Wednesday, February 8, 2023

Odisha | పేద‌ల పట్ల బీజేపీది మొస‌లి క‌న్నీరు.. రైతుల‌ను దెబ్బ‌తీయాల‌ని చూస్తున్నారు: నవీన్​ పట్నాయక్​

పేద‌ల ప‌ట్ల బీజేపీ మొస‌లి క‌న్నీరు కారుస్తోందని ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ ధ్వ‌జ‌మెత్తారు. బీజేపీ నాయ‌కులు అబ‌ద్దాలాడుతూ, ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే య‌త్నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప‌దంపూర్ నియోజ‌క‌వ‌ర్గానికి డిసెంబ‌ర్ 5వ తేదీన ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో జార్భంద్, పైక్మాల్ బ్లాకుల్లో బీజేడీ నిర్వ‌హించిన స‌భ‌ల్లో సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌సంగించారు. బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడిన న‌వీన్ ప‌ట్నాయ‌క్ త‌న ప్ర‌సంగాన్ని జై నృసింగ‌నాథ్‌తో ప్రారంభించారు.

- Advertisement -
   

జై నృసింగ‌నాథ్ స్థానికుల‌కు ఇష్ట‌మైన దేవుడు. అయితే పేద‌ల ప‌ట్ల బీజేపీ మొస‌లి క‌న్నీరు కారుస్తోందని సీఎం నవీన్​ పట్నాయక్​ మండిప‌డ్డారు. ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న కింద 5 ల‌క్ష‌ల ఇండ్ల నిర్మాణం పూర్తి చేసినందుకు గానూ కేంద్రం నుంచి త‌మ‌కు అవార్డు వ‌చ్చింద‌ని సీఎం గుర్తు చేశారు. కానీ, బీజేపీ ఎంపీలు రాజ‌కీయంగా త‌న‌కు గుర్తింపు రావొద్ద‌నే ఉద్దేశంతో పీఎం ఆవాస్ యోజ‌న కింద రాష్ట్రానికి వ‌చ్చే ఇండ్ల‌ను ఆపార‌ని మండిపడ్డారు. ఈ స్కీంను రాష్ట్రంలో అమ‌లు కానివ్వ‌కుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వ‌ల్ల రెండేండ్ల‌లో 10 ల‌క్ష‌ల మంది ఇండ్లు కోల్పోయార‌ని ప్రమాదం ఉందన్నారు.

కెందూ ఆకు వ్యాపారం చేసుకునే రైతుల‌పై కేంద్రం జీఎస్టీ అధికంగా విధిస్తోందన్నారు సీఎం నవీన్​ పట్నాయక్​. బంగారంపైన 3 శాతం జీఎస్టీ విధిస్తే, రైతులు వ్యాపారం చేసుకునే కెందూ ఆకుపై 18 శాతం జీఎస్టీ విధించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. చివ‌ర‌కు రైతుల‌ను కూడా కేంద్రం వ‌దిలిపెట్టడం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీజేపీ నాయ‌కుల మాట‌ల‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని స్థానిక ప్ర‌జ‌ల‌కు సూచించారు. ప‌దంపూర్ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కేవ‌లం బీజేడీతోనే సాధ్య‌మ‌వుతుంద‌ని ప‌ట్నాయ‌క్ స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement