1935వ సం|| లో శ్రీ సంజీవరెడ్డి వివాహం మేనమామ శ్రీ తరిమెల సుబ్బారెడ్డి గారి కుమార్తె నాగరత్నమ్మ గారితో జరిగింది. అప్పటికే కాంగ్రెస్ ప్రచార బాధ్యతల స్వీకరించి జాతీయ ఉద్యమంలో ప్రముఖునిగా ముందు నిలిచారు. తన తాలూకాలో మద్యపాన నిషేధాన్ని ప్రవేశపెట్టాలని ప్రచారం చేశారు.
ప్రజలలో చైతన్యస్ఫూర్తిగా నిలిచారు.1936లో రెండో ప్రపంచ యుద్ధం రావడానికి కొన్ని సంవత్సరాల ముందు ఆంధ్ర ప్రొవెన్షియల్ కమిటీకి సెక్రటరీగా, శ్రీ సంజీవరెడ్డిని పట్టాభి సీతారామయ్య, శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారునియమించటం జరిగింది. ఈ పదవిలో శ్రీ సంజీవరెడ్డి 10 సం|| పనిచేశారు. ఆయన శక్తి యుక్తులూ, నిర్మాణాత్మక పథకాలూ, వాటి ఆచరణ విధానాలూ గమనించిన సీనియర్ నాయకులంతా విస్మయం చెందేవారు. శ్రీ సంజీవరెడ్డి లోని జ్ఞానపిపాసనీ, అంకితభావాన్నీ, త్యాగనిరతినీ, ఉద్యమస్ఫూర్తినీ, గమనించిన శ్రీ నెహ్రూ ఉత్తేజితులయారు. అఖిలభారత స్థాయిలో వృద్దిలోకి వచ్చే నాయకత్వ లక్షణాలు ప్రత్యేకంగా గమనించారు.కాంగ్రెస్ ను బలోపేతం చేయటానికి, బలమైన నాయకునిగా, సంజీవరెడ్డి సేవలను వినియోగించుకోవాలన్న దృఢమైన నిర్ణయానికి వచ్చారునెహ్రూ.1940 సం||లో వెల్లూరు జైల్లో ఉన్నప్పుడు “భారత జాతీయ కాంగ్రెస్” చరిత్రను పట్టాభి సీతారామయ్య గారు చెప్తూవుండగా, సంజీవరెడ్డి వ్రాసేవారు.ఆ తర్వాత కాలంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు అవుతామని ఇద్దరూ అనుకుని వుండరు.1942 ఆగస్టు క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంలో, శ్రీ సంజీవరెడ్డిని, వేలూరు జైలుకు, అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి జైలుకు పంపించడం జరిగింది, అప్పుడే జన్మించిన మూడవ కుమార్తెకు “అమరావతి” అని నామకరణం చేశారు. సత్యాగ్రహ సమయంలో శ్రీ సంజీవరెడ్డిని, గాంధీజీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. అక్కడకు వెళ్ళాక తిరిగి అరెస్ట్ చేయబడ్డారు. కుమారుని జాడ తెలియక కన్నీరు మున్నీరవుతున్న తల్లి సుబ్బమ్మ గారి దగ్గరకు, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా హుటాహుటిన వచ్చారు.
ఆమెను, భార్య నాగరత్నమ్మ గారినీ,వోదారుస్తూ “దిగులు పడకండి సంజీవరెడ్డి క్షేమంగా ఉన్నారు. అంతేకాదు ఆయన భవిష్యత్తులో దేశాధినేత అవుతారు” అంటూ ఆశీర్వదించారు.స్వాతంత్ర పోరాట సమయంలో గాంధీజీకి అతి సన్నితంగా మెలిగిన సంజీవరెడ్డి, త్యాగపూరిత నిష్కళంక వ్యక్తిత్వానికి, ఆకర్షితులైన గాంధీజీ ఆప్యాయంగా సేవాశ్రంకి ఆహ్వానించి, ప్రేమ పూర్వకంగా చూసుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు మొట్టమొదటి ముఖ్యమంత్రి సంజీవరెడ్డి. భారత దేశంలో ఎన్నికైన ముఖ్యమంత్రులందరికన్నా ఆయనే అతి పిన్న వయస్కులు. సంస్కృతికీ, సంస్కారానికీ, విద్యార్హతలతో సంబంధం లేదనీ, సంపద విజ్ఞానంతో సరితూగలేదనీ, సామర్థ్యానికీ వయస్సుకీ సంబంధం లేదనీ నిజాయితీ,నిష్కళంక వ్యక్తిత్వం, త్యాగ శీలతా, అంకితభావం, అకళంక దేశభక్తీ, త్యాగనిరతీ,వుంటే చాలుననీ, దేశానికి తెలియజేశారు. నిరూపించి చూపించారు.1962లో మెజారిటీ పార్టీ నాయకునిగా, శ్రీ సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయారు. రాజకీయ స్థిరత్వానికి తిరిగి ఊపిరిపోశారు. అర్హతకు తప్ప, ఆశ్రిత పక్షపాతానికి తావులేని విధంగా అన్నివిధాల ప్రజలను సంతృప్తి పరిచే బాటలో పాలన సాగిపోయింది.అనేక రాజకీయ సంక్షోభాలను, నిగ్రహంతో ఎదుర్కొన్నారు. ఉపముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేసిన కాలంలోనే, నీటిపారుదలా, విద్యుదుత్పత్తికీ, సంబంధించినఅనేక ప్రాజెక్టులు ప్రారంభింపబడ్డాయి.
విజయవాడలో,కృష్ణానదిపైన, నిర్మించిన రోడ్డూ, రైలు వంతెన సంజీవరెడ్డి,చొరవవలననే సాధ్యపడ్డాయి. అతి తక్కువ సమయంలో పూర్తి చేయబడిన ఈ వంతెన దేశానికి గణనీయమైన లాభాలను తెచ్చిపెట్టింది. ప్రతిష్టాకరమైన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే మొదలైంది. ఆయన సారధ్యంలో 18 ప్రాజెక్టులు పైగా నిర్మాణ దశలో వుండగా, ప్రపంచ చరిత్రలోనే, ఆంధ్రప్రదేశ్ అత్యున్నత వ్యవసాయ క్షేత్రంగా, వ్యవస్థగా, అగ్రస్థానంలో నిలిచింది. చిన్న ప్రాజెక్టుల నుంచి నిధులను మళ్ళించి, గోదావరి పైన వంతెన నిర్మించి, ప్రమాదాలను అరికట్టడమే కాకుండా, లక్షలాది భక్తులకు, భద్రాద్రి రాముని దర్శనాన్ని సులభతరం చేశారు. శ్రీశైలానికి మెటల్ రోడ్లు వేయించారు.కర్నూల్ జిల్లా బస్సు రూట్లను జాతీయం చేసిన సందర్భంలో, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫలితంగా, 1964 ఫిబ్రవరి 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రవాణా సంస్థను ప్రభుత్వ పరం చేయటం పైన ముఖ్యమంత్రి పాత్ర పట్ల, న్యాయస్థానం పరోక్షంగా చిన్న అనుమానం వక్తం చేసింది అంతే. దేశవ్యాప్తంగా క్షీణిస్తున్న కాంగ్రెస్ గౌరవం, ప్రతిష్ట, శ్రీ సంజీవరెడ్డి రాజీనామాతో, కాంగ్రెస్ స్థాయిని అత్యున్నత స్థితిలో నిలిపింది.అధికారం, పదవులూ, తనకు తృణ ప్రాయాలనీ, వాటిపైన తనకు వ్యామోహం ఎంత మాత్రం లేదనీ,మరొకసారి తేట తెల్లం చేశారు. 1967 సం|| జనవరిలో హిందూపూర్ నుండి లోక్ సభ సభ్యునిగా ఎన్నికై, అతను పాతలోక్ సభ స్పీకర్ గా ఆయన అన్ని పార్టీల వారికీ ఆరాధ్యనీయులు అయ్యారు. 1977 జూలైన భారత రాజకీయ చరిత్రలో అరుదైన చారిత్రాత్మకమైన రోజు, శ్రీ సంజీవరెడ్డి భారత రిపబ్లిక్ రాష్ట్రపతిగా అన్ని రాజకీయ పార్టీలూ, ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థించగా ఏకగ్రీవంగా ఎన్నికయారు.
నాలుగు దశాబ్దాలపైగా రాజకీయ రంగంలో ఎన్నో పదవులను అధిష్టించి, నిరుపాయమైన విశేషానుభవాన్ని సొంతం చేసుకున్న రాజకీయ దురంధరుడు, ప్రియతమ నేత శ్రీ సంజీవరెడ్డి దేశాదినేత కావడం అన్ని వర్ణాల వారికీ, అన్ని పార్టీల వారికీ, ముఖ్యంగా ఆంధ్రులకి గర్వకారణం. భారత రాష్ట్రపతిగా తన పదవీ కాలాన్ని పూర్తిచేసుకుని – రాజకీయాలు విరమించుకుని తన స్వస్థలమైన అనంతపురంలో – కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని, ఆరోగ్య దృష్ట్యా, బెంగళూరులో స్థిరపడిపోయారు. భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఆయన మేరు శిఖరం. స్వతంత్ర భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో, నవభారత స్వాతంత్ర ఉద్యమంలో, ఆయన తిరుగులేని మహానాయకుడు, మాన్య చరితులు. రాష్ట్రపతి పదవీ విరమణ తర్వాత, అనంతపూర్ లో ఉన్న సమయంలో, వీరి సలహాల కోసం, ఆశీస్సుల కోసం, ప్రముఖ నాయకులందరూ తరలి వచ్చేవారు. రాష్ట్రపతులుగా పనిచేసిన జ్ఞాణిజైల్ సింగ్,వెంకట్రామన్ తో పాటుగా, ప్రధాన మంత్రులుగా ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ -ఇలా – ఎందరో ఎందరో ప్రముఖులతో అనంతపురం కన్నుల పండుగా ఉండేది. రాజకీయ పరిస్థితులను తలుచుకొని అతిధులతో ఆవేదన పంచుకునేవారు.“మితిమీరిన స్వార్థంతో – అధికారం కోసం – అడ్డదారుల్లో పోరాటాలు చేస్తున్నారు”. ఇది చాలా అనాగరికం. అరాచకం, ముఠా కక్షలు,హత్యా రాజకీయాలు ప్రాంతీయ విభేదాలు,ఎక్కువైపోతున్నాయి. నా దగ్గరికి వచ్చే రాజకీయ నాయకులందరితోనూ నిక్కచ్చిగా చెప్తున్నాను -పదవులకోసం ఇంతగా దిగజారిపోవాలా? ప్రజలను తక్కువ అంచనాలు వేయకండి. ఎప్పుడో ఒకసారి తీవ్రంగా ఎదురు తిరిగి బుద్ది చెప్తారు – జాగ్రత్త అని -“ఏమిటీ కోట్ల సంపాదన?బ్రతకడానికి ఇంత అవసరమా?”- అని ఆ త్యాగధనుడు తీవ్రంగా మదనపడేవారు. ఈనాటి రాజకీయ అరాచకాలకు ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుందో! ఆయన చివరి రోజుల్లో ఒక కోరిక కోరుకున్నారు . “నేను భారతీయుణ్ణి, ఏ ప్రాంతానికో, రాష్ట్రానికో, సంబంధించిన వాడిని కాను,అందుకే అందరూ నా వారే – నేను అందరివాడినే- అందుకే నా మరణానంతరం నేను ఎక్కడుంటే అక్కడే నా అంత్యక్రియలు జరిపించండి” అని – ఆయన ఆఖరి కోరిక నెరవేరింది. బెంగళూరులో ఆయన దివ్య ఆత్మ దైవ సన్నిధికి చేరుకొని కోట్ల ఆత్మబంధువుల హృదయాల్లో నిలిచి మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటుంది. అయితే తన సర్వసాన్ని రాష్ట్రం కోసం, దేశం కోసం అర్పించి, తన త్యాగ ఫలాలను మన కోసం, మన ప్రగతి కోసం, నిక్షిప్తపరిచిన, ఆ మహనీయుని జయంతి ( 19 మే 1913)వర్థంతి ( 1 జూన్1996 ) రోజుల్లో నైనా – ఆయనను స్మరించుకోవడం మన ధర్మం కాదా !, మన బాధ్యత కాదా! మన కర్తవ్యం కాదా ! ఆయన మానస పుత్రికగా నా హృదయాంజలులను సమర్పించుకుంటున్నాను.

  • డాక్టర్. కె. వి. కృష్ణకుమారి.7995919809
Advertisement

తాజా వార్తలు

Advertisement