Thursday, April 25, 2024

ఫోన్​ కొట్టేశాడన్న అనుమానం.. దళిత బాలుడి చేతులు కట్టేసి, బావిలో వేలాడదీసిండు

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో తొమ్మిదేళ్ల బాలుడిని ఘోరంగా చిత్రహింసలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాను ఓ మొబైల్ ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో బాలుడి చేతులు కట్టేసి బావిలో వేలాడదీశారు. ఓ యువకుడు ఇట్లా చేయడం ద్వారా మొబైల్ దొంగతనం వెనుక ఉన్న నిజాన్ని కనుగొనే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్​ని అక్కడే ఉన్న మరో బాలుడు వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అయితే.. వీడియో రికార్డ్ చేసిన బాలుడిని లవ్ ఖుష్‌నగర్ ఇన్‌చార్జి పోలీసు అధికారి కొట్టడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. తీవ్రంగా గాయపడిన ఆ బాలుడిని చికిత్స నిమిత్తం లవ్‌ కుష్‌నగర్‌లోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్​చల్​ అవుతోంది. ఇది ఛతర్​పూర్​ జిల్లా లవ్ కుష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్టోహా అవుట్‌పోస్ట్  ఏరియాలో జరిగినట్టు తెలుస్తోంది.

ఈ సంఘటనను వివరిస్తూ ఇంకో బాలుడు మాట్లాడుతూ.. అతను తన పొలం వైపు వెళ్తున్న సమయంలో కొంతమంది బావిలో ఒక బాలుడిని వేలాడదీయడం చూశానని, దీంతో ఆ వీడియో తీసినట్టు వివరించాడు. దీంతో తనను పోలీసులు కొట్టారని పేర్కొన్నాడు. పోలీసు అధికారి చెప్పుతో కొట్టారని కన్నీరుపెడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే పోలీసులు నిందితుడు అజిత్ రాజ్‌పుత్‌ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీఐ 08 , ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్​ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement