Friday, April 26, 2024

తెలంగాణ మినహా అంతటా లాక్ డౌన్!

దేశంలో కరోనా వ్యాప్తి రోజురోజుకూ వేగంగా విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా రోజు వారి కరోనా కేసులు 4 లక్షలు దాటుతున్నాయి.  మరణాల సంఖ్య కూడా 4 వేలకుపై గానే ఉంది. దీంతో కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు అవుతోంది. మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్, కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. అయితే, తెలంగాణలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా… లాక్ డౌన్ విధించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రస్తుతం నైట్ కర్ఫ్యూను మాత్రమే అమలు చేస్తున్నారు.

దేశంలోని కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, కర్ణాటక, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు అవుతోంది. దేశంలో దాదాపు 16 రాష్ట్రాల్లో లాక్ డౌన్, 11 రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్ అమలు అవుతోంది. ఒక్క తెలంగాణలో మాత్రమే నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో పలు జిల్లాలో పలుచోట్ల స్వచ్ఛంద లాక్‎డౌన్ పాటిస్తున్నారు. ఎవరికి వారే స్వీయ నియంత్రణలో ఉంటున్నారు.

మరోవైపు తెలంగాణలో లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ఉండదని, లాక్ డౌన్ తో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందన్నారు. ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ పెట్టినా ప్రయోజనం ఉండటం లేదని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా రోగులు హైదరాబాద్ కు వస్తున్నారని, హైదరాబాద్ పై భారం పెరిగిపోయిందన్నారు.  అయితే, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలు పోతుంటే.. ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచిస్తారా ? అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. సీఎం కేసీఆర్ కు , మంత్రి కేటీఆర్ కు కరోనా వచ్చినా.. కూడా రాష్ట్రంలోని పరిస్థితిపై అంచనా వేయడం లేదని విమర్శలు చేస్తున్నారు. ఇద్దరు కరోనా నుంచి కోలుకుంటే.. రాష్ట్రంలో కేసులు సంఖ్య లేనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.  

దేశంలో ఓ వైపు వ్యాక్సిన్ ఆలస్యమవుతోంది.  పలు రాష్ట్రాల్లో పేషెంట్లకు ఆక్సిజన్ సరైన సమయానికి అందడం లేదు. ఆస్పత్రులలో వైద్య సదుపాయాలు కూడా సరిగా లేవు. డాక్టర్లు, సిబ్బంది కొరత కూడా వేధిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే పరిస్థితి చేయి దాటిపోతుంది. ఈ నేపథ్యంలోనే దేశంలో లాక్ డౌన్ పెట్టాలని డిమాండ్ వినిపిస్తోంది. కరోనా మహమ్మారి గొలుసును నియంత్రించాలంటే  లాక్ డౌన్ తప్పనిసరి విపక్షాలు కోరుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement